Home మంచిర్యాల ఉపాధి కూలీల ఆకలి కేకలు

ఉపాధి కూలీల ఆకలి కేకలు

The pies are pretty labor pareshan

పైసలు అందక కూలీల పరేషాన్
బెల్లంపల్లి ఎంపిడిఓ కార్యాలయానికి తాళం
మూడు నెలలుగా కూలీలకు అందని డబ్బులు
మండుటెండల్లో పని చేసినా స్పందించని అధికారులు

మన తెలంగాణ/మంచిర్యాల: ఎండలను సైతం లెక్కచేయకుండా పని చేసిన ఉపాధి హామీ పథకం కూలీలకు గత మూడు నెలలుగా కూలీ డబ్బులు అందడం లేదు. వారికి డబ్బులు చెల్లించడంలో అధికారులు నిర్లక్షం వహిస్తున్నారని, ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆగ్రహించిన ఉపాధి హామీ కూలీలు ఇటీవల బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయానికి తాళం వేసి అధికారులను నిర్బంధించారు. కూలీ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పేవరకు తాళం తీయమని పట్టుపట్టారు. అంతే కాకుండా మండల పరిషత్ కార్యాలయం నుండి బైఠాయించి ఆందోళన చేశారు. గత మూడు నెలలుగా డబ్బులు అందకపోవడంతో ఇబ్బందులకు గురువుతున్నామని, పూటగడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాలలో 386 మందికి రూ. 3,27,734లు రావాల్సి ఉంది. దండేపల్లిలో 1318మందికి కూలీలకు రూ.7,35,937, లక్షెట్టిపేటలో 700 మందికి రూ. 5,76,252లు రావాల్సి ఉంది. అదే విధంగా జిల్లాలో దాదాపు రూ. 2 కోట్ల మేరకు కూలీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఉపాధీ కూలీలు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతూ కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపిడి మల్లేష్‌ను వివరణ కోరగా ఉపాధి కూలీలకు త్వరలోనే డబ్బులు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఇటీవలనే నిధులు విడుదల కావడం వలన వెంటనే పోస్టాఫీస్, కార్యాలయాల ద్వారా కూలీలకు డబ్బులు చెల్లిం చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.