Home అర్బన్ మ్యూజింగ్స్ ఆ కొండపై వాన నగరపు మెలకువ…

ఆ కొండపై వాన నగరపు మెలకువ…

kp-Story

మృగశిర కార్తె. కొండల మీద దట్టమైన నల్లని మబ్బు. చూస్తుండగానే వర్షం వొక్కసా రిగా. నింగి నేలా యేకం కాగా అని మనసు హమ్ చేస్తుండ గానే మెరుపులు వురుములు. డ్రైవింగ్ భలే కష్టంగా అనిపించింది. ఆ దారిలో వొక యిల్లు కనిపిస్తే ఆగాం. వరండాలో కూర్చుని కొండల పొడవునా ధారాపాతంగా జారుతోన్న ప్రవాహాన్ని చూస్తూ ‘’యిలాంటి రెండు వానలు వస్తే బువ్వకి లోటు లేదు యేడాదంతా” అంటున్నారో తాత. ఆ వానని అతని మనవడు కళ్ళార్పకుండా చూస్తున్న అతని వైపు చూస్తూ ‘రెండు చాలా తాత’ అని అడిగాడు. ‘చాలురా యేం చేసుకొంటాం. యెక్కువైతే కుళ్ళి పోతాయి’ అన్నారు నవ్వుతూ. ‘అవును తాత చాలు’ అన్నాడు. ‘చూడు కొండల్లోంచి నేరేడుపళ్ళ వాన’ అంటోంది ఆ పిల్లవాని అక్క. యీ కాలపు వాన యింతే… కాళిదాసు, రవీంద్రుల వారి కవిత్వం నిండా నేరేడు పళ్ళ కవిత్వమేగా. ఆ యింటిల్లిపాదీ ఆ వరండాలో కూర్చుని ఆ వానని తదేకంగా తనివితీరా చూస్తూ జీవిక గురించి వాన సౌందర్యం గురించీ మాటాడుకొంటున్నారు నింపాదిగా. వారికి యెడంగా ఫోన్స్. టకటకా ఫోటోలు తీసి ఆ వానని వెనువెంటనే ప్రపంచంతో పంచుకోవాలని ఫేస్‌బుక్ లో అప్‌లోడ్ చేసెయ్యాలనే ఆత్రమేమీ లేకుండా ముందుగా వారు ఆ వానని వారిలోకి వొకొక్కరుగా సమష్టిగా నింపుకొంటోన్న తీరు వొక పురాజ్ఞాపకం కదా యీ రోజు చాలమందికి.
యేదైనా నింపుకోవటం అనే మాట కళాకారులు, కళాభిమానులు తరచు అనుకున్నప్పటికి నిజానికి అలా నింపుకున్నవారు చాల అరుదు. వేదాలు, వుపనిషత్తులు, విలువైన మతగ్రంధాలు చదువుకొన్నామని తరచు చెపుతూ లేదా సత్పురుషుల లేదా స్త్రీలు చూపిన దారి అంటూ చెప్పే యెందరో వదిలించుకోవలసిన జాడ్యాలు రవ్వంతైనా వదిలించుకోకుండా అసూయ, ద్వేషం చూపించటం పవర్ ఆపరేట్ చెయ్యటం యెత్తుకు పై యెత్తులు వెయ్యటం స్నేహాలలో విపరీతమైన గాసిప్ ని పేనటం చూస్తూనే వున్నాం. మనసుని శుభ్రపరచుకోవటం యెలానో బహు చక్కగా చెప్పటం వేరే వారు చెయ్యాలని తప్పా తమ కోసం కాదు అని యువతరం కొన్ని రాతలని చూసి వెక్కిరించటం చూస్తుంటాం యిన్ బాక్స్‌ల్లో.
వాన నెమ్మదించింది. తెల్లని మేఘాలు. శుభ్రపడింది ఆకాశమో మా మనసులో అని ఆలోచిస్తూ వస్తున్నా నగరానికి. ఆ సాయంకాలపు వాతావరణాన్ని వొక మాయాజాలం ముసురుకొంది. పంజరం వదిలిన పిట్టల్లా కార్ రికార్డర్ నుంచి హిందీ మెలోడీస్. హుషారైన మ్యూజికల్ హిట్స్. నిర్మానుష్యమూ విశాలమూ అయిన ఆ రోడ్డు వానకు తడిసిన చోటల్లా గుత్తులుగుత్తులుగా వాహనాల లైట్స్ నుంచి కాంతుల్నివెదజల్లుతున్నాయి దారిదారంతా.
