Home ఎడిటోరియల్ విద్యా రుణాల భారీ బకాయిలు

విద్యా రుణాల భారీ బకాయిలు

Education-Cartoon

విద్య అంతకంతకూ ఖరీదు అయిపోవడంతో చదువులకోసం రుణాలు తీసుకొనేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. వారిలో చాలామంది భారీగా ఫీజులు వసూలు చేసే ప్రయివేటు సంస్థలలో చదువుకుంటున్నందువల్ల రుణాలపై ఆధారపడుతున్నారు. ఉన్నత విద్యకు తీసుకొంటున్న రుణాలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. 2000 సంవత్సరంలో అవి మొత్తం
రూ. 300కోట్లు కాగా ఇప్పుడది రూ.72,000 కోట్లను చేరింది. విద్యా రంగం నుంచి మొండి బకాయి (ఎన్‌పిఎ)లు అత్యంత వేగంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
సాధారణంగా ఈ డబ్బు చేరేది ప్రయివేటు ఉన్నత విద్యా సంస్థ లకు. అవి ప్రధానంగా రాజకీయవాదుల నిర్వహణలోనివి. నాసిరకం బోధనలతో వారు ఇంత సొమ్ము గడిస్తున్నారు. ఆ రుణాలను రద్దు చేయాలని తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఆ రుణాలు ఉన్నత విద్యను చాలా మందికి అందుబాటులోకి తేవడం ద్వారా మంచికే వినియోగ మయినట్లు అలా డిమాండ్ చేసేవారు అంటున్నారు. తీసుకొన్న రుణాలు ఎగగొట్టడాన్ని ప్రజాస్వామ్య బద్ధం చేయడం వల్ల సమాజానికి మేలు కలుగుతుందా అన్నది ముందు స్పష్టం కావాలి. ఇటీవల ఓ నివేదిక చెబుతున్న దానిని బట్టి విద్యారంగంలో బ్యాంకులకు మొత్తం మొండి బకాయిలు 2013 మార్చిలో గల రూ. 2,615 కోట్ల నుంచి డిసెంబర్ 2016 నాటికి రూ. 6,336 కోట్లకు పెరిగాయి. అంటే మన బ్యాంకులు 142 శాతం విద్యార్థి రుణాల ఎగవేతను చవిచూశాయి.
విద్యార్థి రుణాల బకాయిలు తీర్చకుండా ఎగవేసే ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరం. ఇంతవరకు ఇటువంటి సమస్య అమెరికాకే పరిమితం అని భావించేవారు. ఆ దేశంలో విద్యార్థి రుణ బకాయిల మొత్తం1.3 ట్రిలియన్ డాలర్లు. విద్యా ఖర్చులు పెరిగిపోతున్నందు వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. విద్యను మధ్యలో మానివేసి తక్కువ జీతానికి ఉద్యోగ మార్కెట్‌లో చాలామంది చేరిపోతూ రుణ బకాయిలను ఎగగొడుతున్నారు. కొంతకాలం నుంచి ఈ సమస్య బ్రిటన్‌కు కూడా పాకింది. అక్కడ విద్యార్థి రుణ బకాయిల మొత్తం 100.5 బిలియన్ పౌండ్లను చేరింది. 2015లో యూనివర్శిటీ చదువు పూర్తయిన విద్యార్థులలో 70 శాతంమంది ఇంకా తమ బకాయిలను చెల్లిస్తూనే ఉన్నారు. ఆ చెల్లింపు ఈ పాటికి పూర్తి కావాల్సి ఉంది. ఈ సమస్య అమిత వేగంగా మన దేశాన్ని కూడా చేరింది.
ఉన్నత విద్యారంగంలో డిగ్రీల పంపిణీ జరుగుతున్నంత పెద్ద సంఖ్యలో ఉద్యోగ కల్పన జరగడం లేదు. నిరుద్యోగ యువతీ యువ కుల సంఖ్య వేలల్లో ఉంటోంది. విద్యార్థి రుణాల చెల్లింపుపై ఇది ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత త్వరగా సంక్షోభం తప్పుతుంది. ఐదు, పదేళ్ల క్రిందటితో పోలిస్తే ఇప్పుడు కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. జనాభా పెరుగుదల మూలంగా, దేశ జనాభాలో యువత సంఖ్య అధికమైన కారణంగా వీరి సంఖ్య పెరుగుతోంది. మనిషి జీవికకు అవకాశాలను కాలేజీ డిగ్రీ పెంచుతుందని సాధారణ విశ్వాసం ప్రబలంగా ఉంది. అందుకు తగినట్లుగా విద్యా సంస్థల్లో స్థూల చేరిక నిష్పత్తి (జిఇఆర్)ని ఎగదోయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి కూడా తోడవుతోంది.
