Home తాజా వార్తలు రెండో విడత గొర్రెల పంపకానికి సర్వం సిద్ధం

రెండో విడత గొర్రెల పంపకానికి సర్వం సిద్ధం

Sheep

 

తొలివిడుతలో 6,548 మందికి పంపిణీ
రెండో విడుత లక్షం 5,786 యూనిట్లు

మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వం గొల్ల కుర్మలను ఆదుకునేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ గొర్రెల పథకాన్ని ప్రవేశపెట్టగా జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. దీంతో గొల్లకుర్మల కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరి స్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 6,548 మంది యాదవులకు లబ్ది చేకూరింది. ప్రభుత్వం సబ్సిడీ గొర్రెలు అందించడంతో పాటు దాణా, పశుగ్రాసం కూడా పంపిణీ చేస్తుంది.

కాగా అధికార యంత్రాంగం రెండో విడతలో భాగంగా 5,786 యూనిట్లను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. కుల వృత్తిపై ఆదారపడ్డ్డ గొర్రెల పెంపకం దారులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తున్నారు.

21 గొర్రెలతో కూడిన ఒక్కో యూనిట్ విలువ రూ. 1.25 లక్షలు కాగా ఇందులో లబ్దిదారుని వాటా 25 శాతం అంటే రూ. 31,250 డబ్బులను డిడి రూపంలో ప్రభుత్వానికి తమ వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీపై అందజేసిన గొర్రెలకు పశుసంవర్థకశాఖ అధికారులు ఇన్సూరెన్స్ చేయడమే కాకుండా ప్రతి లబ్దిదారునికి రూ. 420 విలువ చేసే మందులు. రూ. 3,445 విలువ చేసే దాణాను అందజేస్తారు.

రెండో విడత కింద జన్నారంలో 586 యూనిట్లు,లక్షెట్టిపేటలో 312,హాజీపూర్‌లో 243,దండేపల్లిలో 497,నస్పూర్‌లో 182,జైపూర్‌లో 357, భీమారంలో 232, చెన్నూర్‌లో 577, కోటపల్లిలో 379,వేమనపల్లిలో 281, మందమర్రిలో 286, బెల్లంపల్లిలో 267, కాసిపేటలో 563, తాండూర్‌లో 274,నెన్నెలలో 372, భీమినిలో 238, కన్నెపల్లిలో 140 యూనిట్లను యాదవులకు అందజేసేందుకు అధికారులు లక్షంగా పెట్టుకున్నారు.

జిల్లాలో మొత్తం సబ్సిడీ పొందడానికి 11,619 మంది అర్హులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో మొదటి జాబితాలో 5,833 మందికి సబ్సిడీ గొర్రెలు అందించేందుకు చర్యలు చేపట్టారు. రెండో విడతలో గొర్రెలను కొనుగోలు చేసేందుకు అధికారులు అనంతపురం, చిత్తూరు జిల్లాలకు బృందాలను పంపించారు. మరోవైపు ప్రభుత్వం గొల్లకుర్మలకు కేవలం గొర్రెలను అందజేసి చేతులు దులుపుకోకుండా వాటి సంరక్షణపై కూడా దృష్టిని సారించింది.

ఇందులో భాగంగా దాణాతో పాటు మందులను కూడా అందజేస్తుంది. మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెల్లో 40శాతం పునరుత్పత్తి జరిగింది. రెండో విడత పూర్తయితే గ్రామాల్లో గొర్రెల సందడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ కింద గొర్రెలను పంపిణీ చేస్తుండగా ప్రయోజనం పొందుతున్న గొల్లకుర్మల కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.

The second installment is to prepare for delivery of Sheep