Home ఎడిటోరియల్ సోషల్ మీడియా దుర్వినియోగం

సోషల్ మీడియా దుర్వినియోగం

Social-Media

ఒకప్పుడు ప్రజలకు దిన పత్రికలు, రేడియోలు మాత్రమే అందుబాటులో ఉండేవి. నెమ్మదిగా టెలివిజన్లు ప్రవేశించడంతో సమాచార వ్యవస్థ దాని రూపు రేఖలను మార్చుకుంది. వార్తల్లో వేగం పెరిగింది. కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్ష ప్రసారం పేరుతో అప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో డిజిటల్ మీడియా రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు వెళ్ళింది. ఈ క్రమంలో ప్రజలు కూడా వార్తల వెనుక ఉన్న ప్రయోజనం కంటే, వేగంగా చేరే వార్తలపట్ల మొగ్గు చూపడం మొదలు పెట్టారు. దీనితో సంఘటనలను వేగంగా ప్రజలకు చేరవేయాలన్న తపన మీడియా సంస్థల్లో పెరుగుకుంటూ పోయింది. ఆ తరువాత వచ్చిన మొబైల్ విప్లవం ఒక్కసారిగా కమ్యూనికేషన్ వ్యవస్థ రూపురేఖలనే మార్చి వేసింది. మొబైల్ విప్లవం తీసుకువచ్చిన అతిపెద్ద పెద్ద మార్పు సోషల్ మీడియా.
ఎక్కడో ఉన్న వ్యక్తి తన భావాలను పంచుకోవడానికి, జరుగుతున్న సంఘటనల పట్ల ఎదుటి వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఉపకరిస్తుంది. ముఖ్యంగా ఫేస్‌బుక్, వాట్స్‌ఆప్ ఈ సోషల్ మీడియాలో అగ్రభాగాన్ని ఆక్రమించుకున్నాయి. మొబైల్ సేవలు అందిస్తున్న కంపెనీల్లో ఏర్పడ్డ తీవ్ర పోటీ కారణంగా, ఇంటర్‌నెట్ టారీఫ్‌లు గణనీయంగా తగ్గడంతో 90శాతం సోషల్ మీడియా ఫోన్ల ద్వారానే అందుబాటులోకి వచ్చి అనూహ్యంగా పుంజుకుంది. ఏదయినా సంఘటన జరిగినప్పుడు ఆ వార్త సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో లక్షల మందికి చేరే అవకాశం ఉండటంతో అప్పటివరకు పాఠకులుగా ఉన్న ప్రజలు నెమ్మదిగా వివిధ సంఘటనల పట్ల తమ భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సహజంగానే తెలిసిన అంశాన్ని పక్కవాళ్ళకు చేరవేయాలన్న కుతూహలం ఎక్కువయింది.
ఇక్కడే వచ్చింది చిక్కంతా. సోషల్ మీడియా రాకతో అప్పటివరకు వివిధ మాధ్యమాల ద్వారా సమాచారం కోసం ఎదురు చూసిన సందర్భం నుండి ఒక్క సారిగా మనిషి తనకు తానుగా సమాచారాన్ని ఇతరులకు చేరవేసే స్థాయికి వెళ్ళిపోయాడు. అంతే, ఇక ముందూ, వెనుకా ఆలోచించకుండా తన భావాలను, తాను నమ్మిన విషయాలను వార్తల రూపంలో సోషల్ మీడియా ద్వారా ఇతరులకు చేరవేయడం ప్రారంభించాడు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న ప్రతీ అంశాన్ని వార్తగానే ప్రజలు భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల అనేక దుష్పరిణామాలకు అవకాశాలు ఏర్పడ్డాయి. వాట్స్‌ఆప్ అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది. 250 మంది చొప్పున గ్రూపుల ఏర్పాటు అందుబాటులోకి రావడంతో నెమ్మదిగా వాట్స్ ఆప్ దుర్వినియోగానికి వేదిక అయింది.
సమాచారం ఒకే ఒక్క క్లిక్ తో 250 మందికి చేరవేసే అవకాశం ఉండటం, అందులోని మిగతా సభ్యులు ఇతర గ్రూపుల్లో సభ్యులుగా ఉండటం, ఇలా ఒక తప్పుడు సమాచారం క్షణాల్లో వేలమందికి వ్యాప్తి చెందేందుకు అవకాశం ఏర్పడింది. ఏదయినా ఒక సంఘటన జరిగినప్పుడు పూర్వాపరాలు తెలుసుకోకుండా, దాని నేపథ్యం తెలుసుకోకుండా తనకు అందిన సమాచారాన్ని చేరవేయడం ఈ రోజు మనుషుల ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతోంది. మూఢ నమ్మకాలను ప్రచారం చేయడానికి, వ్యవస్థలో అశాంతిని రెచ్చగొట్టడానికి సంఘ వ్యతిరేక శక్తులు సోషల్ మీడియాను ముఖ్యంగా వాట్స్ ఆప్‌ను ఒక సాధనంగా ఎంచుకుంటున్నారు.
