Home బిజినెస్ ఎక్కడి రేట్లు అక్కడే..

ఎక్కడి రేట్లు అక్కడే..

bsns

 యథాతథంగా రెపో రేటు 6 శాతం
 రివర్స్ రెపో రేటు కూడా 5.75 శాతం
 ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వెల్లడి

న్యూఢిల్లీ: ఆర్థిక నిపుణులు అంచనా వేసినట్టుగానే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణంపై అనిశ్చితి నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలో సమావేశమైన ద్రవ్య విధాన కమిటీ(ఎంపిసి) గురువారం నిర్ణయాన్ని ప్రకటించింది. ఈసారికి రెపో రేటు(వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బిఐ ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు) 6 శాతాన్ని యథాతథంగా కొనసాగించింది. వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చని కొందరు భావించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. రివర్స్ రెపో రేటు(బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై ఆర్‌బిఐ ఇచ్చే వడ్డీ రేటు)ను కూడా 5.75 శాతంగానే అట్టిపెట్టింది. అలాగే నగదు నిల్వల నిష్పత్తి(సిఆర్‌ఆర్) 4 శాతం, చట్ట బద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్)ను 19.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఎంపిసి(ద్రవ్య విధాన కమిటీ)లో ఐదుగురు సభ్యులు యథాతథానికి.. ఒక్కరు వడ్డీరేటును పెంచాలని ఓటు వేశారు. రెండు రోజుల సమీక్ష అనంతరం గురువారం మధ్యాహ్నం ఆర్‌బిఐ నిర్ణయాన్ని వెల్లడించింది. ద్రవ్యోల్బణ అంచనాల్ని 5.1- 5.6 శాతం నుంచి 4.7- 5.1 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 7.1 శాతం వుండొచ్చని, అలాగే జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.3 శాతానికి పెరగవచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది. అయితే ఉత్పాదక వస్తు ఉత్పత్తిలో గణనీయమైన వద్ధి కొత్త పెట్టుబడులకు ఊతం ఇస్తోందని, అంతర్జాతీయ డిమాండ్ వల్ల ఎగుమతుల్లో పురోగతి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆర్‌బిఐ పేర్కొంది. అంతర్జాతీయ డిమాండ్ పెరగడంతో ఎగుమతులకు ప్రోత్సాహం, కొత్త పెట్టుబడులకు ఊతం అందిస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అన్నారు. తదుపరి ఎంపిసి సమావేశం జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇటీవల ముడి చమురు ధరల్లో అనిశ్చితి రానున్న కాలంలో ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపనుంది. అలాగే రాష్ట్రాల స్థాయిలో ఆర్థిక పరిస్థితుల కారణంగా ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉందని ఆర్‌బిఐ పేర్కొంది.
వృద్ధి రేటు అంచనా 7.4 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశీయ వృద్ధి రేటు అంచనా 7.4 శాతం, 201718లో 6.6 శాతంగా ఉంటుందని ఆర్‌బిఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల్లో పురోగతి కారణంగా వృద్ధి రేటు పెరగనుందని ఆర్‌బిఐ అంచనా వేస్తోంది. గురువారం ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలో తొలి ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష ప్రకటన చేశారు. 201819 ప్రథమార్థంలో జిడిపి వృద్ధి అంచనా 7.3 7.4 శాతం.. అలాగే ద్వితీయార్థంలో 7.3 7.6 శాతంగా ఉంటుందని ఆర్‌బిఐ అంచనా వేసింది. వివిధ అంశాల కారణంగా ఆర్థిక వృద్ధిలో పురోగతిని అంచనా వేస్తున్నట్టు రిజర్వు బ్యాంక్ చెప్పింది. ఉత్పాదక వస్తు ఉత్పత్తిలో గణనీయమైన వద్ధి.. పెట్టుబడులకు ఊతం ఇస్తోంది. పెట్టుబడుల్లో పునరుజ్జీవనం, అంతర్జాతీయ డిమాండ్‌తో ఎగుమతుల్లో పురోగతి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండోది అంతర్జాతీయ డిమాండ్ పెరిగింది. ఇది ఎగుమతులకు ప్రోత్సాహం ఇస్తుంది.. అలాగే కొత్త పెట్టుబడులకు ఊతం అందిస్తుందని ఆర్‌బిఐ వెల్లడించింది. జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు.. 201819 ఆర్థిక సంవత్సరంలో జిడిపి అంచనా 7 7.5 శాతంగా అంచనా వేసింది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తున్న దేశంగా ముందు వరుసలో ఉందని సర్వేలో చెప్పింది.
క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు చెక్
బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై ఆర్‌బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు జరిపే వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలకు ఎలాంటి సేవలకు అందించకూడదని ఆర్‌బిఐ బ్యాంకులను ఆదేశించింది. మనీ లాండరింగ్‌ను అడ్డుకునేందుకు, వినియోగదారుల ప్రయోజనాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ప్రభుత్వం క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం జరిగిన విధాన సమీక్ష సమావేశంలో ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. క్రిప్టో కరెన్సీలు, క్రిప్టో ఆస్తుల వల్ల వినియోగదారుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, హవాలా లాంటి మోసాలు కూడా జరగొచ్చని ఆర్‌బిఐ హెచ్చరించింది. ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఖాతాలు కల్గితే సేవలను ఆపేయాలని నిర్ణయించామని ఆర్‌బిఐ వివరించింది. వర్చ్యువల్ కరెన్సీతో లావాదేవీలు చేసే ఎవరికైనా బ్యాంకులు ఎలాంటి సేవలు అందించకూడదు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంద ఆర్‌బిఐ తెలిపింది. ఆ అంశంపై త్వరలో వేరుగా సర్కులర్ జారీ చేస్తామని ఆర్‌బిఐ పేర్కొంది.