Home ఎడిటోరియల్ భూ నిధుల పట్ల ప్రజాగ్రహం

భూ నిధుల పట్ల ప్రజాగ్రహం

Land-Cartoon

వస్తూత్పత్తి, మౌలిక సౌకర్యాల కల్పన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ‘ల్యాండ్ బ్యాంక్’లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజల హక్కులను కాలరాసి ఈ పని చేస్తున్నాయి. దీనిపై ప్రజాందోళనలు సాగుతున్నాయి. గత జూన్‌లో ఒడిశాలోని నౌగామ్ గ్రామంలో దాదాపు 100 మంది నిరసన యాత్ర జరిపారు. ఆ గ్రామం పొలిమేరల్లోని 1700 హెక్టార్ల భూమిచుట్టూ ప్రభుత్వం కట్టిన గోడ వద్దకు వారు ఈ యాత్ర జరిపారు. అందులో1,253 హెక్టార్ల అటవీ భూమి కూడా కలిసి ఉంది. ఆ అటవీభూమిపై వివాదం సాగుతోంది కూడా. రాష్ట్ర ప్రభుత్వం లాండ్ బ్యాంక్ పేరిట ఆక్రమిస్తున్న భూములపై బ్యాంకులు రుణాలు ఇవ్వడం బంద్ చేయడంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.
ఆ భూముల్లో స్థానికులు సాంప్రదాయికంగా ఎప్పటినుంచో తమలపాకు తోటలు, వరి పండిస్తూ, చెరువులలో చేపలు కూడా పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ చర్యవల్ల వారి జీవికకు అంతరాయం ఏర్పడింది. నిరసనలను అడ్డుకోడానికి ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బలగాలను దించడంతో స్థానికులు ఉగ్రులవుతున్నారు.
ఆ భూమిని తిరిగి గ్రామస్థులకు మాత్రం తిరిగి ఇవ్వడం లేదు. వివాదాస్పద భూములను రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ‘ల్యాండ్ బ్యాంక్’లలో చేర్చడం స్థానిక ప్రజల హక్కులను కాలరాసి, ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడమే అవుతుంది. ఒడిశా ప్రభుత్వం ఆ వివాదాస్పద భూమిలో గోడ కట్టడాన్ని గత మేలో మొదలుపెట్టగానే ప్రజల అసంతృప్తి పెల్లుబికింది. ల్యాండ్ బ్యాంకులపై దేశవ్యాప్తంగా రాజుకున్న నిరసనలకు నౌగామ్ ప్రబల ఉదాహరణగా మారింది. ప్రైవేటు భూములు, ఉమ్మడి భూములతో ఈ ల్యాండ్ బ్యాంకులు ఎనిమిది రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. మొత్తం 2.68 మిలియన్ హెక్టార్ల భూమి ఆ రాష్ట్రాల్లో ఇందు కు ప్రత్యేకించారు. ఇది మొత్తం మేఘాలయ కంటె ఎక్కువ ప్రాంతం. అవన్నీ వస్తూత్పత్తి, మౌలిక సౌకర్యాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించినవి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్‌లలో వాటి వివరాలను పొందుపర్చారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇంకా చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఈ ల్యాండ్ బ్యాంకులను ప్రజల హక్కులను హరించి ఏర్పాటు చేస్తున్నారు. నౌగామ్ సహా నాలుగు ప్రదేశాల్లో 258,000 మంది ప్రజల హక్కులను కాలరాసి సేకరించిన మొత్తం 3,550 హెక్టార్ల భూమి వివరాలను ఒక స్వచ్ఛంద జర్నలిజం సంస్థ సేకరించి భద్రపరిచింది. ఆ సంస్థపేరు ‘లాండ్ కాన్‌ఫ్లిక్ట్ వాచ్’. ఆయా భూముల హక్కుదారుల పేరిట పత్రాలను ఆ సంస్థ సిద్ధం చేసింది. ఆ లాండ్ బ్యాంక్‌ల బాధితుల సంఖ్య నాగాలాండ్ మొత్తం జనాభాకంటె ఎక్కువ. స్థానిక వ్యతిరేకతవల్ల రద్దుఅయిన సెజ్‌ల భూములతో ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు అయ్యాయి.