Home జాతీయ వార్తలు దాడి ఎదురుదాడి వీగిన అవిశ్వాసం

దాడి ఎదురుదాడి వీగిన అవిశ్వాసం

Parlament-image

దేశమంతటా ఉత్కంఠ రేకెత్తించిన ‘అవిశ్వాస’ తీర్మానం వీగిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉదయం 11 గంటలకు మొదలై రాత్రి 11 గంటల వరకూ పన్నెండు గంటల పాటు చర్చ జరగ్గా, రాత్రి 11.10 గంటలకు జరిగిన డివిజన్ ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు, వ్యతిరేకంగా 325 మంది సభ్యులు ఓటువేశారు. ఓటింగ్‌లో మొత్తం 451 మంది సభ్యులు పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. సభలో లేకుండా బైటకు వచ్చేశారు. ప్రధాని ప్రసంగం ముగిసేంతవరకూ చర్చలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు. బిజూ జనతాదళ్, శివసేన ఉదయమే సభ నుంచి వాకౌట్ చేశాయి. రాత్రి జరిగిన ఓటింగ్‌కు టిఆర్‌ఎస్ దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. చర్చ అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించగా, తెలుగుదేశం సభ్యుడు కేశినేని నానితో సహా ఆ పార్టీ సభ్యులు డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టడంతో పది నిమిషాల అనంతరం ఓటింగ్ జరిగింది. సభలో ఉన్న 451 మందీ ఓటింగ్‌లో పాల్గొన్నారు.