Home లైఫ్ స్టైల్ విషాద గీతం

విషాద గీతం

  • ప్రమాదంలో ప్రకృతి పానీయం

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో గీత వృత్తిదారులు సాధించుకున్న  పెన్షన్‌ను నెలకు రూ.2000లకు పెంచినప్పటికీ అర్హులైన అనేక మందికి అది అందడం లేదు.  రియల్ ఎస్టేట్‌తో రోడ్ల విస్తరణ, కొత్త ప్రాజెక్టులు కాల్వల పేరుతో  లక్షలాది తాటి, ఈత చెట్ల నరికివేత సాగిస్తున్నారు.  పట్టణాలు, గ్రామాలు ఒకనాడు తాటి, ఈత వనాలతో సుందరంగా కనిపించేవి. అవినేడు బోసిపోయి ఉన్నాయి. తాటి, ఈత చెట్లు పెంచడానికి హరిత హారంలో 5 ఎకరాల భూమి కేటాయింపు  చేసి, ఈ వృత్తిదారులకు 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చి ఆ చెట్లు పెంచడానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 

Toddy Farmers Problems

హైదరాబాద్ సంస్థాన ప్రభుత్వానికి భూమి శిస్తు తర్వాత అధికంగా ఆదాయం ఆబ్కారి (ఎక్సైయిజ్) పద్దు నుండి వచ్చేది. సారాయి, ఇప్ప, గంజాయి లాంటి వాటి నుండి నామ మాత్రంగానే వస్తే కల్లు మామ్లాల ద్వారానే మొత్తం ఆదాయం సమకూరేది. అందువలన నిజాం ప్రభుత్వం తాటి, ఈత చెట్లకు సంపూర్ణ రక్షణ ఇచ్చేది. వాటిని నరికితే కఠినమైన చర్యలు, శిక్షలు ఉండేవి. ఆ రోజులలో ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలంటే ఆదాయానికి దెబ్బ కొట్టాలి. అందుకు తాటి, ఈత చెట్లను నరకడం కూడా ఉద్యమంలో భాగంగా ఉండేది. దీనిని బట్టి అప్పట్లో ఈ వృత్తికి ఉన్న ప్రాధాన్యం అర్థమవుతోంది. కల్లు మామ్లాలు కూడా మామూలు వాళ్ళు కాకుండా పెద్ద భూస్వాములు, దేశ ముఖ్‌లు వేలం పాటల్లో దక్కించుకుని స్థానిక పెత్తందార్ల ద్వారా కల్లు గీత వృత్తి మీద ఆధారపడి జీవించే గీత కులస్థులకు “పొందు బాట చేసేవారు. భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాయుధ పోరాటం కూడా చేసి ‘దున్నే’ వానిదే భూమి నినాదంతో పాటు ‘గీతగానిదే చెట్టు ’ నినాదం కూడా మిళితం చేసి ఉద్యమించడ మనేది ఫ్యూడల్ విధానికి సంపూర్ణ వ్యతిరేకమైనదిగా విశదమవుతున్నది. 1937 సంవత్సరంలో మద్రాసు నగరంలో కాంట్రాక్టరు విధానానికి వ్యతిరేకంగా జీతాల పెంపుదల, న్యాయమైన పని విధానం కోసం 3000 మంది గీత కార్మికులు ఎస్.వి ఘాటె, పి.రామమూర్తి, మురుగేశన్‌ల నేతృత్వంలో సమ్మె చేసి విజయాలను సాధించారు. హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ధర్మభిక్షం నేతృత్వంలో కంట్రాక్టు మలోపూజు(చెట్ల రిజర్వు) రద్దుకు సొసైటీల స్థాపనకు బ్రహ్మండమైన పోరాటాలు సాగాయి. ఎట్టకేలకు 4-5 సొసైటీలకు నాటి ప్రభుత్వం ప్రకటించింది. తాటి, ఈత చెట్లతో కేవలం ప్రభుత్వానికి ఆదాయం, గీత కార్మికులకు ఉపాధి మాత్రమే కాకుండా రైతులకు “హక్కె మాలి ఛాన” (చెట్టు మొదళ్ళ పన్ను) ద్వారా ఆదాయం లభిస్తుండేది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రూపుదిద్దుకొన్న తర్వాత ‘సారా’ లిక్కర్ ప్రాబల్యంలోకి వచ్చినది. పట్టణాలు, నగరాల కల్లు దుకాణాలపై కన్ను వేసి వాటిని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవడం ప్రారంభమైంది. అదే విధంగా గీత పనివారలు కూడా సంఘటితమై పోరాటాలు ఉధృతం చేయడం మొదలు పెట్టారు. కల్లుగీత సహకార సంఘాలు, గీసే వానికి చెట్టు పథకం (టి.