Home తాజా వార్తలు దిగిరాని డిమాండ్

దిగిరాని డిమాండ్

The same record for a week

వారం రోజులుగా అదే రికార్డు
పదివేల మెగావాట్ల వద్దనే
పెరిగిన సాగు విద్యుత్ వినియోగం

మన తెలంగాణ/ హైదరాబాద్ : వారం రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయిలో కొనసాగుతోంది. నాలుగైదు రోజుల క్రితం 10 వేల మెగావాట్లకు చేరిన విద్యుత్ వినియోగం ఇప్పటికీ అదే స్థా యిలో ఉంది. రుతుపవనాల ప్రభావం సాధార ణంకంటే తక్కువగా ఉండడంతో పంటలకు అవసరమైన నీటి కోసం వ్యవసాయపంపుసెట్లు నిరాటంకంగా పనిచేస్తూ ఉన్నాయి. నాటిన విత్తనం మొలకెత్తకుండానే లోపలే మాడిపోతోందని ఆవేదన చెందుతున్న రైతాంగం పెట్టుబడి, రెక్కల కష్టం రెండూ కోల్పోతామన్న ఆందోళన తో పంపుసెట్లపై ఆధారపడాల్సి వస్తోంది. గరిష్ట విద్యుత్ వినియోగం అటు సరఫరా ఇటు పంపి ణీ సంస్థలకు సవాలుగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది. నిజాం కాలం నాటి సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణతో అందుబాటులోకి వచ్చిన భూగర్భ జలాలు, తెలంగాణ ఎగువ ప్రాంతాలైన కర్నాటక, మహారాష్ట్రల నుంచి వస్తున్న వరద కారణంగా గోదావరి, కృష్ణా బేసిన్‌ల పరిధిలోని ప్రాజెక్టుల్లోకి ఓ మోస్తరు నీరు చేరింది.

రాష్ట్రంలోని రెండు పంపిణీ సంస్థల అధికారిక లెక్కల మేరకు దాదాపు 24 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం సరఫరా అవుతున్న 10 వేల పైచిలుకు మెగావాట్ల విద్యుత్‌లో వ్యవసాయ రంగానికి దాదాపు 3 వేలకు పైగా మెగావాట్లు పోతోంద ని అంచనా. ఇక గ్రేటర్ హైదరాబాద్ డిమాండ్ అటుఇటూ 3 వేల మెగావాట్ల వినియోగానికి చేరువవుతోంది.పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, గృహ అవసరాలకు 40 శాతం విద్యుత్ (ఇందులో 30శాతం వినియోగం పార్రిశామికరంగానిదే) సరఫరా అవుతోంది. జూలై 31న తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆల్‌టైం రికార్డు నమోదు చేశాయి. నిజానికి జూలై 30వ తేదీన అనునియంత్రిత విద్యుత్ రద్దీ డిమాండ్ 9712 మెగావాట్లకు చేరగానే సరఫరా, పంపిణీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. జూలై 31వ నాటి అంచనా డిమాండ్‌కు తగ్గట్లుగా అనునియంత్రిత రద్దీని తట్టుకునే వీలుగా సిద్ధపడ్డాయి. ఆ రోజున 10429 మెగావాట్ల విద్యుత్/220మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి.

ఆగస్టు ఒకటవ తేదిన 10149 మెగావాట్లు / 209 మిలియన్ యూనిట్లు. రెండవ తేదీన 9387 మెగావాట్లు / 201 మిలియన్ యూనిట్లు, మూడవ తేదీన 9712 మెగావాట్లు /209 మిలియన్ యూనిట్ల విద్యుత్ చొప్పున వినియోగం జరిగినట్లు గణంకాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మహానగరంతో పాటువ్యవసాయ, పారిశ్రామిక రంగాల నుంచి రద్దీవేళ్లలో కాకు ండా నియంత్రిత వేళల్లోను సరఫరాడిమాండ్ పెరుగుతోంది. విద్యుత్ సం స్థల స్వీయ నిధులు, కేంద్ర విద్యుత్ శాఖ ప్రాయోజిత పథకాల కారణంగా విద్యుత్ సరఫరా,పంపిణీ వ్యవస్థల విస్తరణ కారణంగా అంచనాలకు మించి పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నారు. భారీ,మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరాకై ట్రాన్స్‌కో 400 కెవి, 220 కెవి, 132 కెవి సబ్‌స్టేషన నిర్మాణం, ఇంట టర్ సర్కూట్ లైన్ల విస్తరణ మూలంగా రద్దీలేని సమయాలు, రద్దీ సమయాల్లోను ఫ్రీక్వెన్సీలో హెచ్చుతగ్గుల సమస్యలను అధిగమించగలుతున్నారు.

ముందున్నది విషమకాలమే…, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోయినా, సగటు నమోదుతో సరిపెట్టుకున్నా వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తుంది. వ్యవసాయ పంపుసెట్ల సంఖ్యపై పంపిణీ సంస్థల అధికారిక, అనధికారిక లెక్కలను పక్కకు పెడితే వీటి సంఖ్య 26 లక్షలకు దాటిందనే సమాచారం. అధికారిక ముద్ర కోసం డిడిలు చెల్లించిన రైతులకు కావాల్సిన ప్రాథమిక వసతులు కల్పించి విద్యుత్ అందజేసినా పంపిణీ గణంకాల్లో పెద్దగా మార్పులు ఉండవని సమాచారం. ఇంతకు ముందు ఏడు గంటల విద్యుత్ సరఫరా విధానంలో ఎన్ని విడతలుగా ఏయే సమయాల్లో ఇస్తారనే దానిపై అటు పంపిణీ సంస్థలకు కానీ, ఇటు రైతాంగానికి కానీ పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అసలే ఉచిత విద్యుత్ ఇచ్చినపుడే వాడుకోవాలనే ధ్యాసలో రైతులున్న మూలంగా పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. 24గంటల ఉచిత విద్యుత్ అధికమొత్తం పగటిపూట సరఫరా కావడంతో అందుబాటులో ఉన్న మేరకు భూగర్బజలాలను తోడిపోసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏయే సర్కిళ్లవారీగా ఎంత వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉందనే అంశంపై పంపిణీ సంస్థలు అంచనాకు రాలేకపోతున్నాయి.