యే పాట తరువాత యే పాటో తెలీకుండా అమర్చుకొంటా యెప్పటికప్పుడు. అసలే పెద్ద పెద్ద ఆశ్చర్యాలు లేని కాలం. అంతే కాదు అందమైన ఆహ్లాదకరమైన ఆశ్చర్యాలు లేని కాలం. విన్న పాటని మననం చేసుకోడానికి అస్సలు వీలులేని కాలం. పాటే కాదు చదివిన పుస్తకాన్ని నెమరేసుకోడానికో అలా వొక పుస్తకాన్ని చదివి మనం అర్ధం చేసుకొనో లేదా చేసుకోడానికో ఆ సంతోషాన్ని పంచుకోటానికో మనకంటూ యిద్దరో ముగ్గురో స్నేహితులు వున్న కాలం నుంచి యిప్పుడు ఫేస్ బుక్ లో వేలాది మంది స్నేహితులతో పంచుకుంటున్నాం. క్షణాల మీద మనం మన భావాలని ట్వీట్ చేసేస్తాం. యస్ యం యస్ లు పంపుతాం. వొక మెసేజ్ పూర్తిగా చదవటం అవుతుందో లేదో వరసగా శ్రావణ చినుకుల్లా దబదబా మన ముందు అనేక యస్ యం యస్ లు కురుస్తాయి. అందులో కొన్నింటికి మనం జవాబు కూడా యివ్వలేని పరిస్థితి. అలానే బోలెడు వాట్సాప్ మెసేజెస్ గ్రూప్స్ కొన్ని నిమిషాల్లోనే అనేక రకాలైన భావోద్వేగాల్ని చదువుతాం. చూస్తాం. వింటాం. అయినా మన బాహ్య ప్రపంచం అంత బిజీ బిజీ బీ లా తిరగా డుతోన్న మన అంతరంగ ప్రపంచం యేమంత తడిగా వుండటం లేదని వింటుంటాం. బయట ప్రపంచంలోని హడావిడి లోపలి ప్రపంచాన్ని వుత్సాహపరచనప్పుడు మనం యేం చేస్తాం… యెలా లోపలకి కాసింత తీయని పరాగాన్ని జల్లుకొంటాం. అందికే యిలా కొన్ని అనుకొని ఆశ్చర్యాలని అమర్చుకొంటా.
ఫోన్ లో మేసేజ్ బీప్.
మంచి పాజిటివ్ థింకింగ్ పెంచే కౌన్సిలింగ్ చేసే వారుంటే చెప్పు అని వో స్నేహితురాలి నుంచి మెసేజ్.
ఆమెకి యిదో వ్యాపకం. నిరంతరం పిల్లల్ని యెవరో వొకరు దారిలో పెట్టాలని తాపత్రయ పడుతుంది. అలాంటి వాళ్ళ సంఖ్య యెక్కువగానే వుంది. యింతకీ పెట్టాల్సిన దారి యేమిటంటే చాల మందికి యెప్పుడూ ఫోన్నే… యెప్పుడూ ఫేస్ బుక్ లోనే… యిదిగో యిలాంటివే సమస్యలు… సోషల్ మీడియా భలే కమ్ముకునే ఆకర్షణ. పెద్దలే ఆ ఆకర్షణ నుంచి తప్పించుకోలేరు. యింక పిల్లలు యెలా తప్పించుకొంటారు.
స్నేహాలు, సంపదా, కీర్తి అన్నీ కూడా జీవితాల్లోకి మెల్ల మెల్లగా ప్రవేశించి నిదానంగా విస్తరించేవి వొకప్పుడు. యేది వొక్క వుదుటున జరిగేది కాదు. యిప్పుడు అలా కాదు. యింత యెక్కువగా టెక్నాలజీ జీవితాలని కమ్ముకొన్న తరం భూమండలం మీద యింతకు ముందెప్పుడూ లేదు.
