Home కలం కవిత్వ లక్ష్యం ప్రజాపక్షం

కవిత్వ లక్ష్యం ప్రజాపక్షం

The poetry goal is public opinion

కవి భాషా తాత్తికత ఎంత దూరం వెళ్లిందంటే.. “తను” “ఇతర” అన్న భావనలు కవులు ఉపయోగిస్తున్న భాషలోనూ కనిపించడం మొదలైంది. ఇవి కులం, ఉపకులం ప్రాంతీయత అక్కడ నుండి మరీ పదునెక్కి స్థానికతగా కుదురుకుంటుంది. ఈ మార్పుకు సానుకూలత అంటు కట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది.

ఎంతయినా కవిత్వం గ్లామరు వేరు. ప్రకృతికి మనసు పరవశించినప్పుడు, ఎక్కడ ఏ కొత్త, ఆలోచన వచ్చిందని తెలిసినా, దానిని అక్షరాకృతిలోకి తెచ్చుకోవాలని మనసు తహతహలాడుతుంది.
కవిత్వం ఒక మాయాలాంతరు లాంటిదేమో. ఆ మాయాలాంతరు వెలుతురు నరాల్ని తెర మీద అల్లుతుంది. కవిత్వంపు మాయ లాంతరనేది ఒక్క వెలుతుర్నే కాదు నీడల్ని జాడల్ని కూడా ప్రసరిస్తుంది. ఒకానొక సందిగ్ధ స్థితిలోంచి కవిత్వం ఎక్కడ మొదలు పెట్టాలో ఏది ఆరంభానికి ప్రారంభమోనని సర్వదేహంతోనూ సందేహించకూడదు.

కవిత్వాన్ని చదువుతుంటే కవితో మాట్లాడుతున్నట్లే ఉండాలి. తనదైన మాడ్యులేషన్‌లో కవిత్వం వింటున్నట్లే ఉండాలి. మనమెట్లా ఆలోచిస్తామో అట్లానే రాసినట్లు ఉండాలి. అందులోని ఫోనెటిక్ బ్యూటీ గుండె మడికి నీరు పెడుతున్నట్టు ఉండాలి. ఇదంతా కవి వ్యక్తిత్వంలా, ప్రేమలా స్వచ్ఛంగా హాయిగా ఉండాలి. సూటిగా ధాటిగా గాంభీర్యంలా సాగిపోవాలి.
మంచి కవిత్వాన్ని చూడొచ్చు. మాట్లాడొచ్చు. దానికి మనతో మాట్లాడాలని తహతహగా ఉంటుంది. మన దృష్టిని ఆకర్షించాలని మన పక్కన తప తపా నడుస్తుంది. మనం ఎన్నడూ చూడని భావ చిత్రాల్ని మన పక్కకి విసురుతుంటుంది. పక్కకే కాదు మీదకి కూడా….

కవిత్వం వల్ల కవి సాధించేదేమిటి..? అద్భుతమైన సృజన ఆ సృజన వల్లనే అ శాశ్వతాన్నించి తప్పించుకోగలగడం. కాబట్టి కవులు, ఒక్కోసారి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ కవిత్వోద్యమ లక్షాలను విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. మరోసారి సాహిత్య సాంస్కృతికోద్యమ కాంతితో, అసమానమైన భావ చిత్రాలతో మరింత తేజోవంతం చేస్తారు.
కవిత్వం నోటి మాటకి దగ్గరది. ఎంత వచనపద్యమైనా అది కూడా అంతో ఇంతో ఆవేశాన్ని ప్రకటించేదే. ఏ ఆవేశమూలేని వట్టి యథావస్తు వర్ణన చేసేది. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది. అలాంటి వచనం అచ్చు యంత్రం బాగా అలవాటైన తర్వాతే అంటే నోటి మాటకు ప్రాధాన్యం తగ్గిన తర్వాతే తయారవుతుంది. మనకు మంచి వచనం అంతగా ఇంకా, ఏర్పడలేదేమో మన వచనం ఇప్పటికీ కవిత్వపు వాసన వేస్తూ ఉంటుంది.

కాలంతో పాటు కవిత్వ ప్రయాణం చేస్తూ క్షణాల మధ్య కరిగిపోవడం అనుదిన చర్యకు ప్రతిబింబంగా నిలుస్తుంది. ఆ హృదయ స్పందనలోంచి ఊపిరి పోసుకున్నది కచ్చితంగా ఉత్తమ కవిత్వం. కవిత్వ పరిచయంలోనే పాటించిన పద్ధతి గురించి, కవిత్వ రచనలను ఎన్నుకోవడం వెనుక ఒకే రకమైన కారణాలు కనిపించవు. ఒక రచన హృదయాన్ని కదిలించేది అయితే, ఇంకోటి పేరు పొందిన ప్రతీకల ప్రవాహానిది.

