Home రాష్ట్ర వార్తలు క్రైస్తవులకు అభయం

క్రైస్తవులకు అభయం

 

cmఏడాదిలో క్రిస్టియన్
భవన నిర్మాణం
జెరూసలేం వెళ్లేందుకు
రాయితీ పథకం
చర్చిల నిర్మాణానికి
రూ.10 కోట్లు
క్రిస్మస్ విందులో
ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : వచ్చే క్రిస్మస్ నాటికి హైదరాబాద్‌లో క్రిస్టియన్ భవన్ నిర్మాణం తప్పనిసరిగా పూర్తయ్యేలా చూస్తానని, ఆ పనులు తానే వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని సిఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. క్రైస్తవులు జెరూ సలేం వెళ్లేందుకు రాయితీ కల్పించే పథకాన్ని అమ లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పాత చర్చీల మరమ్మతులు, నూతన చర్చీల నిర్మాణం కోసం పలువురు విజ్ఞప్తి చేశారని, వీటి కోసం రూ.10 కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు. స్మశాన వాటికల కోసం స్థలాలు, తదితర సమస్యలను పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం నిజాం కాలేజీ మైదానంలో ఇచ్చిన క్రిస్మస్ విందులో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ క్రిస్టియన్ భవన్‌పై కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికే అడ్వకేట్ జనరల్‌తో చర్చించినట్లు వెల్లడించారు. గత నాలుగేళ్లుగా అధికారికంగా క్రిస్మస్ నిర్వహిస్తున్నామని, తొలిసారి క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులపై దాడులను అరికట్టాలని కోరానన్నారు. ప్రస్తుతం క్రైస్తవ పెద్దలను అడిగితే ఒకట్రెండు  చోట్ల తప్ప దాడులు పూర్తిగా ఆగిపోయినట్టుగా చెబుతున్నారన్నారు. ఎక్కడైనా దాడులు జరిగితే వాటిని గట్టిగా అణచివేస్తామన్నారు. ప్రస్తుతం దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా క్రిస్మస్, రంజాన్, బోనాలు, బతుకమ్మ పండుగలను నిర్వహిస్తూ దేశానికి లౌకికత్వాన్ని, ప్రపంచానికి మానవత్వాన్ని చాటుతున్నామన్నారు. ముస్లింలు అత్యధికంగా ఉన్న జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సైతం తెలంగాణలో రంజాన్‌ను అధికారికంగా నిర్వహించడాన్ని ప్రశంసించారన్నారు. పండుగ సమయంలో పేదలికిచ్చే బహుమతుల విలువను చూడవద్దని, పండుగలకు తమను పట్టించుకునే ప్రభుత్వం ఉందనే భరోసా పేదలకిస్తున్నామన్నారు. పరాధీనత నుండి స్వాధీనతలోకి వచ్చిన తెలంగాణ తన గమనాన్ని, ప్రస్తానాన్ని సంతోషపూర్వకంగా కొనసాగిస్తుందన్నారు.
రాజకీయాలు వికృత రూపం దాల్చాయని ఆయన అన్నారు. గతంలో రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండేవని, కొత్తగా అభివృద్ధి పనులను అడ్డుకునే ధోరణి పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును అడ్డుకునేందుకు 196 కేసులు వేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో కలిసిమెలిసి బ్రతికేందుకు యేసుక్రీస్తు ఆశీస్సులు అందించాలని ఆకాంక్షిస్తూ సిఎం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
లౌకికత్వానికి నిబద్ధుడు సిఎం : ఆర్చిబిషప్ తుమ్మ బాల
లౌకికత్వానికి నిబద్దత కలిగిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్రైస్తవుల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని క్యాథలిక్ చర్చ్ ఆర్చిబిషన్ తుమ్మబాల ప్రశంసించారు. క్రైస్తవ సంస్థలు విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు వరసలో ఉన్నాయని, ప్రభుత్వం సహకరిస్తే వాటిని మరింత విస్తరిస్తామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తున్నదని, పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. అశాంతి నిండిన ప్రపంచానికి శాంతినిచ్చేందుకే యేసుక్రీస్తు మానవ రూపంలో భువికి అరుదెంచారని మెథడిస్ట్ చర్చి బిషప్ ఎం.ఎ.డానియల్ తెలిపారు. వేడుకల్లో క్రిస్మస్ సందేశాన్ని వినిపించిన ఆయన మాట్లాడుతూ, యుద్ధం, తీవ్రవాదం, మాదకద్రవ్యాలకు బానిసలు కావడం, మానవ అక్రమ రవాణా లాంటి జాఢ్యాలతో అశాంతి నిండిన ప్రపంచానికి శాంతి, ప్రేమలను అందించేందుకు యేసు వచ్చారన్నారు. శాంతి, క్షమాగుణం, ప్రేమలతో కలిసి బ్రతకాలని బైబిల్ చెబుతుందన్నారు.
కార్యక్రమంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా బిషప్ రెవరెండ్ భాస్కరయ్య ప్రారంభ ప్రార్థన చేయగా, బాప్టిస్ట్ చర్చి రెవరెండ్ పురుషోత్తం బైబిల్ పఠనం చేశారు. మెన్నోనైట్ బ్రదరన్ (ఎంబి) చర్చి బిషప్ మెన జోయల్ ముగింపు ప్రార్థన చేశారు. కార్యక్రమంలో సామాజిక, విద్య, వైద్యం తదితర రంగాల్లో సేవలందించిన క్రైస్తవులకు ముఖ్యమంత్రి పురస్కారాలను అందజేశారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనమండలి ఛైర్మన్ కె.స్వామిగౌడ్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వేడుకలకు ముందు సిఎం అనాథ పిల్లలకు బహుమతులను అందజేశారు.