అలాంటి దారులలో నడిచి వచ్చిన వాళ్ళకి కూడా యీ నాటి యిన్‌స్టంట్ హడావిడికి అతీతంగా వుండటం సాధ్యం కావటం లేదు. వుండాల్సిన అవసరమూ లేదు కూడా. కానీ యిటువంటి వొక జీవన విధానం వుండేది అని చెప్పిన వాళ్ళు కూడా యీ విధమైన ప్రవర్తనకి అతీతంగా లేనప్పుడు యువతరాన్ని ఆక్షేపించటం యెందుకో అర్థం కాదు. రవ్వంత వూపిరి తీసుకోడానికి వీలులేని పోస్టింగ్స్ తో మనం గడుపుతూ పిల్లలు ఫేస్ బుక్ లో ఫోన్ లో చాల సమయం గడుపుతున్నారని కంప్లైంట్ చేసే వాళ్ళ మామ ధోరణి లేదా వాపోవటం చూసి అందరూ మా మామ పోస్టింగ్స్ మాత్రమే చూడాలనా… అని మొన్న వొక యువతి నవ్వుతూ అడుగుతోంది యిన్ బాక్స్ లో. పిల్లలు పెద్దల ప్రవర్తనని శుభ్రం గా గమనిస్తారు. తల్లిదండ్రులనే తమ చుట్టూ వున్న ప్రతి వొక్కరిని గమనిస్తారు. పిల్లలకి పెద్దలకి మధ్య వొక పెద్ద చిల్లులగోడ వుంది. అన్నీ అందరూ అందరితో మాటాడుతున్నట్టే వుంటారు. కానీ మాట పెగలనివ్వనితనం వుంది. అది యెక్కడ నుంచి వస్తుందో ప్రతి వొక్కరు తమతమ అంతరంగాన్ని తరచి చూసుకోవలసిందే కదా.
కారు నగర ప్రవేశం చేసింది.
వుద్యోగాలకి వెళ్ళేవారు. వచ్చేవారు. రాత్రి వేళల తెరచి వుంచే రకరకాల ఆహార దుకాణాలు. రోడ్స్ శుభ్రం చేసే వాళ్ళు యిలా రాత్రి పొద్దు పోయినా నగరం సందడిగానే వుంది.
తాగి వాహనాలు నడిపే వారిని పట్టుకోడానికి చేస్తున్న చెకింగ్స్, కార్ రేస్ జరక్కుండా చూసేవారు యిలా బోలెడన్ని చెకింగ్‌లు. కారు పక్కగా టూ వీలర్ స్లో చేస్తూ యిద్దరు కుర్రవాళ్ళు అడ్రస్ అడుగుతున్నారు. గూగుల్ చూడు అని నాలుగేళ్ల పాప చెపుతోంది వెనక సీట్ లోంచి. ఆ పసి పాపకి టెక్నాలజీ విషయాలు తెలుసు. అలాంటి పిల్లలు ప్రతి యింట్లో వున్నారు.
టెక్నాలజీ మనకి బోలెడు నాలెడ్జిని యిన్‌ఫర్మేషన్‌న్ని, సరదాని, సంతోషాన్ని యిస్తుంది. అతికి అలవాటు పడిన మానవుల సంఖ్య యెక్కువగాను, రెండు వానలు చాలు అనుకునే స్థిమితమైన మానవులు కొద్దిగానూ యీ సమాజంలో వుండటంతో బాలన్స్ తప్పి పిల్లల్ని రకరకాల సెంటర్స్ చుట్టూ తిప్పే వారు యెక్కువైయ్యారా… చుట్టూ టెక్నాలజీ వున్నా అంతా వొకే వానని ఆస్వాదించే యెరుక ఆ వరండాలో యెలా వెలిగింది… కొన్ని లివింగ్ రూమ్స్ లో యెందుకు వెలగటం లేదు.
పురాఅనుభవసారం, యీనాటి మెళకువా సమ్మిళితం చేసి పూలపరాగంలా మంచిని తీసుకుపోయే సుగాలుల కాలంలోకి టార్చ్ లైట్ వేసే చూపుని వెతుక్కోవాలిప్పుడు…
మెల్లమెల్ల గా వెలుగు రేఖలు… నిద్రపోతోన్న మిగిలిన సగం నగరం మేల్కొంటోంది.