Home లైఫ్ స్టైల్ చేతులు కలుపుదాం.. సేవ చేద్దాం..

చేతులు కలుపుదాం.. సేవ చేద్దాం..

Famly-image

ప్రార్థించే పెదవుల కన్నా.. పనిచేసే చేతులు మిన్న అనే మాట ద ఫాలో ఆఫ్ హెల్పింగ్ హాండ్స్ సంస్థకు చక్కగా వర్తిస్తుంది.  తిండి, బట్టలాంటి కనీస అవసరాలు లేకుండా నిస్సహాయ స్థితిలో రోడ్లపై జీవన పోరాటం చేసేవారు, అయిన వారి ప్రేమకు నోచుకోని అభాగ్యులు, అనారోగ్యంతో బాధపడుతూ పట్టించుకునేవారు లేక అల్లాడేవారు.. ఇలాంటి వారి దయనీయ స్థితిని చూసి అయ్యో పాపం అనేసి ఊరుకోకుండా, వారికి ఎంతో కొంత తమ వంతు సాయం చేస్తోందీ సంస్థ.  తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ ఆలోచనలోంచి పుట్టిందే హెల్పింగ్ హ్యాండ్స్. ఇద్దరితో మొదలై ప్రస్తుతం 150 మంది వరకు సభ్యులుగా చేర్చుకుని సేవలందిస్తున్న ప్రశాంత్‌తో యువత మాటామంతీ…

తనతోపాటు స్నేహితులు, బంధువులను కలుపుకొన్నాడు. ఇప్పుడు ఈ సంస్థలో 150 మంది సభ్యులున్నారు. వీరంతా ఓ గ్రూప్‌గా ఏర్పడి సేవ చేస్తున్నారు. వీరిలో కొందరు ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని రకాల వారు చేరి తమకు తోచిన సాయం అందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలందిస్తున్నారు. ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా వీరికి సమాచారం అందిస్తే చాలు చిటికెలో అక్కడ వాలిపోయి వారికి సాయం చేస్తుంటారు. 2011 కేవలం ఇద్దరితో మొదలైన హెల్పింగ్ హ్యాండ్స్ ఇప్పుడు 150 మంది సభ్యులకు చేరింది. ఉన్నవారి దగ్గర తీసుకుని లేని వాళ్లకు పెట్టడమే వీరి పని. ఉద్యోగస్తులైతే తమకు తోచినంత నగదు సాయం చేస్తుంటారు. చదువుకునేవాళ్లైతే పుస్తకాలు ఇస్తుంటారు. వాటిని అనాథ పిల్లలకు అందచేయడం ఈ సంస్థ పని.

‘హెల్పింగ్ హ్యాండ్స్’ ఆలోచన ఎలా వచ్చిందంటే…కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలనే ఆలోచన చిన్న పాప వల్ల వచ్చింది. 2011 బాసరలో వసంత పంచమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఒక పాప తప్పిపోయి ఏడుస్తూ కన్పించింది. ఆ పాప తల్లిదండ్రుల కోసం చాల వెతికా. ఆ సమయంలో ఆ పాప ఒక మహిళని చూస్తూ అమ్మా అని ఏడుస్తుంది. ఈ పాప మీ పాపనా అని అడిగితే ఆమె కాదు అని అక్కడ నుండి వెళ్లిపోయింది.అప్పుడు నాకు అనుమానం వచ్చి ఆమెను అనుసరించాను. మా పక్క ఊరు నిజామాబాద్ వరకు వెళ్ళాక ఆమె కనబడలేదు. అపుడు ఏం చేయాలో అర్థంకాలేదు. నాకు తెలిసిన వారి దగ్గర ఆ పాపని ఉంచాను.

