Home ఆదిలాబాద్ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై ఎంపి ఆగ్రహం

వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై ఎంపి ఆగ్రహం

coll*సిబ్బంది లేనప్పుడే సమర్ధవంతంగా పని చేయాలి
*అదే నాయకత్వ లక్షణం
*సరైన వివరాలు లేకపోవడంపై ఎంపి అసంతృప్తి

మనతెలంగాణ/ఆదిలాబాద్‌టౌన్   అన్ని వసతులు ఉన్నాయి. కానీ సిబ్బంది కొరత కారణంగా పూర్తి స్థాయి సేవలు అందడం లేదని ప్రతి సమావేశంలో ఒక్కటే సమాధానం చెప్పడం సరికాదని ఆదిలాబాద్ ఎంపి నగేష్ రిమ్స్ డైరెక్టర్ అశోక్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ఎవరైనా పని చేయవచ్చు కొరత ఉన్న సమయంలో నాణ్యమైన సేవలు అందిస్తేనే నాయకత్వ లక్షణం బయట పడుతుందని అన్నారు. శనివారం రిమ్స్ కళాశాల సమావేశ మందిరంలో రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్, జడ్‌పి చైర్‌పర్సన్ శోభారాణి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఎంపి నగేష్, కలెక్టర్ దివ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మనీష, జడ్‌పిటిసి అశోక్, సభ్యులు బండారి దేవన్న, రిమ్స్ ఆర్‌ఎంఓ వినయ్‌కుమార్, వైద్యులు పాల్గొన్నారు. తొలుత రిమ్స్ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం 15 అంశాలతో కూడిన ఎజెండాను ఆమోదం కోసం కమిటీకి ప్రతిపాదించారు. ఇందులో నీటి కొరతపై గత సమావేశంలో చర్చించామని ఇప్పటి వరకు పరిష్కారం, ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎంపి ప్రశ్నించారు. మత్తడి వాగు నుంచి నేరుగా రిమ్స్‌కు పైప్‌లైన్ ద్వారా నీటి సౌకర్యం కల్పించవచ్చని దీనికి దాదాపు 9 కోట్లు అవుతుందని ఇంజనీర్లు సలహా ఇచ్చినట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ విషయంలో అప్పటి జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్‌తో చర్చించినట్లు తెలిపారు. ప్రతిపాదనలు పంపించారా అని ఎంపి అడగడంతో లేదని డైరెక్టర్ సమాధానం చెప్పడంతో ఎంపి మాట్లాడుతూ సమస్యను సమస్యగానే ఉంచుతున్నారని గత సమావేశం నిర్వహించి 10 నెలలు గడుస్తున్నా దీనిపై ఎందుకు ప్రతిపాదనలు పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగితాలు కాదు పనుa కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో చర్చించే అంశాలు సక్రమంగా లేవని, సగం సగం వివరాలతో ఎలా పరిష్కారం లభిస్తుందన్నారు. వచ్చే సమావేశంలో పూర్తి స్థాయి నివేదికలు, అభివృద్ది పనుల వివరాలు ఉండాలన్నారు. రిమ్స్‌లో పేషెంట్‌ను తీసుకెళ్లేందుకు వార్డుబాయ్, స్టెచర్ బాయ్‌లు లేక రోగుల సహాయకులే తీసుకెళ్తున్నారని అనారోగ్యం బారిన పడిన తన అమ్మను వీల్‌చైర్‌పై తానే తీసుకెళ్లానని అభివృద్ది కమిటీ సభ్యులు, సామాజిక కార్యకర్త బండారి దేవన్న అవేదన వ్యక్తం చేశారు. దీనికి డైరెక్టర్ సిబ్బంది కొరత ఉందని వివరణ ఇవ్వడంతో ఎంపి కలుగచేసుకొని రిమ్స్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, వారి విధులు తెలపాలని సూచించడంతో డైరెక్టర్ మొత్తం 652 పోస్టులకు గాను 409 మంది ఉన్నారని తెలిపారు. 248 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో నర్సులు, స్టాఫ్ నర్సులు, వైద్యులు కాకుండా వార్డు బాయ్, స్టెచర్ బాయ్, పారిశుద్ద కార్మికులు ఎంత మంది విధులు నిర్వహిస్తున్నారని అడిగారు. ఇంతలో కలెక్టర్ దివ్య మాట్లాడుతూ తన వద్దకు వేతనాల కోసం వస్తున్న 15 మందిని వదిలి ఎంత మంది విధులు నిర్వహిస్తున్నారని వివరణ అడగడంతో సమాధానం రాలేదు. ఎంత మాట్లాడినా సిబ్బంది కొరత అని చెప్పడం తప్ప వేరే సమాధానం రావడం లేదని ఎంపి మండిపడ్డారు. ఉన్న సిబ్బందిని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై దృష్టి సారించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం జడ్‌పిటిసి అశోక్ మాట్లాడుతూ రిమ్స్‌లో సేవలు సక్రమంగా అందడం లేదన్నారు. బెడ్లపై బెడ్ సీట్లు వేసినా అవి కనబడడం లేదన్నారు. వైద్యులు, సిబ్బంది బాధ్యత వహించాలని, రోగులకు సేవ చేయాలనే తపన ఉండాలన్నారు. 10 నెలలకోసారి కాకుండా ప్రతి మూడు నెలలకు ఒక సారి ఆసుపత్రి అభివృద్ది సమావేశం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజీవ్, రేడియాలజిస్టు, వైద్యులు ఇద్రిస్ అక్బానీ, సుష్మ, రామకృష్ణ, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు.