Saturday, April 20, 2024

అంతరంగ అక్షర యాత్రికుడు రిల్కే

- Advertisement -
- Advertisement -

 

The only journey is the one within రిల్కే.
నేను భౌమ్యావరణం మీదుగా విస్తరిస్తున్న వర్తుల రేఖా వలయాల మీద జీవిస్తుంటాను. వేల ఏళ్లుగాపరమాత్ముని చుట్టు, సనాతన కోటకొమ్ముల చుట్టు పరిభ్రమిస్తున్నాను; అయినా నేను గద్దనో, పెను తుఫానునో, బృహద్గీతాన్నో నాకింకా తెలియనే తెలియదు.
అంటున్న రిల్కే తాత్వికుణ్ని మించిన కవి. కవిత్వమే జీవన సర్వస్వమైన సౌందర్య ఆరాధకుడు.
మతఛాందసుడు గా కాకుండా, అనిర్వచనీయమైన క్రైస్తవ యోగ సంసర్గాన్ని అభినవంగా నిర్వచిస్తూ, ఇన్నర్స్పేస్ లోని నిశ్శబ్ద ఏకాంతాన్ని ఆత్మదర్శిగా పాడుకున్న ఒకానొక అధునాతన భావుకుడు. శ్రావ్యత సాంద్రత తొణికిసలాడేగీతాలను జర్మన్ భాషలో రచించిన బొహీమియన్ ఆస్ట్రియన్ కవి. సనాతన క్రైస్తవ భావజాల మిస్టికల్ చింతననుమోడరన్ కవన శిల్పంగా మలచిన సృజనకారుడు. రిల్కేది సౌందర్యాత్మక తాత్వికత. క్రిస్టియన్ తాత్విక ఆత్మనుకవితాత్మకంగా ఆవిష్కరించాడు. జీవన మరణాల, సుఖ దుఃఖాల, చీకటి వెలుగుల వంటి వాస్తవ జీవన జీవనద్వంద్వాలను కావ్యకళ గా సమన్వయ పరచిన అధునిక కవి. మార్మిక ఆత్మాశ్రయానుభూతి ( Subjective Mysticism ), బాహ్యప్రపంచ వస్తుగత విషయ వాస్తవికతల ( Objective Realism ) సమ్మిశ్రమం అతని కవిత్వం.
Prague లో జన్మించి, Munich లో విద్యాభ్యాసం చేసి, స్విట్జర్లాండ్ లో స్థిర పడ్డాడు. గొప్ప యాత్రికుడు. అతని పైలియో టాల్ స్టాయ్, పాస్టర్నాక్, బొదిలేర్, సిగ్మన్డ్ ఫ్రాయిడ్, స్టీఫెన్ మల్లర్మే, Nietzsche ల ్రప్రభావం ఎంతైనా వుంది. అతనిసృజన వ్యక్తిత్వానికి మూల కారకులు అతని ఇష్టసఖి సలోమే, మిత్రుడు రోడిన్; జ్యూరిక్ అతని వికాస క్షేత్రం.
రిల్కే బాల్యం సజావుగా సాగలేదు. తండ్రి జోసెఫ్ సాధారణ రైల్వే ఉద్యోగి. సంపన్నకుటుంబంలోంచి వచ్చిన తల్లిసోఫియా భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పదేళ్ల వయసులోనే రిల్కేను మిలిటరీ అకాడెమీ లో చేర్చింది. కాని, అనారోగ్య౦ నెపంతో ఎలాగో బయటపడి కొంతకాలం ట్యూషన్ టీచరుగా పనిచేశాడు. చురుకుదనం ఉన్న వ్యక్తి కావడంవల్ల ఎట్టకేలకు సాహిత్యం, ఫిలాసఫీ, ఆర్ట్ హిస్టరీ లో పట్టా పుచ్చుకో గలిగాడు. మ్యూనిక్ లో చదువుకుంటున్న కాలంలోఅతడు 36 ఏళ్ల శుద్ధ బ్రహ్మచారిణి సలోమే ( Lou Andreas-Salom ) ప్రేమలో పడిపోయాడు. ఆమె అత్యంత మేధావీ, ప్రఖ్యాత వేదాంతీ అయిన Friedrich Nietzsche అంతటి తాత్విక ప్రతిభాశాలిని తిరస్కరించిన విలక్షణ వనిత. దాంపత్యబాంధవ్యాలు కొరవడినా, ఆమె సాహచర్యం అతని జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసింది. ప్రతిభావంతమైన ఆమెకళాత్మక స్నేహం రిల్కే మరణం దాకా కొనసాగింది. ఆమె రిల్కేను రెండుసార్లు రష్యాకు తీసుకెళ్లింది. లియో టాల్స్టాయ్ ను, బో రిస్ పాస్టర్నాక్ కుటుంబాన్నీ పరిచయం చేసింది. రిల్కే Clara Westhoff ను పెళ్లి చేసుకొని స్విట్జర్లాండ్ లో స్థిరపడిపోయాడు.
అపరశిల్పి ఆగస్టే రోడిన్ ( Auguste Rodin ) గురించి చెప్పందే రిల్కే చరిత్ర పూర్తి కాదు. రోడిన్ గొప్ప శిల్పి. రిల్కేకుఅతడు ఓ హీరో, ఓ స్నేహితుడు, ఒక బాస్. రోడిన్ 60 ఏళ్ల వరిష్ఠ ఫ్రెంచ్ కళాకారుడు, రిల్కే పాతికేళ్ల యవ్వనోత్సాహి. రోడిన్శిల్పకళలో మునిగితేలే లౌకికుడు, రిల్కే కవన కళలో చిగురిస్తున్న ఆత్మవాది. భిన్న శకాలలో జీవిస్తున్నట్టు తోచే వారి స్నేహంవిచిత్రంగా అల్లుకు పోయింది. ఒకరికి ఒకరు పూరణం. రోడిన్ ఒక శిఖరమైతే, రిల్కే ఆ శిఖరాన్ని చుట్టుకున్న పొగమంచు. రిల్కే ప్రసిద్ధ గ్రంధం Letters to a Young Poet పేజీల నిండా రోడిన్ ప్రస్తావనే. రిల్కే కవితా ప్రస్థానం రోడిన్ శిల్పకళా వేదికనుండే ప్రారంభం అయిందని చెప్పవచ్చు. రిల్కేకు చిత్రకళ కూడా ఒక ప్రేరణ. తన కవిత్వానికి స్ఫూర్తి నిచ్చిందెవరంటే రోడిన్తో పాటు Paul Cezanne ను కూడా స్మరిస్తాడు. అతని పేయింటింగ్స్ అతని పాలిటి ధ్రువతార అంటాడు. Letters on Cenzanne అందుకు సాక్షి. శిల్పకళాభిరుచి, చిత్రకళాభినివేశం ఇరుదరుల నడుమ పారే సృజన ప్రవాహం రిల్కే కవిత్వం.
రిల్కే కవిత్వమే గాక పలు కవితాత్మక వచన రచనలు చేశాడు. The Notebooks of Malte Laurids Brigge ఆత్మకథ రూపంలో ఉన్న గొప్ప నవల. ఇందులోని ఇతివృత్తం దయారహితమైన ఈ ప్రపంచంలో ఒక దయనీయ నాస్తికునిజీవిత౦. రోడిన్ పై మోనోగ్రాఫ్ మరో సుందర వచనం. మిత్రులకు, కవిత్వ ప్రియులకు, కళాకారులకు 14000 కు పైగాఉత్తరాలు రాశాడు.
కవిత్వం కోసం కవిత్వమై జీవించిన మనిషి రిల్కే. సమకాలీన సాహితీ శ్రేష్ఠుల సాన్నిహిత్యం కోసం భార్య Clara ను, కూతురు Ruth ను వదలి దూర దేశాలకు వెళ్లడానికి కూడా వెనుకాడ లేదు. ఏకాగ్రత దెబ్బతింటుందని స్వంతకూతురు పెళ్ళికి కూడా వెళ్ళ లేదు. కవిత్వం అతని దేవుడు. అతని కవిత్వ గ్రంధాలలో ముఖ్యమైనవి Letters to a Young Poet, New Poems, The Book of Hours , The Book of Images, ౄuino Elegies , Sonnets to Orpheus, The Notebooks of Malte Laurids Brigge, Ahead of All Parting. ఎలిజీలు రిల్కే అస్తిత్వ విషాదాల రూపాంతరాలైతే ( metamorphoses ), సానెట్స్ బైబిల్ పరోక్ష ప్రస్తావనల సుందర రూపకాలు, దేవలోక సుందరీమణుల (Angels ) ప్రతీకలు.