కొన్ని రోజుల తరవాత నేను మా ఇంట్లో ఉన్నపాత వార్తాపత్రిక తిరగేస్తే అందులో పాప తల్లి మీరేనా అని నేను అడిగిన మహిళ గోదావరి నదిలో పడి చనిపోయింది అని ఉంది. ఇటు చూస్తే ఆ పాపకి క్యాన్సర్ అని తెలిసింది. ఈ విషయం తెలిసి కూడా పిల్లలు లేని ఒక ఫ్యామిలీ ఆ అమ్మాయిని దత్తత తీసుకుంది. 2016 లో ఆ పాప చనిపోయింది. ఇలా మొదలైన మా ప్రస్థానం. ఎవరైనా వారి చుట్టుపక్కల సహాయం అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు అని సమాచారం అందిస్తే వెంటనే అక్కడకి దగ్గరలో ఉన్న మా వాలంటీర్ వెళ్లి, నిజంగా వారికి సాయం అవసరమా లేదా అనే విషయం తెలుసుకుంటాడు. దాన్ని మాకు అందిస్తాడు. ఆ తర్వాత మేం సాయం కోరితే వెంటనే తోచిన సాయం చేస్తాం.

మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమంటే ..పేదపిల్లలకు, అనాథలకు బట్టలు, చదువుకునేందుకు పుస్తకాలు అందించడం. కుటుంబాలకు దూరంగా ఉంటున్నవారికి ఆత్మస్థైర్యం కలిగించడం ఇలాంటివారికి మేమున్నాం అనే భరోసాను కల్గించడం. ఇలాంటి వారికి ఎవరైనా డబ్బులు, ఆహారం ఇస్తారు. కానీ మాకంటూ ఆత్మీయులు లేరే అనే మనోవేదనని ఎవరు దూరం చేయగలరు. అలాంటి వారి మనోవేదనని దూరం చేయడానికి మేం కృషి చేస్తున్నాం. మాకు కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులు, మిగతావారు ఆర్థిక సాయం చేస్తుంటారు. ఇంకా అనాథ పిల్లలతో కాసేపు గడుపుతూ ఉత్సాహం కలిగిస్తుంటారు. హైదరాబాద్‌లోనేకాకుండా మిగతా జిల్లాల్లోనూ మా టీం ఉన్నారు. ప్రతి నెలా కనీసం 15 పైగా కార్యక్రమాలు చేస్తుంటాం. ఇప్పటివరకు దాదాపు 100 నుంచి 500 వరకు పలు కార్యక్రమాలు చేసాం.

మా టీం సభ్యులందరం చదువుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ద ఫాలో ఆఫ్ హెల్పింగ్ హ్యండ్స్ అనే పేరు ఉద్దేశ్యం ఏంటంటే.. నది ఎలాగైతే ప్రజలందరి దాహం తీరుస్తుందో అలాగే మాతో కలిసే ఒక్కో చేయి సహాయం కోసం ఎదురు చూసే వారి కష్టాలను తీరుస్తుంది.అందుకనే మా గ్రూప్‌కి ఆ పేరు పెట్టాం.

శ్రీభారతి నృత్యాలయ..

రోడ్డు మీద భిక్షాటన చేస్తున్న వృద్ధులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, మతి స్థిమితం లేని వారిని గమనిస్తాం. మొదట వారితో మాట్లాడి వారిని ఆశ్రమాల్లో చేర్చడానికి ప్రయత్నిస్తాం. తర్వాత వారికి కావలసిన ఆహారం, మందులు అందిస్తాం. అనాథాశ్రమాల్లోని పిల్లలకి చదువు, ఆటలు, నేర్పిస్తూ వారికి కావలసిన బట్టలు, పుస్తకాలు సేకరించి అందిస్తాం. ఈ మధ్యనే క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని తపన ఉండి, ఫీజులు కట్టలేని ప్రతిభగల విద్యార్థులను ఎంపిక చేసి శ్రీభారతి నృత్యాలయ అని ఒక డాన్స్ స్కూల్‌ని ఏర్పాటుచేశాం. నామమాత్రపు ఫీజు తీసుకుంటూ అదికూడా కట్టలేని విద్యార్థులకు ఉచితంగా నేర్పిస్తున్నాం. ఇలా వచ్చిన డబ్బుని పేదలకి సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నాం. టీం సభ్యులందరం ప్రతి నెలా మొదటి వారం కలుస్తాం. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు, అలాగే ఆ నెలలో జరగవలసిన కార్యక్రమాల గురించి చర్చించుకుంటాం.