మన రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల మూలంగా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఎక్కడో ఉత్తరాది నుండి వచ్చిన ఒక ముఠా రాష్ట్రంలో చిన్న పిల్లల అపహరణకు ప్రయత్నిస్తోంది, అప్రమత్తంగా ఉండాలన్న వార్త వాట్స్‌ఆప్‌లో చక్కర్లు కొట్టింది. ప్రజలు కూడా ఈ వార్తలను నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు చేరవేయడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లిన వ్యక్తుల మీద భౌతిక దాడులు జరిగాయి. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించాలన్న ఉద్దేశంతో కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు పన్నుతున్న కుట్రలో ప్రజలు భాగస్వామ్యం కావొద్దని, చట్టాలు చేతుల్లోకి తీసుకోవద్దని డిజిపియే హెచ్చరించాల్సి వచ్చింది. కానీ దురదృష్టం కొద్దీ, అవాస్తవాలు, పుకార్లు వెళ్లినంత వేగంగా వాస్తవాలు జనంలోకి వెళ్ళడం లేదు. అక్కడక్కడా జరిగిన సంఘటనల్లో అపరిచితుల మీదికి దాడులకి తెగబడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ఇలాంటి పుకార్లను వ్యాపింప జేస్తున్న వాళ్ళను కూడా అదుపులోకి తీసుకొని చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ప్రజల్లో సోషల్ మీడియా దుర్వినియోగంపట్ల ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాను దుర్వినియోగ పరిస్తే ఎదుర్కోబోయే పర్యవసానాలను ప్రజలోకి మరింత లోతుగా తీసుకు వెళ్ళాలి. బీదర్ లో జరిగిన సంఘటన సోషల్ మీడియా దుర్వినియోగానికి పరాకాష్టగా నిలిచింది. మిత్రుని ఆహ్వానం మేరకు బీదర్ వెళ్లిన ముగ్గురు హైదరాబాదీలు, దారిలో ఒక చోట అల్పాహారం కోసం ఆగినప్పుడు అక్కేడే ఆడుకుంటున్న చిన్న పిల్లలకు ప్రేమతో తమ వద్ద ఉన్న చాక్ లేట్లు ఇవ్వడం జరిగింది. అయితే మత్తు మందు ఇచ్చి చిన్న పిల్లలను ఎత్తుకు పోతున్నారన్న అనుమానంతో గ్రామస్తులు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది.
వారి దగ్గర నుండి బలవంతంగా తప్పించుకున్న బాధితులు తిగిరి వచ్చే క్రమంలో వారి కంటే వేగంగా వాట్సప్ పుకారు వెళ్లాయి. స్థానికులంతా కారు వెళుతున్న మార్గంలోని ముర్కి గ్రామస్తులకు వాట్సప్ మెసేజ్‌ల ద్వారా సమాచారం ఇచ్చి కారును ఆపాలని కోరారు. దీనితో దారికాచి రోడ్డుకు అడ్డంగా పెద్ద పెద్ద బండరాళ్లు పెట్టి ఉంచారు. వారిని తప్పించుకునే క్రమంలో వేగంగా వెళ్తున్న కారు పక్కనే ఉన్న కల్వర్టులో పడిపోయింది. ఈ సంఘటనలో దాడికి గురయిన వ్యక్తి అక్కడిక్కడే మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికయినా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే ప్రజల్లో సోషల్ మీడియా వినియోగం పట్ల విస్తృతంగా చర్చ జరగాలి. నిరాధారమయిన వార్తలను ప్రసారం చేయడం చట్ట వ్యతిరేకం అన్న భావన ప్రజల్లోకి వెళ్ళాలి.వాట్స్ ఆప్, ఫేస్ బుక్‌లను చట్టాలకు లోబడి కేవలం తమ భావాలను పంచుకోవడానికి మాత్రమే వేదికగా మలుచుకోవాలి. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అశాంతిని రెచ్చగొట్టాలన్న అసాంఘిక శక్తుల పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరం.
భౌతిక దాడులు చేసిన వ్యక్తులకు ఎంత శిక్ష పడుతుందో, సామాజిక మాధ్యమాల ద్వారా దాడులకు పరోక్షంగా బాధ్యులు అయిన వారిది కూడా జరిగిన నేరంలో అంతే పాత్ర ఉంటుంది అన్న విషయం మరువద్దు. ఈ విషయంలో ప్రజల్లో మరింత అవగాహన పెంచడం సామాజిక బాధ్యతగా భావించి, పౌరులందరూ ముందు కు రావాలి. అప్పుడే మనం ఇలాంటి ఘోరాలను ఆపగలం. లేకపోతే ప్రజల్లో అభద్రత చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇదిమంచి పరిణామం కాదు. పెరుగుతున్న టెక్నాలజీ వినియోగం మానవ కల్యాణం కోసం ఉపయోగపడాలి. చట్టాల్లో మార్పులతో ఇలాంటి వాటిని రూపు మాపడం కష్టం.
అందుకే పౌరుల్లో మార్పు రావాలి. ముఖ్యంగా యువత నడుం బిగించాలి. అప్పుడే సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల ఒక అవగాహన ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. మన మీడియా వ్యవస్థ కూడా ఇలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సంచలనాలకు చోటివ్వకుండా, సామాజిక బాధ్యతగా తన పాత్రను పోషించాలి. తప్పుడు వార్తల పట్ల, వాటిని చేరవేయడం వల్ల ఎదుర్కోబోయే పరిణామాలపట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలి. చట్టాల మీద ప్రజల్లో అవగాహన కల్పించాలి. సోషల్ మీడియా వినియోగం మీద ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వ వ్యవస్థతో కలిసి ప్రధాన మీడియా పనిచేయాల్సిన అవసరం ఉంది.