Home కలం తొలి లోకసభలో తెలుగు గళం

తొలి లోకసభలో తెలుగు గళం

Pendyala-Ramarao

తాను చెప్పే మాటలకు, ఆచరణలకు ఏమాత్రం తేడా లేకుండా ఉండేవారు అరుదు. అలాంటి అరుదైన మహామనీషి ఆయన. చిన్న వయసులోనే ఆర్యసమాజంలో కీలకపాత్ర పోషించి, అస్పృశ్యత ఎల్లెడలా ఉన్న సమయంలో దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితమే దళితులతో తన ఇంట్లోనే సహపంక్తి భోజనాలను ఏర్పాటుచేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. వితంతు వివాహాలను సైతం ప్రోత్సహించారు. ‘గాంధీ పుట్టాలి కానీ మా ఇంట్లో కాదు..’ అనే తరహా సంస్కర్తలుగా కాకుండా మనసా, వాచా, కర్మణా సంస్కరణలను ప్రోత్సహించిన గొప్ప మనసు ఆయనది. తన ఇంట్లోనే వితంతు పునర్వివాహం చేయించారు. ఆయనే మొదటి లోక్‌సభకు వరంగల్‌నుండి ఎన్నికై, తెలుగువారి సమస్యలను చట్టసభలో హిందీలో సమర్థవంతంగా వినిపించిన గొప్ప పార్లమెంటేరియన్, సాహిత్యకారుడు పెండ్యాల రాఘవరావు.
స్వయంగా సాయుధ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు రాఘవరావు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళనాయకుడిగా ఆయన కృషి శ్లాఘనీయం. అజ్ఞాతవీరుడిగా ఆయన గొప్ప కృషి చేశారు. మూడు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి, గ్రామ స్థాయిలో సర్పంచ్‌గా పనిచేసిన వారు బహు అరుదు. రాఘవరావు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన తర్వాత కూడా తమ స్వగ్రామంలో సర్పంచ్‌గా రెండు దశాబ్దాలపాటు పనిచేసి, స్వగ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
అది 1947. దేశమంతా స్వాతంత్య్రం పొందినా తెలంగాణకు ఇంకా స్వాతంత్య్ర ఫలాలు అందని కాలమది. ప్రజా ఉద్యమాలను అత్యంత హేయమైన రీతిలో అణచివేసి, సైనిక పాలన నిర్వహిస్తున్న నిజాం రాచరిక పాలన రోజులవి. ఆ రోజుల్లో పెండ్యాల రాఘవరావు రచించిన గేయం ‘నా దేశం భారత దేశం’. ఈ గేయం 1974 ఆగస్టు 29న ‘జనధర్మ’ అనే పత్రికలో ప్రచురితమైంది. దాదాపు డ్బ్బై ఏళ్ల క్రితం రాసినా, ఈ గేయంలో రాఘవరావు పేర్కొన్న పరిస్థితులు నేటికీ మారలేదు.

“మన్ను బంగరౌ మాన్యాలున్నా
సాలెల్ల పారే సెలయేర్లున్నా
గంగ గౌతమిలు ఘనముగనున్నా
మడిలో మొక్కకు తడిలేదన్నా”

ఈ గేయం రాసి దాదాపు డ్బ్బై సంవత్సరాలవుతున్నా వ్యవసాయం పరిస్థితి ఇప్పటికీ అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నా, ఇప్పటికీ సాగునీరు అందని పరిస్థితి అంతటా నెలకొంది. పీడిత, పీడక వర్గాల పోరును కూడా పెండ్యాల రాఘవరావు తన కవిత్వంలో స్పష్టంగా పేర్కొన్నారు.

“దుక్కిన దుక్కి దక్కదురన్నా
చేసిన కష్టం చెందదురన్నా
రాజనాల పంట రాజోరికంట
దొడ్డు డ్డు పంట బీదోరికంట”

అన్నారు రాఘవరావు. ఉన్నత వర్గాలకు, నిమ్న వర్గాలకు వనరుల పంపిణీలో అసమానతలు స్పష్టంగా వెల్లడించిన కవిత్వం ఆయనది. పంటను ఎంతో కష్టపడి పండించినా, పెద్దవారికి మాత్రమే ఆ పంట దక్కుతుందని పేదవారికి మాత్రం నాణ్యత లేని పంట లభిస్తుందని ఆయన అభిప్రాయం.

“రక్తమొడ్డినా రైతు పంటను
దోచుకుపోయే దొడ్డు దొరలతో
కండలు కరిగిన కార్మిక కష్టం
కాజేసి కూర్చుండే కార్ఖానాదారులతో”

కేవలం కర్షకులకు మాత్రమే సమస్యలు కావని, కార్మికులకూ కష్టాలున్నాయని ఆయన చెప్పారు. కార్మికుల కష్టాన్ని పెట్టుబడిదారులు హరిస్తున్నారని సులభ గ్రాహ్యంగా ఆయన వివరించారు.
వనరులు ఉన్నా అవి కేవలం ఉన్నవారికి మాత్రమే పనికొస్తున్నాయని, లేనివారికి విద్య, వైద్యం అందని మానులని ఆయన అభిప్రాయం.

