Home ఎడిటోరియల్ స్థానిక స్వపరిపాలన ఎండమావేనా?

స్థానిక స్వపరిపాలన ఎండమావేనా?

Panchayati-Raj-systemనిధుల లేమిని పూరించడానికి ప్రజలు స్వచ్ఛందంగా నిధుల సేకరణ చేసుకుని అభివృద్ధిలో దూసుకు పోవడా నికి అంకురార్పణ గావించిన గ్రామజ్యోతి ఆశించినంత గా అమలు కావడం లేదని పలువురు వాపోతు న్నారు. ఆయా గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపితేనే తప్ప లేదంటే అమలు కష్టతర మవుతుంది ఎన్ని పథకాలు రూపొందించినా గ్రామ సర్పంచ్‌లు స్పష్ట మైన అవగాహనతో, అభివృద్ధి ప్రణాళికతో క్రియాశీల కంగా ముందుకు సాగి అధికారులు, అనధికారుల చొరవతో ముందంజలో ఉంటేనే పంచాయతీలు పరిపాలనలో తమదైన ముద్రవేయ గలుగుతాయి.

దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశ పెట్టి ఏళ్ళు గడుస్తున్నా స్థానిక స్వపరి పాలన సాగడం లేదు. గాంధీజీ గారు ఆలోచించినట్లు స్థానిక సంస్థల ప్రవేశంతో అధికార వికేంద్రీకరణ జరిగి గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని భావించినా నేడు కొన్ని రాష్ట్రాలలో తప్పితే పలు రాష్ట్రాలలో స్థానిక సంస్థల భవితవ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలపైన ఆధారపడి ఉన్నది. పంచాయతీరాజ్ వ్యవస్థ మొదటగా రాజస్థాన్‌లోని నాగూర్ జిల్లాలో అక్టోబర్ 2,1959న అమలై, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తదుపరి అమలులోకి వచ్చింది. కానీ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. ఏప్రిల్ 24, 1993 నుండి పంచాయతీరాజ్ చట్టానికి రాజ్యాంగ ప్రతిపత్తి అమలులోకి వచ్చింది. మొదటగా రాజ్యాంగబద్దమైన సంస్థలుగా చలామణిలోకి వచ్చిన తరువాత ఆర్థిక అభివృద్ధి ప్లాన్‌తోపాటు , సామాజిక న్యాయ ప్రణాళిక తయారుచేయడం, 11వ షెడ్యూల్‌లోని 29అంశాలకు సంబంధించిన ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయ సాధన పథకాల అమలు పన్నులు, ఫీజులు, సుంకాలు విధించటం, వసూలు చేయడం లాంటి అధికారాలు, బాధ్యతలను కేటాయిస్తూ పంచా యతీరాజ్ వ్యవస్థలు ఏర్పడినాయి. కానీ నేటికీ ఈ 29 అంశాలు పూర్తిగా బదిలీ కాక ఆయా అంశాలలోని పథకాల అమలు అనేది రాష్ట్రప్రభుత్వాలు, సంస్థల దయపైనే ఆధారపడి ఉన్నది తప్ప గ్రామ పంచాయతీలు క్రియాశీలకమైన పాత్రను పోషించడం లేదు. అధికారాలు, బాధ్యతలు పూర్తిగా కేటాయించక నిధులు, విధులు బదలాయింపుకాక స్థానిక స్వపరిపాలన ఎండమావిగా మారింది.

అధికారాల వికేంద్రీకరణ ద్వారా గ్రామస్వరాజ్యం సిద్ధించి గ్రామసీమలు అభివృద్ధిలో అగ్రభాగంలో దూసుకుపోతాయని భావించినా నేటికీ అనేక గ్రామసీమలు బాధ్యతాయుతమైన భాగ స్వామ్యం లేక నెట్టుకొస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహ రించాల్సిన స్థానిక పంచాయతీలు పట్టుకోల్పోయి ప్రహసనంగా మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పంచాయతీల పటిష్ట అమలుకు సరైన కృషి చేయడం లేదన్న విమర్శ ఉంది. స్థానిక ప్రభుత్వాలుగా పంచాయతీలు చెలామణిలోకి వస్తే రాష్ట్ర శాసన సభ్యులు తమ పట్టుకోలోయే ప్రమాదముందన్న కారణంతో వాటిని పటిష్టపరచడం లేదన్న వాదన కూడా ఉంది. కానీ కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాలలో అధికారాల బదలాయింపు జరిగి గ్రామ పంచాయతీలు స్థానిక పాలనలో తమదైన ముద్ర వేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అధికారాలతో పాటు, నిధుల లభ్యతలోనూ రాష్ట్రాలు కేటాయించే నిధులపైననే ఆధారపడి పంచాయతీ సంస్థలు మనుగడను కొనసాగిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలుగా పిలువబడే పంచాయతీలు స్థానిక అవసరా లకు అనుగుణంగా, స్థానిక ప్రజల కోరికమేరకు పరిపాలనలో, పన్నుల విధింపులో, అభివృద్ధి పనుల కేటాయింపు, అమలు, లబ్దిదారుల ఎంపిక, ప్రగతిలో తమదైన విధంగా మార్పులు, చేర్పులు చేసుకుని సుపరిపాలన అందించాలని ఉన్నా నేటికీ ఎదుగు, బొదుగు లేక కునారిల్లుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీలకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పంచాయతీ కార్యదర్శి వ్యవస్థను ప్రవేశపెట్టి రాష్ట్ర సెక్రటేరియట్‌ను పోలిన విధంగా పాలనలో దూసుకెళ్లాలని భావించినా పంచాయతీ కార్యదర్శి వ్యవస్థ ఖాళీలతో, అదనపు బాధ్యతలతో కునారిల్లి ఆశించినంతగా విజయవంతం కాలేకపోయింది. పంచాయతీ పరిపాలనలో సహాయక పోస్టులు ఏమీలేకపోగా స్థానికంగా ఉన్నటువంటి అంతంతమాత్రమే విద్యార్హతలు కలిగిన కారోబార్ లతో నెట్టుకురావడం తప్ప గత్యంతరం లేకపోయింది. కారోబార్‌లు స్థానికులు కావడం మూలాన స్థానిక రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గే అవకాశం ఉంటుంది.