ఎఫ్. టి) లను సాధించకోవడం పెద్ద ఎత్తున మొదలైంది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో సూర్యాపేటలో గీత పనివారలు పెద్ద ఎత్తున ధర్మభిక్షం అధ్యక్షతన మహాసభలు నిర్వహించి ఆనాటి ఎక్సైజ్ మంత్రి వి. పురుషోత్తం రెడ్డి, కార్మిక శాఖ మంత్రి టి. అంజయ్యలను ఆహ్వానించి చెట్లపై నుండి పడి వికలాంగులైన వారికి, మరణించిన కుటుంబాల వారసులకు ఎక్స్‌గ్రేషియా పథకంను సాధించుకున్నారు. జిఒ ఎం.ఎస్‌నెం. 425, 18 నవంబర్ 1977 ద్వారా మరణించిన వారి కుటుంబాలకు లేక శాశ్వత వికలాంగులకు రూ. 2000/-, తాత్కలికంగా వృత్తి చేయలేని వారికి రూ. 500/- ల ఎక్స్‌గ్రేషియా అమలుకు వచ్చింది. 1985లో జిఒ .145 ద్వారా 10,000/-, 2000/-,1000/- 1994లో 852 జిఒ జిఒ ద్వారా 25 వేలు, 20,000, 1000 తదనంతరం 2 లక్షలు, శాశ్వత వికలాంగులకు 50,000, తాత్కాలికంగా వృత్తి నిర్వహించలేని వారికి 10,000 లకు పెంచబడింది. డా॥ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు తాటి, గీత వనాల పెంపుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలనే మెమోను పొందితే, టి. దేవేందర్‌గౌడ్ రెవెన్యూ, ఎక్సైజ్ మంత్రిగా ఉండగా జిఒ 560 సాధించుకోవడం జరిగింది. పాలకులు మాత్రం ఏయేడు కాయేడు కల్లును రద్దు చేసి లిక్కర్ మార్కెట్‌ను విస్తరించేందుకు సాగిస్తున్న కుట్రలను గీత వృత్తిదారులు పసిగట్టి పోరాటాలు చేసి వెనకకు కొట్టడం జరుగుతుండేది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగిన సారా వ్యతిరేక ఉద్యమ సమయంలో నాటి ముఖ్యమంత్రి విజయ భాస్కర్‌రెడ్డి కల్లుపై నిషేధం కొరఢా ఝళిపించాడు. అన్ని రాజకీయ పార్టీలు కల్లును మినహాయించాలన్నాయి. గీత కార్మికులు ఉవ్వెత్తున ఉద్యమాలు చేశారు. పార్లమెంట్‌లో ధర్మభిక్షం అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యుల సంతకాలతో నాటి ప్రధాని పి.వి. నరసింహారావుకు మెమోరాండం సమర్పించారు. దానికి ఆయన స్పందించి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి కి లేఖ రాశారు. మొత్తం పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో కల్లు వృత్తిలో కాంట్రాక్ట్ విధానం రద్దు అయి తద్వారా సుమారు 12.000 దుకాణాలు, టిఎఫ్‌టిల నిర్వహణలోకి తేబడ్డాయి. గీత వృత్తిలో ఇది కూడా మహత్తరమైన మలుపు.