రిల్కే భాష తలపోతల భాష. అతను రెండు వైరుధ్యాల మధ్య ఉండే నిశ్శబ్ద వాస్తవాన్ని అభిలషిస్తుంటాడు – వెలుతురు వేళల, చీకటి ఘడియల నడిమి నిస్తబ్ద క్షణాన్ని. జీవన ఉరవడికీ, మృత్యు శీతల అచల ప్రశాంతికీ అతీతమైననీరవ గమన శబ్దాన్ని. రెండు నవీన నగరాల మధ్య నిదిరిస్తున్న ప్రాకృతపల్లె జీవన ప్రస్థానాన్ని. అతను భిన్నస్వరాలనుకలిపికుట్టే మనోధర్మ రాగగీతిక.
నేను రెండు స్వరాల నడిమి మౌన విరామాన్ని,
అవి ఆ తిమిర విరామ స్థలిలో వణకి పోతుంటవి;
అయినా, అక్కడ
అవిరామ సంగీతమేదో సాగిపోతూనే ఉంటుంది.
అతని భావనా ప్రపంచంలో చీకటి లోతులు అసాధారణ కవన ప్రతీక లైనవి. అతని ఆ తిమిరసీమ పెనుతుఫాన్ల గుండా మనను తరింపజేసే నౌక, లోతుబావిలోని నల్లనీరు, తిరిగే చక్రపు ఇరుసు, నెగడు మంటల నాల్క చివరికాళరేఖ.
నా అస్తిత్వపు చీకటి ఘడియలంటే నాకు ఇష్టం;
అక్కడ
నా సర్వేంద్రియాలు నా అగాధాలలో రాలి పడుతుంటవి.
అయినా, అక్కడ
మరో కాలాతీత బృహత్ జీవితానికి చోటింకా మిగిలే ఉంటుంది.
అన్నింటినీ పీల్చేసుకుంటుంది,
ఆ తిమిరావరణం.
నిశి ఓ గొప్ప శక్తి;
అది నా చుట్టే పరిభ్రమిస్తున్నది.
నాకు రాత్రులంటేనే విశ్వాసం.
పవిత్రత మన పైన కాక, కిందనే ఉంటుందని, మనలను పవిత్ర అగాధాలతో నేరుగా కలిపే చీకటిరేఖ సదాచేరువలోనూ దూరంలోనూ ఉంటుందని, ఆ సీమలో చిక్కుకున్న మనిషి వృక్షమూలాలలో, గరకు శిలలలో ఆ అంధకారాన్నిదర్శిస్తాడని అతని విశ్వాసం. కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో కరిగిపొతే , రిల్కే తిమిర సీమలోకి అంతర్ముఖుడయ్యాడు.
అగాధాల లోతుల్లోకి ఎంతగా వెళ్లినా
నా దేవుడు నల్లగానే వున్నాడు
నిశ్శబ్దాన్ని తాగుతూ;
వేల నిశ్శబ్ద వృక్ష మూలాలు
చిక్కగా అల్లుకున్న నల్లన!
చూడు
అక్కడ ఆ అగాధాలు
నెమ్మదిగా తమ రహస్యాలను విప్పుతున్నవి.
అతని అంధకారం Ralph Plescia గీసుకున్న అస్పష్ట వాక్యాల బైబిల్ చిత్రం కాదు. అది ఆతని స్వాతిశయదర్పమూ కాదు. అది అతనికో కవితా వస్తువు (Thing). అందుకే అతని న్యూ పోయెమ్స్ Thing Poems గాప్రచురించబడ్డాయి. అసమాన అతర్ముఖుడు రిల్కే .
రిల్కే తన తొలి కవితలతో తృప్తి పడక దిగులుగా ఉన్నప్పుడు, నాలుగు గోడల మధ్యనో, గత స్మృతుల నడుమనోఉండిపోకుండా జూ కు వెళ్ళమని సలహా ఇస్తాడు రోడిన్. పులి లో పులి బొమ్మ కనిపించే దాకా తదేకంగా చూస్తూనేఉండమంటాడు. అలా, తూచా తప్పకుండా పాటించి రాసిన కవితలే Seeing Poems . రోడిన్ తోటలోని శిల్పాకృతులుThe Panther, The Swan ,The Torso of Apollo , Buddha Inside the Light గా రిల్కే Book of Pictures లో సజీవ కవనశిల్పాలుగా నిలిచిపోయాయి.
ఓ తేజోచక్ర శిలాబుద్ధా!
నీ శిరసున జ్యోతిర్వలయం,
నీ శిలాకేంద్రంలో బాదాం రసం,
ఆకాశాన్ని తాకుతున్న నీ సూర్యులు.
నీ లోలోపల
ఎదో ప్రాణం పోసుకుంటున్నది;
అది

