Home పెద్దపల్లి తెలంగాణాకు ఆదర్శంగా పెద్దపల్లి సాండ్ టాక్స్ పాలసీ

తెలంగాణాకు ఆదర్శంగా పెద్దపల్లి సాండ్ టాక్స్ పాలసీ

the-smuggling-of-barriers-sand

చౌకగా లబ్ధిదారునికి చేరవేత 

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట

ఏటా జిల్లాకు రూ.2 కోట్ల ఆదాయం

పలు జిల్లాలలో పెద్దపల్లి సాండ్ టాక్స్ పాలసీ అమలు

మన తెలంగాణ/పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో ఒకప్పుడు ఇసుక బంగారాన్ని మరిపించింది. సామాన్యుని నుండి ధనవంతుని వరకు దొంగచాటుగా తీసుకొచ్చె ఇసుక కోసం రాత్రుళ్లు పడిగాపులు కాసేవారు. సమయానికి ఇసుక రాక నిర్మాణాలు సైతం ఆగిన సందర్భాలు అనేకం. ఎంఆర్‌వో ఆఫీసుల చుట్టు కాళ్లరిగేలా తిరిగితె ఒకటి లేదా రెండు ట్రిప్‌లకు అనుమతి ఇచ్చేవారు. వాటికి ట్రేజరీలో చాలన్ కట్టాక, వరుస క్రమంలో గుమ్మం తొక్కే వరకు వినియోగ దారునికి చుక్కలు కలిపించేవి. కాని నేడు పెద్దపల్లి జిల్లాలో పరిస్థితి మారింది. 26 ఫిబ్రవరి 2017 లో అప్పటి పెద్దపల్లి కలెక్టర్ అలుగు వర్షిణి దేశంలోనే ఇసుక రవాణాలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి సాండ్‌టాక్స్ పాలసీని రూపొందించడంతో జిల్లా ప్రజల కష్టాలు తీరాయి. పెద్దపల్లి సాండ్ టాక్స్ పాలసి తీసుకొచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో రాష్ట్రంలోనే కాక దేశంలో బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. రాష్ట్రంలోఅనేక జిల్లాలు పెద్దపల్లి ఇసుక విదానాన్ని అనుసరిస్తున్నాయి. స్వయంగా రాష్ట్ర ఐటి.మున్సిపల్ శాఖామం త్రి కేటి.రామారావు స్వయంగా ప్రశంసించడంతో పాటు పెద్దపల్లి సాండ్‌టాక్స్ పాలసీని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు క్షేత్రస్థాయిలో అద్యయనం చేసి తమ తమ జిల్లాలలో అమలు చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి పిలుపు మేర కు రాష్ట్రంలోని పలు జిల్లాలు తమ తమ జిల్లాలో పెద్దపల్లి ఇసుక విదానాన్ని అమలు పరుస్తూ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం పెద్దపల్లి సాండ్‌టాక్స్ పాలసీకి గాను అప్పటి కలెక్టర్ అలుగు వర్షిణికి ఎక్స్‌లెన్స్ అవార్డును సైతం ఇటీవల అందించడం జరిగింది.
ఏటా 2 కోట్ల ఆదాయం
–గతంలో ఉన్న ఇసుక విదానం వల్ల గడిచిన 5 సంవత్సరాల కాలంలో పెద్దపల్లి జిల్లాకు కోటి రూపాయల ఆదాయం సైతం సమకూరలేదు. జిల్లాలో నూతనంగా అమలు చేస్తు న్న సాండ్‌టాక్స్ విదానం వల్ల 2017 మార్చినుండి 2018 మార్చి వరకు 2 కోట్ల అదాయం సమకూరింది. సీనరేజ్ చార్జీల కింద క్యూబిక్ మీటరుకు 40 రూపాయల చొప్పున వచ్చిన రాయల్టి నుండి 30 శాతం మొత్తాన్ని (డిఎంఎఫ్‌టి) డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ కు విద్య,వైద్యం,హరితహరం తదితర వివిద సామాజిక సేవా కార్యక్రమాలకు గాను జమ చేస్తారు. పెద్దపల్లి జిల్లా సాండ్ మేనేజ్ మెంట్ సొసైటీ ద్వారా (డిఎంఎఫ్‌టి) కి 45 లక్షలకు పై చిలుకు మొత్తం జమ కావడం విశేషం.

చౌకగా లబ్ధిదారునికి ఇసుక చేరవేత : జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన

పెద్దపల్లి జిల్లాగా ఏర్పడిన అనంతరం రూపొందించిన సాండ్ టాక్స్ పాలసి తెలంగాణా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా లబ్ధిదారునికి చౌకగా ఇసుకను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు.  ఇప్పటి వరకు జిల్లాలో 880 ట్రాక్టర్లు సాండ్‌టాక్స్ కింద రిజిస్టర్ చేసుకున్నారని, అందులో 234 ట్రాక్టర్లకు మాత్రమే జిపిఎస్ విధానం అమలులో ఉందని, మిగతా ట్రాక్టర్లకు  జిపిఎస్ విధానం అమర్చేందుకు త్వరలో టెండర్లు పిలువనున్నట్లు కలెక్టర్  తెలిపారు. సాండ్‌టాక్స్ నిర్వహణలో సిబ్బంది కొరత ఉందని, వారది ద్వారా త్వరలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిని, డాటా ఎంట్రి ఆపరేటర్లను నియమిస్తామని తెలిపారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన పెద్దపల్లి సాండ్‌టాక్స్ పాలసిని రాబోయే రోజుల్లో మరింత పారదర్శకం గా అమలు పర్చేందుకు పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

అక్రమాలకు అడ్డుకట్ట: మైనింగ్ ఎడి.బాలా ప్రసాద్

పెద్దపల్లి జిల్లాలో ప్రవేశ పెట్టిన సాండ్ టాక్స్ విధానం వల్ల ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిందని జిల్లా మైనింగ్ ఎడి.బాలా ప్రసాద్ తెలిపారు. వినియోగదారునికి సమయంలో ఇసుకను చౌకగా అందిస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో  ప్రస్తుతం గట్టెపల్లి, కదంబాపూర్, నీరుకుల్ల, మీర్జమ్ పేట్,కనగర్తి, ముత్తారం, ఖమ్మంపల్లి, చిన్నఒదాల, గోపాల్ పూర్‌లలో మొత్తం తొమ్మిది ఇసుక క్వారీల నుండి ఇసుకను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ఇసుక అవసరమున్న వినియోగదారులు www.sandtaxi.com వెబ్‌సైట్ ద్వారా  ఇంటర్‌నెట్ అందుబాటులో ఉన్న వారు ఇంటి నుండి ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకోవచ్చని పేర్కొన్నారు. బుక్ చేసుకున్న వారి సెల్ నంబరుకు మెసేజ్‌ల ద్వారా డెలివరి సమయాన్ని వివరించి నేరుగా ఇంటికి ఇసుకను చేరవేస్తారని ఆయన తెలిపారు. జిల్లా సాండ్ మేనేజ్‌మెంట్ సొసైటి నిర్దేశించిన నిబందనలను అనుసరించి తగిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.