1991లో వచ్చిన నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణతో అన్ని రంగాల్లో విదేశీ కంపెనీలకు తలుపులు బార్లా తెరిచారు. దాని ప్రభావంతో మద్యం వ్యాపారం విస్తృతమైంది. 1999-2000 లో 2200 కోట్లు ఉన్న ఎక్సైజ్ ఆదాయం 2006 నాటికి 5350 కోట్లు, 2009 -2010 కి 14,720 కోట్లకు పెరిగి రాష్ట్ర బడ్జెట్‌కు మూల స్తంభం అయ్యింది. సుప్రీం కోర్టులో హైకోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప లిక్కర్ వ్యాపారాన్ని పాలక వర్గాలు పట్టించుకోవు. వారు కల్లు గీత వృత్తిని నాశనం చేసి లిక్కర్ మాఫియా చేతికి రాష్ట్రాన్ని కట్టబెట్టేకుయుక్తులు చేస్తూనే ఉంటారు. ఈ వృత్తిలో కూడా బినామీలు గీత వృత్తిదారుల సొసైటీ లను టిఎఫ్‌టిలను వశం చేసుకుని , కల్తీని ప్రవేశపెట్టి, వృత్తికి కళంకం తెచ్చి పెట్టారు. కొన్ని జిల్లాల్లో రియల్ ఎస్టేట్‌తో బార్లతో పాటు కల్లు దుకాణాలు తమ చేతుల్లో పెట్టుకుని నిజంగా వృత్తి చేసుకునే గ్రామాలవారిపై తప్పుడు కేసులు పెట్టించి ఆ దుకాణాలను రద్దుచేయడం జరుగుతోంది. డాక్టర్. వై.ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా మద్యం దిగుమతి చేసుకునే అవకాశం కల్పించి, చుట్టు పక్కల 70 కి.మీలలో చెట్లు లేవని చెప్పి వందల సంవత్సరాల నుండి ఉన్న హైదరాబాద్, దాని పరిసర కల్లు దుకాణాలను మూసివేయించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో గీత వృత్తిదారులు సాధించుకున్న పెన్షన్‌ను నెలకు రూ.2000లకు పెంచినప్పటికీ అర్హులైన అనేక మందికి అది అందడం లేదు. రియల్ ఎస్టేట్‌తో రోడ్ల విస్తరణ, కొత్త ప్రాజెక్టులు కాల్వల పేరుతో లక్షలాది తాటి, ఈత చెట్ల్ల నరికి వేత సాగిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు ఒకనాడు తాటి, ఈత వనాలతో సుందరంగా కనిపించేవి. అవినేడు బోసిపోయి ఉన్నాయి. హరిత వనంలో తాటి, ఈత చెట్లు పెంచడానికి 5 ఎకరాల భూమి కేటాయింపు చేసి, ఈ వృత్తిదారులకు 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చి ఆ చెట్లు పెంచడానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చీప్ లిక్కర్, బెల్ట్ షాపులు చేతి వృత్తిదారుల పాలిట ఉరి తాళ్లుగా మారి కల్లు అమ్ముడుపోక కుటుంబాలను సాదలేక ముంబయి, చెన్నై, పుణె, హైదరాబాద్‌లకి వలసబాటలు పడ్తున్నారు. స్థానికంగా ఆటోలు నడుపుకుంటూ, రియలు ఎస్టేట్ వ్యాపారం ఏజెంట్లుగా, బఠానీలు, పల్లీ అమ్ముకునే స్థితికి నెట్టివేయబడుతున్నారు. తాటి, ఈత వనాల పెంపకం పర్యావరణ పరిరక్షణతో పాటు అనేక మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రభుత్వం లిక్కర్ ఆదాయం మీద మక్కువను తగ్గించి ప్రజల ఆరోగ్యం కుటుంబ వ్యవస్థలపై దాని ప్రభావం పరిగణనలోకి తీసుకోవాలి.కల్లుగీత వృత్తిని గ్రామీణ ఉపాధిలో ప్రధానమైనదిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోతే చాలా నష్టం జరుగుతుంది. మహాతా గాంధీ పేర్కొన్నట్లు తాటి, ఈత ఖర్జూర వనాలు ప్రకృతి ప్రసాదించిన వరం. భూములను తాటి, ఈత వనాలకు ఉపయోగించాలనడం ఎంత గొప్ప ఆలోచన!. దాన్ని అమలు చేయాలి. తాటి చెట్లు కల్లు, నీరా, బెల్లం చక్కెర , ఆల్కాహాల్ బి, సి విటమిన్లు మినరల్ ఉత్పత్తులు పీచు నార కమ్మలు యావత్తు ఇచ్చే కల్పవృక్షాలు. దీనిని జాతి సంపదగా గుర్తించి, రక్షించి పెంచి పోషిస్తే ఆరోగ్యకరమైన ఆహారం అందించే వనరు అవుతుంది.