దేశంలో 15-34 ఏళ్ల వయస్సు యువజనం సంఖ్య 2001లో 353 మిలియన్లు కాగా, 2011లో 430 మిలియన్‌లకు పెరిగింది. 2021 నాటికి ఆ సంఖ్య మరింతగా పెరిగి 464 మిలియన్ల సంఖ్యను చేరవచ్చు. అయితే 2026కి 458 మిలియన్‌లకు తగ్గిపోయే సూచన కూడా ఉంది. దేశంలో చాలామంది జీవితాలు బాగుపడతాయన్న గట్టి నమ్మకంతో కాలేజీ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా మరింత మంది యువతీ యువకులను కాలేజీలకు ఆకర్షించే కృషి సాగిస్తోంది. అందువల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఫలితంగా ప్రస్తుత జిఇఆర్ 24.5 శాతం (2015-16) రానున్న కొద్ది సంవత్సరాల్లో 30 శాతానికి పెరగవచ్చునని భావిస్తున్నారు. 2010-11లో దేశంలో మొత్తం విద్యార్థుల సంఖ్య 2 కోట్ల 75 లక్షలు. 2013 సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య 3 కోట్ల 23 లక్షలకు చేరింది. 2015-16 అఖిల భారత ఉన్నత విద్యా సర్వే సంస్థ (ఎఐఎస్‌హెచ్‌ఇ) నివేదిక ప్రకారం 2015 సెప్టెంబర్ నాటికి దేశం మొత్తంలో ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకుంటున్న వారి సంఖ్య 3 కోట్ల 46 లక్షలు. దిగువ ఆదాయ వర్గాల నుంచి విద్యార్థుల సంఖ్య పెరగడం విద్యా రుణాల వల్లనే జరిగింది. విద్యా ఖర్చులు పెరుగుతున్నందువల్ల పేద వర్గాల విద్యార్థులు భారీగా బ్యాంకుల రుణాలపై ఆధారపడి డిగ్రీ చదువులు సాగిస్తున్నారు. ఎన్నో కష్టాలకోర్చి వారు సంపాదించేది డిగ్రీ మాత్రమే. ఆ తర్వాత పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులలో అయినకాడికి అప్పులు చేసి చేరుతారు. వారికి సరియైన సలహాలు అందడం లేదు.
చాలామంది చదువు పూర్తి అయ్యాక విధిగా కొంతకాలం నిరుద్యోగులుగా గడపాల్సిన పరిస్థితి కూడా ఉంది. లేకుంటే చదువుకు తగ్గ ఉద్యోగం రాక తక్కువ జీతంతో సరిపెట్టుకుని పనిచేయాల్సి ఉంటోంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా చదువు ఖరీదు పెరిగిపోయింది. ప్రయివేటు విద్యా సంస్థల్లో ఫీజుల భారం మోయరానిదిగా ఉంది. మధ్యతరగతి ఆదాయ వర్గాల విద్యార్థులు కూడా చదువుల భారం మోయలేక బ్యాంకు రుణాలపై ఆధారపడి డిగ్రీలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల విస్తరణ మందగించడంతో చాలామంది ప్రయివేటు సంస్థలనే ఆశ్రయిస్తున్నారు. 2016లో ‘నూతన విద్యా విధానం’ పై టిఎస్‌ఆర్ సుబ్రమణియన్ కమిటీ నివేదికలో ఉన్నత విద్యారంగాన్ని అడ్డూఆపూ లేకుండా ప్రైవేటీకరించడాన్ని తప్పబట్టారు. ఒక అంచనా ప్రకారం 2000, 2015 మధ్య ప్రతిరోజూ కనీసం 6 కొత్త కాలేజీలు దేశంలో నెలకొన్నాయి. వాటిలో ప్రయివేటు కాలేజీలే ఎక్కువ.
మొత్తం కాలేజీల సంఖ్యలో 78% ప్రైవేటువే అని లెక్క తేలింది. 2010-2011లో ఇది 70% ఉండేది. అలాగే ప్రయివేటు విద్యా సంస్థలను ఆశ్రయిస్తున్న విద్యార్థుల సంఖ్య 67% చేరింది. 2010 2011లో ఇది 61% మాత్రమే. ఇలా ప్రయివేటు సంస్థల విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ బ్యాంకు రుణాల మొత్తం కూడా పెరుగుతూ వచ్చింది. విద్యార్థుల నైపుణ్యాన్నిగాని, జ్ఞానాన్నిగాని తగినంతగా పెంచే విధమైన విద్య మన కాలేజీల్లో కొరవడడంతో ఉపాధి మార్కెట్లో పట్టభద్రులు తెల్లముఖం వేస్తున్నారు. ఇది కూడా రుణ బకాయిలు తీర్చలేకపోవడానికి దారి తీస్తోంది. సుబ్రమణియన్ కమిటీ నివేదిక చెప్పినట్లుగా మన ప్రయివేటు విద్యా సంస్థల్లో చాలా భాగం
కేవలం డిగ్రీలు అమ్మే దుకాణాలే! పుష్కర్