Home ఎడిటోరియల్ సంపాదకీయం : పెట్రో ధరలకు సర్కారు మంట

సంపాదకీయం : పెట్రో ధరలకు సర్కారు మంట

Sampadakeeyam-Logo

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిలు ధర తక్కువస్థాయిలో కొనసాగుతున్నప్పటికీ పెట్రోలు, డీజిల్ వినియోగదారులు హేతువిరుద్ధంగా అధిక ధరలు చెల్లిస్తూనే ఉన్నారు. ఆయిలు మార్కెటింగ్ కంపెనీలు జూన్ లో రోజువారీ ధరల సవరింపు విధానం ప్రవేశపెట్టాక పెట్రోలు లీటరు ధర ఏకంగా రూ.8దాకా పెరిగింది. పెట్రో ఉత్పత్తుల విక్రయాన్ని తమ ఖజానా నింపుకోవటానికి పాడి ఆవులా ఉపయోగించుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఇంతగా ధర పెరుగుదలకు ప్రధాన కారణం. ధర తగ్గాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించాలని కేంద్రం, ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం బాధ్యతను దాటవేస్తున్నాయి. పెట్రోలు, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తేవాలని ఆ మధ్య ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్న మాటను ఆయిలు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా పునరుద్ఘాటించారు. జిఎస్‌టి చర్చల సందర్భంలో రాష్ట్రప్రభుత్వాలు పట్టుబట్టి పెట్రోలు, డీజిల్, మద్యంలకు మినహాయింపు పొందటం గుర్తు చేసుకోదగింది. జిఎస్‌టి అమలులోకి రావటంతోనే రెండు తెలుగు రాష్ట్రాలు పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను 26 నుంచి 31శాతానికి పెంచేశాయి.
పెట్రోలు, డీజిలు ధర పెరగటమంటే రవాణా వ్యయం పెరిగి అన్ని వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. కాబట్టి ఆ భారం ప్రజలందరిపైకి బదిలీ అవుతోంది. మార్కెట్లో పెట్రోలు ధర రూ.74దాకా ఉంది. క్రూడ్ ధర, దిగుమతి ఛార్జీలు, రిఫైనింగ్, రవాణా ఛార్జీలు, డీలర్ల కమిషన్, కంపెనీల లాభం అన్నీ కలిపితే లీటరు పెట్రోలు ఖరీదు రూ.2030 ఉండాలి. మిగతా 45 రూపాయలు కేంద్రం, రాష్ట్రం పన్నులు. మరే ఉత్పత్తిపైన ఇంత అధిక పన్ను లేదు. జిఎస్‌టి కింద గరిష్ట పన్ను శాతం 28. ఈ నిలువు దోపిడీని కేంద్రమంత్రి ప్రధాన్ ఇలా సమర్థిస్తున్నారుః “భారీ మౌలిక వసతులు, సామాజిక ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వానికి ధనం కావాలి. ఆ అవసరాన్ని వినియోగదారుల అవసరాలతో సమతౌల్యం చేస్తున్నాం”. రోజువారీ ధర ప్రవేశపెట్టిన వెంటనే పక్షం రోజులు ధర తగ్గిన విషయాన్ని విస్మరించి, ధర పెరిగిన ‘తాత్కాలిక లక్షణాన్ని’ ఎత్తిచూపటం తగదంటున్నారు.
పెట్రో ధరల స్వల్పకాల చరిత్రను గమనిస్తే, 2014 మే నెలలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ పీపా(159 లీటర్లు) ధర 109 డాలర్లు(రూ.6600). అప్పట్లో మార్కెట్లో రిటైల్ విక్రయ పెట్రోలు ధర లీటరు రూ.81. ఇప్పుడు క్రూడ్ ధర 48 డాలర్లు(రూ.3200). కాని అప్పటి రేటులో సగానికన్నా తక్కువకు లభ్యం కావలసిన పెట్రోలు ధర అప్పటికన్నా రూ.10మాత్రమే తగ్గుదలలో ఉంది. అప్పట్లో పెట్రో ధరల పెరుగుదలపై యుపిఎ ప్రభుత్వాన్ని నిలదీసిన బిజెపి, అధికారంలోకి వచ్చాక, ‘నీ కన్నా ఒక ఆకు ఎక్కువే చదివాను’ అన్నట్లు పన్నులు పెంచేసి, క్రూడ్ ధర తగ్గుదల ఫలితాన్ని వినియోగదారులకు అందకుండా అడ్డుకట్టవేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే (అప్పటికి క్రూడ్ ధర తిరోముఖం పట్టింది) కొంత రేటు తగ్గించి తమ ఘనతగా చెప్పుకున్న మోడీ ప్రభుత్వం 2015 మధ్యనుంచి ఎక్సైజ్ సుంకం పెంపుదలను మొదలు పెట్టింది. అప్పటినుంచి అంతర్జాతీయ మార్కెట్‌తో సంబంధం లేకుండా మనదేశంలో ధర పైచూపులోనే ఉంది. క్రూడ్ ధర పెరిగితే తాము పన్నుల్ని తగ్గించి రిటైల్ ధర పరిమిత స్థాయిలో ఉంచుతామని మంత్రి ప్రధాన్ పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనకు సమాధానమిచ్చారు. కాని అక్కడ ధర తగ్గుదల ప్రయోజనాన్ని వినియోగదారులకు అందజేస్తామనలేదు.
ఇండియన్ బాస్కెట్ క్రూడ్ ధర 2014 జులైలో రూ.6588 ఉండగా, 2017 ఆగస్టులో రూ.3210. సగానికి సగం తగ్గినా అప్పటితో పోల్చితే పెట్రోలు ధర తగ్గింది లీటరుకు పది రూపాయలే! అందువల్ల పెట్రోలు, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తేవాలని డిమాండ్ చేయాల్సిన అవసరముంది. కేంద్రమంత్రులే ఈ మాట అనటం రాష్ట్రాలను తప్పుపట్టటం మినహా మరొకటి కాదు. కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాన్ని సీరియస్‌గా జిఎస్‌టి కౌన్సిల్ ముందు పెట్టాలి. రాష్ట్రాలను ఒప్పించాలి.