Home ఆఫ్ బీట్ బతుకమ్మ విరులు ఆరోగ్య సిరులు

బతుకమ్మ విరులు ఆరోగ్య సిరులు

Tangedu-Flower

బతుకమ్మ అంటే ఓ నాలుగు పూలు తెచ్చి సిబ్బిలో పేర్చి నీళ్లలో అనపడం కాదు. పేర్చిన ఆ నాలుగు పూలల్లో నలభై రకాల ఔషధ గుణాలతో పాటు, క్రిమిసంహారకాలుగా పనిచేసే రసాయనాలూ ఉన్నాయన్నది వాస్తవం. అవును బతుకమ్మలో వాడే పూలు బతుకమ్మకు అందంతో పాటు, ఆడినవారికి, ఊరి జనానికి ఆరోగ్యాన్నిస్తాయి. అడవిలో పూచే రంగు రంగుల పూలు జతైతే అద్భుతమైన బతుకమ్మ తయారవుతుంది. ఇలా అందంగా తయారైన బతుకమ్మ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదంటూనే, భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలియజేస్తుంది. అడవిలో పుట్టిన పూలను తెచ్చి ఓపికగా బతుకమ్మ పేర్చి ఆడిపాడి చెరువుల్లో, బావుల్లో అనపడంలో శాస్త్రీయ ధృక్పథం ఉంది.

ఈ విషయాన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ నేల గ్రహించింది. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి… లాంటి పూలతో బతుకమ్మను పేరుస్తారు. వీటిల్లో యాంటీ బయోటిక్స్‌గా పనిచేసే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. అలాగే గుమ్మడి ఆకులపై ఉండే తెల్లని వెంట్రుకల్లాంటి నిర్మాణాల్లో యాంటీ బయోటిక్ లక్షణాలుంటాయి. ఈ పూలు, ఆకులతో తయారుచేసని బతుకమ్మలను చెరువుల్లో అన్పడం వల్ల వాటిలో స్వతహాగా అభివృద్ధి చెందే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌ల లాంటివి నశిస్తాయి. వందల సంఖ్యలో నీళ్లలో విడిచే బతుకమ్మల వల్ల, వీటిని తయారుచేసేందుకు వాడిన పూలల్లో ఉండే కెమికల్స్ నీటిలో కరిగి క్రిములను నశింపజేస్తాయి. దాంతో చెరువులు, కుంటల్లో ఉండే నీళ్లు పరిశుభ్రమవుతాయి.

సాధారణంగా వర్షాకాలంలో చెరువులు, కుంటలు కొత్త నీటితో నిండుతాయి. కొత్త నీటిలో సూక్ష్మక్రిములు త్వరగా వృద్ధి చెందుతాయి. ఈ నీటిని నేరుగా తాగడం వల్ల టైఫాయిడ్, కలరా, డయేరియా, న్యుమోనియా, టిబి లాంటి వ్యాధులు వస్తాయి. ఇప్పుడంటే వీటిని నివారించేందుకు రకరకాల వాటర్ ప్యూరిఫయర్లు వచ్చాయి కాని వైద్య సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందని నాటి కాలంలో సహజ పద్ధతులను అనుసరించేవారు. అందుకే కొత్తనీరు వచ్చి చేరిన సమయంలో బతుకమ్మ పండుగు చేసుకొని, నీటిని శుభ్రపరిచే సాధనంగా బతుకమ్మను ఉపయోగించుకున్నారన్నది స్పష్టమవుతోంది. సరిగ్గా వర్షాకాలం పూర్తయ్యే సమయంలో బతుకమ్మ పండుగ చేసుకోవడం, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్న పూలతో బతుకమ్మలను పేర్చి నీటిలో కలపడం సంప్రదాయంగా మారింది. బతుకమ్మకు వాడే తంగేడు, గునుగు, గుమ్మడి, కట్ల, పట్నంబంతి లాంటి పూలల్లో ఉండే ఔషధ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మన పెద్దల ఆరోగ్యపరమైన జాగ్రత్తలకు ఆనవాళ్లు.

తంగేడు(సెన్నా/ కాసియా ఆరిక్యులేటా) – మధుమేహంతో వచ్చే కంటి ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో, జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పుల నివారణలో తంగేడును వాడతారు. మలబద్ధకం, పచ్చ కామెర్లు, లివర్ జబ్బులు, మూత్ర కోశ వ్యాధులకు మందుగా తంగేడును వాడతారు. విరోచనకారిగా పనిచేస్తుందిది. చర్మ సంబంధ సమస్యలకు విరుగుడుగా తంగేడు ఆకులను వాడతారు. కడుపులో పెరిగే నులిపురుగుల నివారణకు, రుమటాయిడ్ ఆర్థ్రైటీస్, గౌట్ నివారణలో కూడా తంగేడు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి.

గునుగు(సెలోసియా అర్జెంటియా) – ఈ ఆకులను గాయం అయిన చోట కట్టు కట్టేందుకు వాడతారు. ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడే పుండ్లను నయం చేసేందుకు ఈ పూలను వాడతారు. రక్తంతో కూడిన స్టూల్స్‌కు, హ్యమెరేజ్ వల్ల అయ్యే రక్తస్రావ నిలుపుదలకు, అతిసార, కలరా లాంటి వాటికి మందుగా ఈ పూలను వాడతారు. ట్రైకోమోనాస్ లాంటి పరాన్నజీవులను శక్తివంతంగా అరికడుతుంది. పాము విషానికి విరుగుడుగా ఈ మొక్కలోని ప్రతి భాగం పనిచేస్తుంది. ఈ మొక్క వేళ్లను గనేరియా, గజ్జి లాంటి చర్మ సంబంధ సమస్యలకు మందుగా వాడతారు. ఆఫ్రికా దేశాల్లో గునుగు పూలను ఆహారంగా తీసుకుంటారు. లేత పూలను సూపుల్లో వాడతారు. వీటి గింజల నుంచి నూనె తయారుచేస్తారు.

బంతి(ట్యాగెటెస్ ఎరెక్టా) – బంతిపూల నూనెలో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా పనిచేస్తుంది బంతి. కాస్మటిక్స్ తయారీలో బంతి పూలను ఉపయోగిస్తారు.

కట్ల(పొమియా) – క్యాన్సర్, డయాబెటిక్ నివారించే లక్షణాలు ఈ పూలల్లో పుష్కలంగా ఉన్నాయి. నొప్పి నివారిణిగా కూడా పనిచేస్తుందిది.

గుమ్మడి(కుకుర్బిటాల్) – మధుమేహం, ట్యూమర్ల నివారిణిగా పనిచేస్తుంది. నొప్పి నివారిణిగా, అధిక రక్తపోటు నివారించడంలోనూ పనిచేస్తుంది గుమ్మడి పువ్వు. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయిందులో. కడుపులో నులిపురుగుల, మూత్ర సంబంధ సమస్యల నివారణలో గుమ్మడి అద్భుతంగా పనిచేస్తుంది. ఔషధ గుణాలున్న గుమ్మడిని మనం అనాదిగా వాడుతూండగా, అమెరికన్లు 19వ శతాబ్దం నుంచి వాడుతున్నారు.

బీర(లుఫ్ఫా) – దీని వేళ్లు కఫాన్ని నిర్మూలించడంలో పనిచేస్తాయి. బీర ఆకులను జాండీస్‌కు మందుగా వాడతారు.

పట్నం బంతి(సెలెండ్యులా) – కండరాలు బిగదీసుకుపోకుండా నివారిస్తుందిది. ఈ పూలు గొంతు నొప్పిని తగ్గించడంలో పనిచేస్తాయి.