“మింటను అందే మిద్దెలుయున్నా
పూరి గుడిసెలే పేదోరికన్నా
విద్యలు వైద్యాలు ఉన్నోరివన్నా
చీకటి చావులు చిన్నోరివన్నా”

చిట్టి చిట్టి పదాలతో ఎక్కువగా చదువుకోనివారికి కూడా స్పష్టంగా అర్థమయ్యేలా వర్గపోరును చిక్కగా చిత్రించిన కవిత్వ పాదాలు రాఘవరావువి. మరి కట్టుకునే బట్ట పరిస్థితి ఎలా ఉంది? పేదవారికి కనీసం బట్ట అయినా దొరుకుతుందా అనే ప్రశ్నలకు సమాధానం చెప్తారాయన.

“గుట్టల కొద్దీ బట్టల గట్టాల్
కొట్లల్లో వుండి చీకుతు వుంటే
నేసిన కూలికి వీసమె లేక
దిసమొల నుండె దీనులు వుండె”

అంటారు. బట్టల దుకాణాల్లో గుట్టలు గుట్టలుగా బట్టలు ఉంటే, వాటిని నేసిన నేతన్న పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. నేతన్నకు చుట్టుకోవడానికి బట్ట ముక్కయినా లేదని, నేతన్న పరిస్థితిని అత్యంత ప్రభావవంతంగా వివరించారు పెండ్యాల రాఘవరావు. తాను మాత్రమే గేయాలు, కవిత్వాలు రాయడం కాకుండా ఇతరులతో రాయించి, పాడించేవారు ఆయన. మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో ఇతర రచయితలతో పాటలు రాయించి, పాడించారు. “మన భూమి హితమే కోరీ… మానరా మధుపానము… మానీ సుఖియించరా…. మానీ సుఖియించరా” మొదలైన పాటలు మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో రావడానికి ఆయన తోడ్పాటే కారణం.
గ్రంథాలయోద్యమంలోనూ రాఘవరావు పాత్ర కీలకం. గ్రంథాలయాల అవసరాన్ని గుర్తించి, పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేసి, ఐదు వందల గ్రంథాలతో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పరిచారు. పుస్తకాలను చదవడం తప్పనిసరిగా ఒక అలవాటుగా చేసుకోవాలని ఆయన గ్రామీణులను ప్రోత్సహించారు. ఈ లక్ష్య దిశగా ఆయన కృషిలో భాగమే రాత్రి బడుల ఏర్పాటు, వయోజన విద్య కేంద్రాల వ్యవస్థాపన.
పుచ్చలపల్లి సుందరయ్య మొదలైనవారితో కలిసి, ఉద్యమాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు రాఘవరావు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 1952 నుండి 1957 వరకు ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్న కాలం అత్యంత కీలకమైంది. పెద్ద మనుషుల ఒప్పందం, రాష్ట్రాల పునర్విభజన, నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మాణం, మొదటి పంచవర్ష ప్రణాళిక ఆరంభం మొదలైనవన్నీ ఆ సమయంలోనే జరిగాయి. అలాంటి కీలక తరుణంలో ప్రజావాణిని పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వానికి తెలియపరిచారు రాఘవరావు. ఎన్నో అంశాలపై, సమస్యలపై సాధికారికంగా ఆయన మాట్లాడేవారని ఆయన సమకాలికులు పేర్కొంటారు. కనీస వేతనాల చట్టం ఏర్పాటుకూ ఆయన పార్లమెంటు ఉపన్యాసం ఎంతో ప్రభావం చూపించిందంటారు.
తన ఆత్మకథ రచనలోనూ సామాజికాంశాలకే పెద్ద పీట వేసిన గొప్ప రచయిత పెండ్యాల రాఘవరావు. ‘నా ప్రజా జీవితం’ పేరుతో ఆయన రాసిన ఆత్మకథలో నాటి సామాజిక రాజకీయ ఘటనలకు తన ప్రతిస్పందన రాయడం ద్వారా నాటి పరిస్థితులకు దర్పణం పట్టారు.
1917 మార్చి 15న జన్మించిన పెండ్యాల రాఘవరావు 1987 సెప్టెంబరు 10న మరణించారు. ఆయన శత జయంతి సంవత్సరం సందర్భంలో ఆయన వర్ధంతి రోజున ఆయనను స్మరించుకోవడం సాయుధ పోరాట వారసత్వాన్ని గుర్తుకుచేసుకోవడమే.