* సొసైటీలుగా మారుస్తూ
రాష్ట్రాలకు కేంద్రం లేఖ
* వ్యతిరేకిస్తున్న తెలంగాణ
ప్రభుత్వం
* బిజెపి పాలిత రాష్ట్రాల్లో
సోసైటీలుగా ఏర్పాటు
* ఉద్యోగులు, సిబ్బందిలో
ఆందోళన
మన తెలంగాణ/మంచిర్యాలప్రతినిధి : గత కొన్నేళ్లుగా కార్మికులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్న కార్మిక బీమా ఆసుపత్రి (ఈఎస్‌ఐ)లను కార్మిక రాజ్య బీమా సంస్థ సహకార సంఘం సొసైటీలుగా మార్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అన్నిరాష్ట్రాలకు లేఖలు పం పగా తెలంగాణ ప్రభుత్వం సొసైటీల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాల సహాకారంతో ఈఎస్‌ఐ వైద్య సేవలు అందిస్తుండగా ఇకపై కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతలను స్వీకరించనుంది. ఈమేరకు సొసైటీలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ఈఎస్‌ఐ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని రాష్ట్రాలకు లేఖలు అందాయి. ఈఎస్‌ఐలో సమగ్ర మార్పులు చేయాలని ఇటీవల జరిగిన కేంద్ర కార్మిక శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలోని కాగజ్‌నగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ పరిధిలోని నాశారం, రామచంద్రపురం, కవాడిగూడ, సనత్‌నగర్‌లలో మొత్తం 70 డిస్పెన్సరీలు ఉండగా సుమారు 5 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 85.05 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 14.05 శాతం వాటాతో ఈఎస్‌ఐ ఆసుపత్రులు డిస్సెన్సరీలను నిర్వహిస్తూ కార్మికులకు మెరుగైన వైద్య బీమా సేవలను అందిస్తున్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలను స్వయం ప్రతిపత్తి సొసైటీగామార్పు చేసి, ఆసుపత్రులను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కార్మికులు, ఉద్యోగుల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సొసైటీలుగా ఏర్పాటుచేసే నిర్ణయాలను అంగీకరించేది లేదని, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి ఇప్పటికే కేంద్రానికి వ్యతిరేకిస్తూ అభిప్రాయాన్ని పంపించారు.
తెలంగాణ ప్రభుత్వం అంగీకరించకున్న అన్ని రాష్ట్రాల్లో సొటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయంతీసుకుంది. దేశవ్యాప్తంగా బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు తాజాగా కర్ణాటకలో సైతం సొసైటీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. సొసైటీలు ఏర్పడినట్లయితే ఈఎస్‌ఐ వైద్య సేవల నిర్వాహన మొత్తం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్తుంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఈఎస్‌ఐ పరిధిలో దాదాపు 14 లక్షల మంది కార్మికులు,వారి కుటుంబ సభ్యులు 70 లక్షల మంది మొత్తం 84 లక్షల మంది ఉన్నారు. ఇందులో సుమారు 5 వేల మంది సిబ్బంది పని చేస్తుండగా వీరంతా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నియమించబడ్డారు. వీరికి జీతబత్యాలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుండగా సొసైటీ పరిధిలోకి ఈఎస్‌ఐ వెళ్తే రాష్ట్రంలో పని చేస్తున్న 5 వేల మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. సొసైటీలుగా ఏర్పడినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈఎస్‌ఐ ఆసుపత్రిలను ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉండడంతో వీరిని ఉంచుకోవాలో తీసివేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికి ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. సొసైటీలుగా ఏర్పడినట్లయితే వారికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించే అవకాశాలు ఉండకపోవడం వలన ఉద్యోగుల జీతబత్యాలపై ఆందోళన నెలకొన్నాయి. కేంద్ర కార్మిక శాఖ పరిధిలో వైద్యసేవలను అందించేందుకు 1948లో ఈఎస్‌ఐలను ఏర్పాటు చేస్తూ చట్టాన్ని రూపొందించింది. దీనికి అనుగుణంగా 1952 డిసెంబర్ 24న అప్పటి ప్రధాని నెహ్రు ఈఎస్‌ఐ పథకాన్ని ప్రారంభించారు. 1955 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజు వైద్య సేవలు మొదలయ్యాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ఈఎస్‌ఐలను సోసైటీలుగా ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకోవడం వలన కొన్ని ఆసుపత్రులు మూతపడడమే కాకుండా ప్రైవేట్ పరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొసైటీల ఏర్పాటు నిర్ణయంపై ఉద్యోగులు,సిబ్బంది ఆందోళన బాట చేపడుతున్నారు.