చాలా మంది అడుగుతుంటారు. ఇలా చేయడం వల్ల మీకేంటి లాభం అని.. సహాయం మా పెట్టుబడి. అది పొందిన ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం మాకు వచ్చే లాభం అంతే.. మా సహాయం కావాలంటే లేదా మమ్మల్ని కలవాలంటే 96522 29688 ,theflowofhelpinghands@gmail.com,ద ఫాలో ఆఫ్ హెల్పింగ్ హ్యండ్స్ ఫేస్‌బుక్ పేజీ ద్వారా సంప్రదించవచ్చు.

బాధగా అనిపించింది…

మేము డిగ్రీ చదివే రోజుల్లో మాకు ప్రశాంత్ సీనియర్. తను అప్పుడప్పుడు మమ్మల్ని మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ స్కూల్ కి తీసుకు వెళ్ళేవాడు. మొదటి సారి వెళ్ళినప్పుడు నాకు భయం వేసింది. తల్లిదండ్రులే వెలివేసిన ఆ పిల్లల్ని చూసి బాధగా అనిపించింది. ఆ రోజు నుండి ప్రతి ఆదివారం కచ్చితంగా ద ఫాలో ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ తో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. – శ్వేత యంబిఏ ఫైనాన్స్, నిజామబాద్

పిల్లలతో గడపడం ఆనందం…

హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అవసరమైన వారికి సాయం చేయడం ఆనందంగా ఉంది. పిల్లలతో గడపటం, వారితో అభిప్రాయాలను పంచుకోవడం, వారి సందేహాలను నివృత్తి చేయడం, వారిని సామాజికంగా , మానసికంగా ఎదిగేలా చేయడం, వారిలో ఆత్మ స్థైర్యాన్ని కలిగించడం ..ఇవన్నీ మాకు చాలా ఉత్సాహాన్ని కలిగించే అంశాలు.
పి. రాజేందర్. బి.ఏ., ఎల్‌ఎల్‌బి. (టివియస్ యస్ రాష్ట కార్యదర్శి)

 అలవాటుగా మారింది.. 

ప్రశాంత్, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నాం. చదువుకుంటూ ఆనాథకి సహాయం చేయడం, ప్రతి ఆదివారం పిల్లలతో సరదాగా గడపడం  అలవాటుగా మార్చుకున్నాం. చాలా మంది సహాయం చేద్దాం అంటే ముందు  సెటిల్ అవ్వాలి. తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తుంటారు.   చివరికి వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినపుడు ఎదుటివారు వాళ్ళు కూడా వీళ్ళని అలాగే వదిలేస్తారు. అందుకే విద్యార్ధి దశ నుండే పరోపకారం అనేది పిల్లలకి నేర్పిస్తే వారి వల్ల దేశానికి  మేలు కలుగుతుంది. ఈ దిశలో కృషి చేయడానికి ద ఫాలో ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్‌తో  కలిసి పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. –       మహమ్మద్ సైఫోద్దీన్, టీం సభ్యుడు

ఉచితంగా కూచిపూడి నేర్పిస్తున్నా..

నేనొక కూచిపూడి డాన్స్ టీచర్‌ని. అనాథ పిల్లలకు, పేదవారికీ సహాయం చేయాలనే తపన ఉండేది. కానీ ఎలా చేయాలో తెలిసేది కాదు. ఆ సమయంలో హెల్పింగ్ హ్యాండ్స్‌తో పరిచయం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో ఇప్పటి వరకు 40 మంది విద్యార్థులకు కూచిపూడి నేర్పించాను. ఈ మధ్యనే నేర్చుకోవాలనే కోరిక ఉండి, ఫీజులు కట్టలేని విద్యార్థులను ఎంపిక చేశాం. వారికి ఉచితంగానే నేర్పిస్తున్నా. శ్రీ భారతి నృత్యాలయ చేస్తున్న సేవలను గుర్తించి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా॥ నందిని సిధారెడ్డి చేతుల మీదుగా ఉగాది పురస్కారం, శ్రీ మానుకుంట సాంబశివ మాస్టారు నుండి నంది అవార్డు , శ్రీ నిశుంభీత నాట్య జనపీఠ్ నుండి నాట్య రాజకం అవార్డులు అందుకున్నాం. –
పర్వీన్ చంద్ర, శ్రీ భారతీ నృత్యాలయ టీచర్