ఆ సూర్యులను మించిన చిరంజీవి.
అతనిది కవితాత్మక నవీన నిశిత దృష్టి. చురుకైన అభివ్యక్తి. ఈ ఖండికలు అతని ప్రతిభకు అద్దంపట్టే కవనగుళికలు:
నేను తరచుగా యువకిశోరాల గురించి తలపోస్తుంటాను;
వాళ్ళ దేహాల్లోంచి మండే దేవుడు నడచి పోతుంటాడు.
ఆశ్రమ వనవాటికల కీర్తి కిరీటాలు వాళ్లకై వేచి ఉంటవి.
నేను నా ప్రభువు నివసించే పట్టణాన్ని!
ఉత్సాహం ఉరకలేసే జెరూసలాన్ని!
నేను సంజస్వరాలలో నిద్రిస్తాను,
శుక్రతారలో నిశ్వసిస్తాను.

నా వీధులు
సూర్యోదయాలయాలలోకి తలెత్తుతుంటవి.
ప్రజలు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాక

నా లోలోపల వాళ్ళ పదధ్వనులు మ్రోగుతుంటవి;
అప్పుడు

నేను నా ఏకాంతాన్ని

అనంతం నుండి అనంతం దాకా విస్తరిస్తుంటాను.

రిల్కే అనూహ్య ప్రతీకలను ప్రతిపాదిస్తుంటాడు. గులాబీ నిద్రకు, పూలరిక్కలు కనురెప్పలకు సంకేతం.
గులాబీ ముల్లు కుచ్చుకొని సెప్టిక్ బారినపడి తనువు చాలించిన రిల్కే తన సమాధి మీద చెక్కుకున్న epitaph :
ఓ రోజా!
నిదుర రెప్పల కింది స్వప్నవాంఛా!
ఎవరి సుషుప్తీ కాలేని

ఓ నిర్మల విరోధాభాసా!

అందుకేనేమో, రిల్కే తన మరణానికి పరోక్ష కారణమైన గులాబీని ప్యూర్ కాంట్రడిక్షన్ గా (నర్మగర్భంగా) అభివర్ణించిఉంటాడు

( Rose , O Pure Controdiction , desire to be no one’s sleep beneath so many lids ).

To work is to live without dyeing అని విశ్వసించి త్రికరణశుద్ధిగా జీవితాంతం అక్షరయజ్ఞం చేసిన కళాత్ముడు, అంతరంగ అంధకారాన్ని కవన కమనీయ౦గా మలచిన అధునాతన కవి Rainer Maria Rilke .
( ఈ వ్యాసంలోని కవన ఖండికలు నా తెలుగు సేతలు.)
– నాగరాజు రామస్వామి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News