అసలు ‘ల్యాండ్ బ్యాంక్’ అనే ఆలోచనలోనే తప్పున్నదని భూమి హక్కుల కార్యకర్తలు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాలు ఎంతోకాలం నుంచి భూ సంస్కరణలు అమలు పరచడం మానివేసి, ఆ భూములను గ్రామాల నుంచి సేకరించి ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నాయని సామాజిక కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వాల ఈ చర్యలు సవాలు చేయదగ్గవని అసీమ్ శ్రీవాస్తవ అనే ఢిల్లీ ఆర్థికవేత్త విమర్శించారు. ‘చర్నింగ్ ది ఎర్త్’, ‘ది మేకింగ్ ఆఫ్ గ్లోబల్ ఇండియా’ అనే గ్రంథాల రచయిత ఆయన. ఇటీవల చోటు చేసుకున్న నిరసన ప్రదర్శనలు ల్యాండ్ బ్యాంకుల అపసవ్యతకు నిదర్శనమని కూడా ఆయన పేర్కొన్నారు. ఇలా భూములను పెద్ద ఎత్తున సేకరించి ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేసే ధోరణి 1990ల నుంచే సాగుతోంది. ఈ ధోరణి ఆర్థిక సరళీకరణ తర్వాత ఇది మరింత జోరందుకుంది. నేరుగా ప్రైవేటు మదుపరులకు భూములు కేటాయించడం ల్యాండ్ బ్యాంకుల వల్ల సులభం అవుతుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. నౌగామ్‌లో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొన్న పోస్కో సంస్థను ప్రజలు అడ్డుకొని విజయం సాధించడం చెప్పుకోదగ్గది. ఆ ఒప్పందంపట్ల దానివల్ల చుట్టుప్రక్కల గల 700కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. వారంతా ఆ ప్రాజె క్టు వల్ల దెబ్బతింటారు. వారిలో దళితులు, సంతాల్ గిరిజనులు ఎక్కువ. ఉద్యోగాలు వస్తాయి, ఇతరత్రా ప్రయోజనాలు కలుగుతాయి అనే మాటలను వారు నమ్మలేదు. వారి ప్రతిఘటన దాదాపు ఒక దశాబ్దంపాటు సాగింది. మధ్యలో వారికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ దృఢంగా వారు నిలవడంతో 2015లో ఎట్టకేలకు పోస్కో ఆ ప్రాజెక్టును మానుకుంది. ప్రాజెక్టు భూమిని తిరిగి రాష్ట్రప్రభుత్వానికి అప్పగిస్తానని పోస్కో ప్రకటించడంతో స్థానిక గిరిజనులు, ఇతరులు ఎంతో సంతోషించారు. అంతలోకే ఆ భూమిని లాండ్ బ్యాంక్‌లో కలుపుతున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించి స్థానికులు విస్తుపోయేలా చేసింది.
వారు చాలా దశాబ్దాల నుంచి ఆ భూముల్లో తమలపాకు తోటలు పెంచుతూ, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పోస్కోను తరిమేసినా భూముల గండం రాష్ట్ర ప్రభుత్వ లాండ్ బ్యాంక్ వల్ల వారికి తప్పలేదు. పైగా వారిలో ఇతరత్రా ఉపాధి కలవారు ఎవరూ లేరు. ఆ భూములే వారి బతుకులకు ఆధారం. ఈ అనుబంధం వల్లనే వారు మానసికంగా దెబ్బతిని ప్రభుత్వంపై ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు. లాండ్ బ్యాంకులో ఆ అటవీ భూములను చేర్చడం సరికాదని ఒడిశా ప్రభుత్వంపై కోర్టులో ఒక స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. 1980 అటవీ సంరక్షణ చట్టం, 2006 అటవీ హక్కుల చట్టంకింద ప్రభుత్వ చర్యను ఆ పిటిషన్‌లో న్యాయవాది రుత్విక్ దత్తా సవాలు చేశారు. 1980 చట్టం కింద ప్రభుత్వం అటవీశాఖ అనుమతి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అలాగే 2006 చట్టంకింద అటవీ భూముల వినియోగాన్ని మార్చడం కుదరదని కూడా వాదించారు.
తమ అటవీ హక్కులను చాటుకుంటూ నౌగామ్, ధింకియా, గోబింద్‌పూర్ గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి 2011లో దరఖాస్తులు దాఖలు చేశారు. వాటిపట్ల ప్రభుత్వం నుంచి స్పందన లేనేలేదు. తెగల ప్రజలను అడవుల్లోకి రానివ్వకుండా ప్రభుత్వం వారి హక్కులను కాలరాస్తోందని మరో న్యాయవాది శంకర పాణి వ్యాఖ్యానించారు. అటవీయేతర వాడకం కోసం ఆ భూములను ఏనాడో మళ్లించామని ప్రభుత్వం వాదిస్తోంది. భారత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (ఐడిసిఐ)అధీనంలో ఆ భూమి వుందని కూడా రాష్ట్రం పేర్కొంది. అందుచేత ప్రస్తుతం అటవీ హక్కుల డిమాండ్ అర్థంలేనిదని ప్రభుత్వ పెద్దలు వాదిస్తున్నారు. అభ్యంతరాలను లక్షపెట్టకుండా 1253 హెక్టార్ల అటవీ భూమిని వారు ల్యాండ్ బ్యాంక్‌లో కలిపేశారు. 60లక్షలమంది జనాభాను దెబ్బతీసే 450 భూ వివాదాలు ప్రస్తుతం సాగుతున్నట్లు లాండ్ కాన్‌ఫ్లిక్ట్ వాచ్ తెలిపింది. అవన్నీ స్థానికులు, గిరిజనుల హక్కులకు సంబంధించిన వివాదాలే!

– భాస్కర్ త్రిపాఠి