చెట్టు మీద నుంచి పడి మరణించే వారికి గతంలో ఉన్న ఎక్స్‌గ్రేషియా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 5 లక్షలలకు పెంచుతానని ప్రకటించి సంవత్సరం దాటుతున్నప్పటికీ ఇంకా అమలుకు రాలేదు. గతంలో దీనిని లాంబార్టో ఇన్సూరెన్సు కంపెనీకి ముడిపెట్టడంతో సంవత్సరాల తరబడి అది దానిని మురగబెట్టి ఆ కుటుంబాలకు ఇంతవరకు ఎక్స్‌గేషియా చెల్లించ లేదు.దీనిని తిరిగి ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించాలనే ఆలోచనను గీత వృత్తిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రు. 2015 ఫిబ్రవరి 28 నాటికి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ కేసులు లేవని చెప్తున్నప్పటికీ ఒక్క నల్లగొండ జిల్లాలోనే 2 కోట్ల వరకు మంజూరు అయిన డబ్బు కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. తరతరాలు గా వృత్తిలో ఉన్న గిరిజన ప్రాంతంలోని గీత వృత్తిదారు లు షెడ్యూలు, ఏరియా పేరుతో వృత్తి నుండి దూరం చేయబడ్డారు. లైసెన్సులు లేక అనేక చోట్ల పెండింగ్‌లో ఉంచారు. గీత సహకార సంక్షేమ సంఘం పేరుకు మాత్రమే ఉన్నట్లున్నది. దానికి నిధులు లేవు. సంక్షేమం లేదు. కల్లుగీత వృత్తిని, వృత్తిదారులను కాపాడడానికి వృత్తి- వనం- ఉపాధి గ్యాంరటీతో కూడిన సమగ్రచట్టం రావాలి. కృత్రిమ పానీయాల స్థానంలో ప్రకృతి పానీయమైన కల్లు- నీరా, ఆహార- ఆహారేతర ఉత్ప త్తులకు సంపూర్ణ పోత్సాహం ఇవ్వాలి. ముంజులు, గేడు తో, తాటి , ఈత పండ్లు పుష్కలమైన పోషక విలువలుండే రుచికరమైన తిండి పదార్థాలు- పోసుప్రూటుగా ముద్దుగా పిలుచుకునే ముంజులు 5 నక్షత్రాల హోటల్‌లో కూడా సలాడ్‌గా అమ్ముడుకావలసినవి. ఇప్పుడది “గరీబు” వస్తువుగా ఉన్నది. దానికి విస్తారమైన మార్కెట్లు కల్పిం చాలి. ఎక్సైజ్ విధానంలో కాకుండా సహకార రంగంలో కల్లుగీతను వృద్ధి చేసి కుల్లు గీత కార్మికుల స్థైర్యం పెంచాలి. కల్లును మత్తుగా కాకుండ ఆరోగ్యవంతమైన ఆహారంగా అందించాలి. కొబ్బరి రైతులు తమ తోటల్లో నీరా, ఆల్కహాలు ఉత్పత్తులకు అవకాశం కల్పించాలని ఎక్సైజ్ చట్టం నుండి మినహాయించాలని దరఖాస్తులు చేయడం శుభపరిణామం.

ప్రాణాలను పణంగా పెట్టి  వృత్తి చేసుకునే గీత పనివారలకు తగు ప్రోత్సాహం, ఆర్థిక సహకారం, సాంకేతిక సహాయం

 సమకూర్చితే తెలంగాణ రాష్ట్రం తాళ ఉత్పత్తుల కేంద్రంగా  విలసిల్లి గ్రామీణ ఉపాధికి ఆట పట్టుగా  వర్దిల్లుతుంది.

గ్రామీణ భారతం నుంచి  వలసలకు తగ్గుతాయి.

B.Prabhakar

– బొమ్మగాని ప్రభాకర్
9490952248