*భూములపై మనుగడ కోల్పోతున్న రైతులు
మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఫార్మాసిటీ పేరుతో రైతుల భూములు లాక్కుంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ భూములపై ప్రజల మనుగడ లేకుండా చేస్తుందని మాజీ హోం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని ఫతేమైదాన్‌లో జరిగిన ఫార్మాసిటీ భూములపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఫార్మాసిటీ వ్యవహారంలో 2013 జీవోకు విరుద్దంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రతిపాదిత ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం కారుచౌకగా రైతు పంట పొలాలను కొల్లగొట్టిందని, సర్కారు భూదందా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న కలుషిత పరిశ్రమలను రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాలకు తరలించి నగరంలోని విలువైన భూములను కేసీఆర్, కేటీఆర్‌లు కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం 2013 జీవో చట్టాన్ని అనుసరించని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. పాలమూరు ఎత్తిపోతల తరహాలో రంగారెడ్డి జిల్లాలో ప్రాణహిత చేవెళ్లను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు క్యామ మల్లేష్, పర్యావరణ వేత్తలు పురుషోత్తం రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.