Home ఎడిటోరియల్ మోడీ యూరప్ యాత్ర మిశ్రమ ఫలితాలు

మోడీ యూరప్ యాత్ర మిశ్రమ ఫలితాలు

The Modi tour of Europe has mixed results

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారం రోజులపాటు స్వీడన్, యుకె, జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చారు. 60 దేశాల అధినేతలను ఆయన కలుసుకోవటం ఆసక్తిదాయకం. వారిలో ఐదుగురు స్కాండినేవియన్ దేశాల స్వీడన్, నార్వే, ఫిన్‌లాండ్, డెన్మార్క్, ఐస్‌లాండ్ నేతలు, 54 మంది కావన్వెల్త్ దేశాల అధినాయకులున్నారు. జర్మన్ ప్రభుత్వ ఛాన్సలర్‌గా నాల్గవ పదవీకాలం ఇటీవల ప్రారంభించిన అంగెలా మార్కెల్‌తో సమావేశం సరేసరి. అయితే ఈ పర్యటన ఫలితాలు మిశ్రమం. మోడీ స్కాండినేవియన్ దేశాలతో సంబంధాలను పునరుద్ధరించారు. పటిష్టం చేశారు, యునైటెడ్ కింగ్‌డంతో కొన్ని కొత్త చొరవలు తీసుకున్నారు, జర్మనీతో ద్వైపాక్షిక సంబంధాలను తాజా పరిచారు. కాని 54 దేశాల కామన్వెల్త్ నాయకత్వాన్ని చేపట్టే అవకాశం జారవిడిచారు. యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించాలని 2016 జూన్ 23న (బ్రెగ్జిట్) బ్రిటన్ నిర్ణయించుకున్నాక, కామన్వెల్త్ మళ్లీ ప్రపంచ రాజకీయాల్లోకి వచ్చింది. బ్రిటన్ తన మార్కెట్, పెట్టుబడి కొరకు యూరప్‌కు బదులు ప్రత్యామ్నాయం కోరుకుంటోంది. అయితే అనేక కామన్వెల్త్ దేశాల్లో కాలం, పరిస్థితులు మారాయి. బ్రిటన్ క్షీణిస్తున్న రాజ్యం కాగా భారత్, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధిగతిలో ఉన్నాయి. తమ హక్కుగానే అవి ప్రపంచంలో ప్రభావవంతమైన దేశాలు.
కామన్వెల్త్ ప్రస్తుత అధినేత అయిన బ్రిటీష్ రాణి తన కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్‌ను తదుపరి అధినేతగా నామినేట్ చేశారు. సామ్రాజ్య వాద వారసత్వాన్ని వదిలించుకునేందుకుగాను కామన్వెల్త్‌ను ఆధునికీకరించేందుకు ఆ పదవిని బ్రిటన్ విడనాడాలని పరిశీలకులు వాదించవచ్చు. ముఖ్యమైన సభ్య దేశాలు ఆర్థిక, రాజకీయ బలంవంటి కొన్ని కొలమానాలతో ‘నాయకత్వ లీగ్’గా ఏర్పడి నాయకత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి చేబట్టవచ్చు. అధిక ఆర్థిక శక్తి, ప్రజాస్వామిక అర్హతలున్న యు.కె, ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా ఆరంభంలో లీగ్‌గా ఏర్పడవచ్చు. అభిజ్ఞ వర్గాల సమాచారం ప్రకారం, కామన్వెల్త్ సం యుక్త నాయకత్వం భారత్‌కు ప్రతిపాదించారు. ఎందుకు అంగీకరించలేదో తెలియదు.భారతదౌత్య మితవాదతత్వం, జడత్వంతప్ప మరో కారణం కనిపించదు. విదేశాంగ విధాన అధికార యంత్రాంగం సహా భారత దేశ బ్యూరోక్రసీని ఉత్తేజితం చేయటంలో మోడీ తడబాటు కొనసాగుతున్నది. భారత్ గతంలో ‘కిరీటంలో వజ్రం’గా కామన్వెల్త్‌లో ఎంతగానో దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడేమో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా అదే ప్రాముఖ్యత వహిస్తున్నది. అందువల్ల తన విదేశీ సంబంధాల్లో కామన్వెల్త్ ప్రాధాన్యతను భారత్ గ్రహించి ఉండాల్సింది. ప్రపంచ జనాభాలో మూడ వ వంతు, అనగా 240 కోట్లు కామన్వెల్త్ దేశాల్లో ఉన్నారు. ప్రపంచ వాణిజ్యంలో 1/5 వ వంతు, జి. 20లో 1/4 వంతు కామన్వెల్త్‌ది. అటువంటి సామర్థాలు కలిగిన సంస్థ నాయకత్వాన్ని భారత్ స్వీకరిస్తే ప్రపంచ రాజ్యాంగా దాని పాత్ర పెరుగుతుంది. అయితే ఇప్పటికి భారత్ బస్సు మిస్ అయింది.
నోర్డిక్ దేశాలకు మోడీ సందర్శన సత్ఫలితాలిచ్చింది. 1988లో రాజీవ్ గాంధి పర్యటన తర్వాత 30 ఏళ్లకు భారత్ ప్రధాని స్వీడన్ సందర్శించారు. స్వీడిష్ ప్రధాని స్టీఫెన్ లోఫ్‌వెన్ ప్రోటోకాల్ పక్కనబెట్టి విమానాశ్రయానికి వెళ్లి మోడీకి స్వాగతం పలికారు. ఒకే కారులో ప్రయాణించారు. ఐదు నోర్డిక్ దేశాలు భా రత్‌తో నోర్డిక్ కౌన్సిల్ సమావేశానికి సహాఆతిథ్య మిచ్చాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వారి సమావేశం తదుపరి అటువంటి సమావేశం రెండవసారి ఇప్పుడే జరిగింది. భారత్, నోర్డిక్ దేశాలు ఒకరిపట్ల మరొకరి దృక్పథాన్ని పునఃపరిశీలించుకుంటున్నాయి. భారత్ శాంతియుత, సంపద్వంతమైన స్కాండినేవియన్ దేశాలపట్ల తక్కువ దృష్టి పెడుతూ, యుకె, జర్మనీ, ఫ్రాన్స్ వంటి పెద్ద దేశాలతో వ్యవహారం చేస్తున్నది. వివిధ అభివృద్ధి సూచీలో ప్రపంచ దేశాల్లో ఈ దేశాలు ఉన్నత స్థానంలో ఉన్నాయి. అలాగే నోర్డిక్ దేశాలు కూడా తమ యూరప్ ఉనికిని చాటుకోవటంలో నిమగ్నమయ్యేవి. భారత్ బహుశా వారి రాడార్‌లో లేదు. స్వదేశీ ఉత్పత్తుల రక్షణవాదం పెరగటం, అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం సంభవించే అవకాశం నేపథ్యంలో, సంపన్న నోర్డిక్ దేశాలు తమ పెట్టుబడులకు ఇతర దేశాలను అన్వేషిస్తున్నాయి. భారత్ అటువంటి ఆకర్షణీయ ప్రదేశంగా కనిపిస్తున్నది.
అంతేగాక, 1980వ దశకంలో భారత రాజకీయాలను కల్లోలితం చేసిన బోఫోర్స్ కుంభకోణం తదుపరి భారత్ స్వీడన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. అలాగే భారత్ డెన్మార్క్ సంబంధాలు కూడా డేనిష్ జాతీయుడొకడు పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో ఆయుధాలు జార విడిచిన ఘటన తదుపరి దెబ్బతిన్నాయి. కాలమే దివ్యౌషధం అన్నట్లు ఈ కోపతాపాలు, అపోహలు చరిత్ర చెత్తబుట్టలోకి వెళ్లిపోయాయి. మోడీ సందర్శన, ద్వైపాక్షిక సమావేశాలు సంబంధాలను పునరుత్తేజితం చేశాయి. భారతదేశంలో ఇప్పటికే 160 స్వీడిష్ కంపెనీలు పనిచేస్తున్నా యి. వాటిలో 1,60,000 మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నా రు. మోడీతో సమావేశానికి సుమారు 30 మంది సిఇఒలు హాజరైనారు. రెండేళ్లలో 110 కోట్ల డాలర్ల పెట్టుబడి వాగ్దానం చేశారు. రాజకీయంగా చూస్తే, అణుశక్తి సరఫరాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో భారత్ సభ్యత్వాన్ని, సంస్కరించబడే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ (భద్రతా మండలి)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని స్వీడన్ బలపరిచింది. అంతర్జాతీయ ఎగుమతి నియంత్రణ వ్యవస్థ, వాస్సెనార్ అరేంజిమెంట్, ఆస్ట్రేలియా గ్రూపు, బాలిస్టిక్ మిస్సిలీల వ్యాప్తికి వ్యతిరేకంగా హేగ్ ప్రవర్తనా నియమావళి, మిస్సిలీ టెక్నాలజీ కంట్రోలు వ్యవస్థవంటి అంతర్జాతీయ ఒప్పందాల్లోకి భారత్‌కు స్థానం లభించటాన్ని స్వీడన్ స్వాగతించింది.
చివరగా, మోడీ జర్మనీలో ఆగి, ‘యూరప్ ఉక్కు మహిళ’ మెర్కెల్‌ను కలుసుకున్నారు. జర్మనీతో భారత్‌కు వాణిజ్యలోటు ఉంది. మోడీ ఇలా ట్వీట్ చేశారు: “సన్నిహిత స్నేహితురాలితో అద్భుతమైన సమావేశం జరిపాను. భారత్ జర్మనీ సహకారం, అలాగే ప్రపంచ సమస్యలకు సంబంధించి అనేక విషయాలపై చర్చించాను”. మొత్తం మీద మోడీ పర్యటన ఫలితం మిశ్రమంగా ఉంది. నోర్డిక్ యూరప్‌కు మంచి యాత్ర, యుకె, కామన్వెల్త్‌లకు సాధారణ యాత్ర. 54 దేశాల కామన్వెల్త్ పై దృష్టి కన్నా, మే 12న కర్నాటక ఎన్నికలకు ముందు లండన్ నుంచి ఆ రాష్ట్ర ప్రజల నుద్దేశించి మాట్లాడటంపై ఆయన ఎక్కువ ఆసక్తి చూపారు. (కర్నాటకలో లింగాయత్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక మత హోదా ఇవ్వటానికి అంగీకరించిన నేపథ్యంలో మోడీ లండన్‌లో లింగాయత్ వ్యవస్థాపకుడైన బసవేశ్వరుని విగ్రహాన్ని దర్శించి మొక్కటం విస్మరించ రానిది సం॥)