Friday, March 29, 2024

ఆర్‌ఎస్‌ఎస్ అద్దంలో బిజెపి పాలన!

- Advertisement -
- Advertisement -

The rate of increase in unemployment reached 7.6 percent

ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో దేశం ఎలా వుందన్న విషయాన్ని ఏ ప్రతిపక్ష నాయకుడో లేక పరిపూర్ణ అధ్యయనంతో, సాధికారతతో మాట్లాడే కెసిఆర్ వంటి ఏ బిజెపియేతర ముఖ్యమంత్రో విమర్శించి చెప్పడం వేరు, కేంద్ర పాలకుల సైద్ధాంతిక గురువులే వర్తమాన దుస్థితిని కళ్లకు కట్టేటట్టు వివరించడం వేరు. ఎన్నెన్ని అందమైన అబద్ధాల మేడల్లో విహరిస్తూ పాలకులు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా నిజాలు నిప్పులై వాటిని దహించి కుప్ప కూలుస్తాయడానికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే ఆదివారం నాడు చెప్పిన కొన్ని నగ్న సత్యాలే నిదర్శనం. దుర్గామాత రాక్షసులను ఏ విధంగా వధించిందో దేశం అనుభవిస్తున్న దారుణమైన పేదరికాన్ని ఆ విధంగానే నిర్మూలించవలసి వుందని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ స్వదేశ్ జాగరణ్ మంచ్ (ఎస్‌జెఎమ్) తన స్వావలంబి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వెబినార్ వేదిక నుంచి మాట్లాడుతూ దేశం నిరుద్యోగం, దారిద్య్రం, ఆర్థిక అసమానతల్లో పడి ఏ విధంగా విలవిలలాడుతున్నదో ఎటువంటి దాపరికం లేకుండా హోసబలే వివరించారు.

ఇటీవలి కాలంలో వృద్ధి రేటు ఘనంగా వున్న దేశాల వరుసలో భారత్ ముందుకు దూసుకుపోయిన సంగతిని ప్రస్తావిస్తూనే ప్రజల అభ్యున్నతి విషయంలో అట్టడుగున పడి వున్న చేదు వాస్తవాన్ని ఆయన వెల్లడించారు. ఒక సమాచారాన్ని బట్టి దేశ ప్రజల్లో 20 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన కునారిల్లుతున్నారని అన్నారు. 23 కోట్ల మంది రోజుకి రూ. 375 కంటే తక్కువ ఆదాయంతో అందీ అందని జీవితాలు గడుపుతున్నారని చెప్పారు. ఈ విషయం గత జూన్‌లో ప్రచురించిన కార్మిక శక్తి సర్వేలో వెల్లడైనట్లు తెలియజేశారు. నిరుద్యోగం పెరుగుదల రేటు 7.6 శాతానికి చేరిందని ఆ సర్వేలో బయట పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే 2020లో రూ. 1.35 లక్షలుగా వున్న తలసరి ఆదాయం 2022కి రూ. 1.5 లక్షలకు చేరినట్టు హోసబలే చెప్పిన లెక్కలో సాధారణ ప్రజల సౌభాగ్యం బొత్తిగా ప్రతిబింబించదు. ఎందుకంటే తలసరి ఆదాయం దేశంలోని శత, సహస్ర కోటీశ్వరుల ఆదాయాన్ని, సాధారణ ప్రజల రాబడిని కలిపి వచ్చే మొత్తానికి తీసే సగటు అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. మొత్తమ్మీద ప్రధాని మోడీ పాలన మురిపెం ముసుగును హోసబలే పూర్తిగా తొలగించి వేశారు.

దేశంలోని అత్యధిక భాగంలో గల ప్రజలు మంచి నీటికి, పోషకాహారానికి నోచుకోడం లేదని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించిన చేదు సత్యాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే సామాజిక ఘర్షణలు, ప్రజలు విద్యావంతులు కాకపోడం వల్ల పేదరికం పేరుకుపోతున్నదని సమితి నివేదిక చెప్పిన సంగతిని పూసగుచ్చారు. ప్రభుత్వ అసమర్థత వల్లనే కొన్ని చోట్ల పేదరికం పెచ్చుమీరుతున్నదని కుండబద్దలు కొట్టారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య ఆర్థిక అసమానతేనని స్పష్టం చేస్తూ జనాభాలోని పై ఒక్క శాతం మంది వద్ద ఐదింట ఒక్క వంతు జాతి ఆదాయం పోగుపడి వున్నదని చెప్పారు. జనాభాలో సగం మంది దేశ ఆదాయంలో 13 శాతాన్ని మాత్రమే పొందుతున్నారు. ఇది ప్రజల పేదరికాన్ని పర్వత ప్రమాణంగా చూపిస్తున్నది. ప్రధాని మోడీ ప్రభుత్వం ఏడేళ్ల పాలనలో దీనిని నిర్మూలించడానికి చేసిందేమీ లేకపోగా సంపదను దోచుకోడంలో, ప్రభుత్వ రంగాన్ని దురాక్రమించుకోడంలో కార్పొరేట్ శక్తులకు మితిమించి ఉపయోగపడుతున్నది.

వారి నిరంతర సేవలో తరిస్తున్నది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా జోడీకి అత్యంత ప్రీతిపాత్రుడైన గుజరాత్‌కు చెందిన గౌతమ్ అదానీ ప్రపంచ పై ముగ్గురు అత్యంత ఐశ్వర్య వంతుల్లో ఒకరు కావడమే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. 137 బిలియన్ డాలర్ల విలువైన సంపదతో ఎలాన్ మస్క్, జెఫ్ బెజో తర్వాత స్థానాన్ని అదానీ సొంతం చేసున్నారు. ప్రభుత్వరంగంలోని రేవులను, విమానాశ్రయాలను ఇతర విలువైన సంస్థలను అదానీకి అప్పజెప్పి ఆయనను ఆకాశానికి పెంచిన మోడీ, షాలకు దుర్భర దారిద్య్రంలోని ప్రజలను బాగు చేయవలసిన బాధ్యత ఈ ఎనిమిదేళ్లలోనూ ఒక్కసారైనా గుర్తుకు రాకపోడం తగిన ప్రణాళికాబద్ధమైన కృషిని చేపట్టవలసిన అవసరం కలగకపోడం గమనించవలసిన విషయం.

పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అవకతవక అమలు లక్షలాది చిన్న, మధ్య తరహా వ్యాపారాలను, వ్యాపకాలను మూతపెట్టించాయి. ఆ విధంగా యువతకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లిపోయాయి. ఉద్యోగాల కోసం, ఉపాధుల కోసం పట్టణాలకు, నగరాలకు వలసపోడం వల్ల అక్కడి వాతావరణం పాడైపోతున్నదని ఇందుకు బదులుగా యువతకు తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామాల్లోన్నే వారికి ఉపాధులు కల్పించి పది మందికి ఉద్యోగాలిచ్చే విధంగా తయారు చేయవచ్చునని హోసబలే అభిప్రాయపడ్డారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పనిని గౌరవించే సంస్కృతి లేదన్న సంగతిని ఆయన గుర్తించడం బాగుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News