కవి భాషా తాత్తికత ఎంత దూరం వెళ్లిందంటే.. “తను” “ఇతర” అన్న భావనలు కవులు ఉపయోగిస్తున్న భాషలోనూ కనిపించడం మొదలైంది. ఇవి కులం, ఉపకులం ప్రాంతీయత అక్కడ నుండి మరీ పదునెక్కి స్థానికతగా కుదురుకుంటుంది. ఈ మార్పుకు సానుకూలత అంటు కట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కవిత్వాన్ని గాక ఆ కవి వ్యక్తిగత జీవితాన్ని బట్టి కవిత్వాన్ని ఎంచుకునేట్టయితే మనం ఎంతో మంచి కవిత్వాన్ని మిస్సవ్వాల్సి వుంటుందో…? ఇందుకెన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

పెద్దగా దోషాలు లేనని చెప్పేలేం. దాదాపుగా ప్రశంసించలేమని కాదు. కొంతమంది కవిత్వమంతా ఒకే రకమైన ధోరణి ఉన్న రచనలే ఉన్నాయని కొందరి అభిప్రాయం. అసలు సాహిత్య చరిత్రలో కవిత్వానికి అన్యాయం ఎక్కడ జరిగింది అని అన్న వాళ్ళూ ఉన్నారు. కాని చాలా తక్కువమందే.

కవిని మీరు ఎందుకలా రాస్తున్నారని ప్రశ్నించితే మీరెందుకలా జీవిస్తున్నారని ఎదురు ప్రశ్న వేస్తాడు. కవిత్వానికీ కూడా పొడుగూ, వెడల్పూ, బరువూ అనే కొలతలు వుంటాయా. అంతేగాక, ఆ కవిత్వ పదార్థం, ఏ కాలంలో తయారవుతుందా.. కవిత్వం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు? కవిత్వ లెక్కలు కూడా వుంటాయా..?
కవిత్వం మన గురించినదే. మన గురించి అయినప్పుడు మనకర్థమయ్యేలా ఎందుకు రాయడం లేదు అని అడగడమూ సమంజసమే. కాని కవి అలా రాయడమూ సమంజసమే . ఎందుకంటే కవి స్టేటస్ క్యూగా మాట్లాడుతూ దార్శకునిగా రాస్తుంటాడు.

కవిత్వమంత గొప్పగా కవులు జీవితం కూడా వుండాలా అనేదిప్పుడు అప్రస్తుతం మహాకవులు మహాత్ములు కానక్కరలేదేమో. వ్యక్తులుగా కవులు మనలాంటి సగటు సహజమైన బలహీనతలు, వికారాలకీ అతీతులేమీ కాదు. ఒక్కటే తేడా. మనలో లేని కళానైపుణ్య దృష్టి కవిత్వ పటిమ కవుల్లో ప్రత్యేకంగా వుంటుంది.

మొదట ఒక సాధారణ పాఠకుడు కవిగా పుట్ట బోతున్నప్పుడు, అతనికి తన పాఠకులంటూ ఉండరు. ఏదో అంశం మీద రచన చేయాలనుకుని చేస్తాడు. అది నచ్చిందని కొంతమంది పాఠకులు చెబితే, సంతోషిస్తాడు. అప్పటికంటే, ఆ తర్వాత కవిగా ముదిరే కొద్దీ తన రచనలన్నిటినీ మెచ్చుకునే పాఠకవర్గం వుంటే బావుంటుందని కోరుకుంటాడు. తన రచన నచ్చితే పాఠకులు మెచ్చుకుంటారు. లేకపోతే లేదు అన్న అనిర్ధారిత దశ నుంచీ, మెచ్చుకోవాలన్న నిర్ధారిత కోరికకు మారడం ఇది. ఒక విధంగా ఇది అభివృద్ధే కానీ, దీనితో కవి తన స్వాతంత్య్రం కోల్పోడానికి అవకాశం వుంటుంది.

ఇది కవిత్వం అవునా కాదా? అన్న అంశం గురించి ఇతర పట్టుదల ఎందుకు? అది కవిత్వం అయితే మనకేం? కాకపోతే మనకేం. చదువుకున్న కొందరిది కవిత్వమనుకుంటే అనుకోరాదా? మరికొందరిది కవిత్వం కాదనుకుంటే సరే అనరాదా? కానీ నిజానికి అలా వీల్లేదు. ఈ ప్రశ్నకు ఇంత ప్రాముఖ్యత ఎందుకొచ్చిందంటే, మన సంఘంలో ‘కవి’ అన్న రెండక్షరాలకీ అపారమైన గౌరవాభిమానాలున్నాయి కాబట్టి…అక్షర మాధ్యమం కంటే దృశ్య మాధ్యమం ఎక్కువగా ఆకర్షించడంతో పాఠకుడు ప్రేక్షకుడిగా మారిపోవడం ఇదంతా సహజంగా జరిగే సమాజ పరిణామం అనుకొంటే కొంతమేర నష్టమే. ప్రాచీనతరం రచనల్ని నవతరం చదవకపోవడంతో రెండు తరాల మధ్య సాంస్కృతిక సంప్రదాయక వారసత్వ అంతరం స్పష్టంగా కనిపిస్తుంది.