పంచాయతీ పరిపాలనను పూర్తిగా కంప్యూటరీకరించాలి. అదనంగా పోస్టులను ఏర్పాటు చేసి పంచాయతీ కార్యాలయ నిర్వ హణ సజావుగా సాగేలా చూడాలి. పంచాయతీ కార్యదర్శి వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ విధులతో కూడుకొని ఉంటుంది కనుక కార్యాలయ రికార్డుల నిర్వహణ తదితర పనుల నిమిత్తం ఒక పోస్టును ఏర్పాటు చేయాలి. గ్రామంలో మంచినీటి సరఫరా, పారిశుద్ధ నిర్వహణ సిబ్బందికి తప్పనిసరిగా కనీస వేతనం అమలు పరచాలి. చాలీచాలని వేతనంతో సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించలేక పంచాయతీల పనితీరు అఘోరిస్తోంది. ఇలా పంచాయతీల నిర్వహణపైన దృష్టి సారించి సిబ్బంది, వారి ఉద్యోగ భద్రత వంటివి సక్రమంగా అమలు పరిస్తేనే సేవలు మెరుగుపడతాయి. అరకొర వేతనంతో నెట్టుకొస్తున్న సిబ్బంది సక్రమమైన సేవలను అందించ లేకపోవడంతో గ్రామసీమలు అభివృద్ధిలో వెనుకంజలో ఉంటు న్నాయి. నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. పన్నులు వసూలు వాటిని వినియోగించే తీరును గ్రామసభలో ప్రజలకు వివరించేలా సర్పంచ్‌లు శ్రద్ధ చూపాలి. దానితో పాటు ఆర్థిక స్వావలంబన దిశగా ఆలోచించే వినూత్న పద్ధతులను పంచాయతీలు ఆచరణలో పెట్టేలా చూడాలి. కొన్నిచోట్ల చిన్నచిన్న పరిశ్రమలు, కర్మాగారాలు స్థాపించబడి విజయవంతంగా కొన సాగుతున్నా వాటిని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములను చేయడం లో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదన్న విమర్శ ఉంది. దీనితోపాటు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో స్థానికులను భాగస్వాములను చేస్తూ ప్రజాభాగ స్వామ్యాన్ని పెంపొందించవలసి ఉన్నది. నిధుల లేమిని పూరించడానికి ప్రజలు స్వచ్ఛందంగా నిధుల సేకరణ చేసుకుని అభివృద్ధిలో దూసుకుపోవడానికి అంకురార్పణ గావించిన గ్రామజ్యోతి ఆశించినంతగా అమలు కావడం లేదని పలువురు వాపోతున్నారు. ఆయా గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ చూపితేనే తప్ప లేదంటే అమలు కష్టతర మవుతుంది ఎన్ని పథకాలు రూపొం దించినా గ్రామ సర్పంచ్‌లు స్పష్టమైన అవగాహనతో, అభివృద్ధి ప్రణాళికతో క్రియాశీలకంగా ముందుకు సాగి అధికారులు, అనధి కారుల చొరవతో ముందంజలో ఉంటేనే పంచాయతీలు పరిపాలన లో తమదైన ముద్రవేయ గలుగుతాయి. లేకపోతే ఏళ్లు గడిచినా గ్రామస్వరాజ్యం సిద్ధించక, స్థానిక స్వపరిపాలన ఎండమావిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది.

-చింతల దేవేందర్, 9494284785