Home ఎడిటోరియల్ ఏడ్చిన ఎవుసానికి సంబురం

ఏడ్చిన ఎవుసానికి సంబురం

Cultivation

కరువు పాటలు పాడిన నేలన కాళేశ్వర నీళ్ళు పారుతున్నయ్, ఉరి కొయ్యలకెక్కిన నేలన జలోత్సవాలు జరుగుతున్నయ్, చెరువులెండిన నేలన వలుగుల్లు పారుతున్నయ్, రైతు వలపోతలు చూసి కాలువలు వరదలైనయ్, కన్నీళ్ళు తుడవబోయినయ్, ఆత్మహత్యలు పోయి ఆత్మగౌరవం నిలబడ్డది, పారుతున్న నీళ్ళను చూసి పానం నిమ్మలబడ్డది. కొండెక్కిన ఎవుసం కోటి ఎకరాల మాగాణమై మురుస్తనన్నది. రైతును గెలిపిస్తనన్నది… అవును నిజమే ఇది ఎక్కడో కాదు తెలంగాణలోనే స్వరాష్ట్రంలో సాగుకు స్వర్ణయుగం ఏర్పడబోతున్నది కల్వకుంట్ల కారణజన్ముడు కన్న కాళేశ్వర కలతో రైతుల బ్రతుకుల్లో నూతన వెలుగులు రానున్నయ్. వ్యవసాయం పండగకానుంది, రైతు రాజు కానున్నాడు. సమైక్య పాలనలో కరువు పాటలు పాడిన రైతన్న నేడు అపర భగీరథుడు కెసిఆర్ పాలనలో సంతోష గీతాలాపన చేయనున్నారు. ఏడ్చిన ఎవుసం సంబరపడ్డది తన ఎదపై గోదారమ్మ పరవళ్లు తొక్కనుందని, కన్నీరు పెట్టిన రైతు మోమున చిరు దరహాసం రానుంది వీటన్నిటికీ మూలం 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం.
60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో నీళ్ళ కోసం తెలంగాణ అనేక ఇబ్బందులు పడింది. పంటకి నీరులేక చేతికచ్చిన పంట ఎండిపోతుంటే రైతు అది చూడలేక ఉరికొయ్యలకు వేలాడిన ఘటనలు కోకొల్లలు. 60 ఏండ్లుగా తెలంగాణని పాలించిన పాలకులు ఈ ప్రాంతానికి తీరని అన్యాయాన్ని చేశారు. తలాపున గోదారి పారుతున్న తడారని పొలాలను చూసి రైతు గోస వర్ణనాతీతం. మన సంపద కొల్లగొట్టబడింది. ఒకరేమో కరెంట్ తీగలపై బట్టలెండేసుకోండి అన్నరు, ఒకరేమో వ్యవసాయం దండగ అన్నరు మరి వీటికి గల కారణాలేంటో వారు చెప్పలేకపోయారు. అడుగడుగునా వివక్ష, తెలంగాణకు వనరులున్నా అవి వినియోగించుకోవటంలో నాడు ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించి పదవులనుభవించిన వారు విఫలమయ్యారు. అందుకే నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వరాష్ట్ర సాధన మన నీళ్ళు, నిధులు గురించి స్వరాష్ట్ర పోరాటాన్ని ఎత్తుకున్నారు. ఒక్కడుగా మొదలై పల్లె పల్లె గడపతట్టాడు.
జలదృశ్యంతో మొదలై 14 ఏండ్ల పాటు సాగిన సుదీర్ఘ ఉద్యమంలో కెసిఆర్ ఎన్నో విషయాలపై అధ్యయనం చేశారు. రైతు ఆత్మహత్యలు చూసి చలించారు. దీనికి మూలం, పరిష్కారం తెలంగాణ ఏర్పాటుతోనే అవుతుందని ప్రజల్లో తెలంగాణవాదాన్ని లైవ్ లో ఉంచారు. తెలంగాణ ఆవశ్యకతను మన నీళ్ళ చరిత్రను వివరించారు. అసెంబ్లీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు నీళ్ళ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారు. ఎన్నో సభలు, సమావేశాలు, పోరాటాలు త్యాగాలతో తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయింది. మన రాష్ట్రంలో మన పాలన వచ్చింది, తెలంగాణ కష్టాలు తెలిసిన నాయకుడు తెలంగాణపై పట్టు ఉన్న నాయకుడు కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు ఇదే తెలంగాణ రైతాంగం చేసుకున్న అదృష్టంగా చెప్పవచ్చు.
ఉద్యమ సమయంలో చివరి దశలో స్వర్గీయ ప్రొ॥ జయశంకర్ సార్, సాగునీటిరంగ నిపుణులు, రిటైర్ట్ ఇంజినీర్ స్వర్గీయ విద్యాసాగర్ రావు సార్ లతో కలిసి తెలంగాణ ఏర్పాటు అనంతరం సాగునీటి రంగంలో తీసుకోవాల్సిన చర్యలు ప్రాజెక్టుల నిర్మాణం, ఎలాగైతె తెలంగాణ ప్రతి ఎకరాకు నీరందుతుంది, తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే ఏం చేయాలి అనేదానికి అనేక చర్చోపచర్చలు, మేధో మథనం చేశారు కెసిఆర్. తెలంగాణ రైతాంగం బ్రతుకుల్ని మార్చాలనే సంకల్పంతో కెసిఆర్ ఆలోచనల నుండి ఉద్భవించినదే “కాళేశ్వరం ప్రాజెక్ట్‌” రేపటి తెలంగాణ భవిష్యత్ ఈ ప్రాజెక్ట్. దీని నిర్మాణం ఆశామాషీగా జరగలేదు.
దేశ చరిత్రలోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇరిగేషన్ వండర్‌గా ఈ ప్రాజెక్ట్ నిలిచింది. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ఇది నిలించింది. ఇది అంకుటిత దీక్షకు దక్కుతున్న ఫలితం. సమైక్య పాలనలో ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపన చేస్తే అది పూర్తవ్వాలంటే దశాబ్దాలు గడవాల్సిందే ఐనా పూర్తైనా దిక్కులేదు. తెలంగాణ ప్రాజెక్టులంటే శిలాఫలకాలుగానే మిగిలిపోయాయి. సోయిలేని ఈ ప్రాంత నేతలు తెలంగాణను ఎడారిగా మార్చారు. ప్రాజెక్ట్‌లు తరిలిపోతుంటే మంగళహారతులు పట్టారు. ప్రాంత ప్రయోజనాలు పట్టక పదవుల్లో ఊరేగారు. కార్యదీక్ష, పనిపట్ల చిత్తశుద్ధి ఉంటే ఎంతటి కార్యమైనా రుజువవుతుందని ముఖ్యమంత్రి అవగానే కెసిఆర్ నిరూపించారు. అతితక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. ప్రజల గుండెల్లో గొప్ప స్థానం సంపాదించారు.
ఈ ప్రాజెక్ట్ 2016 జూన్ నెలలో ప్రారంభించారు. ప్రారంభించగానే చకచక పనులు మొదలెట్టారు. ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉద్యమంలో కెసిఆర్‌తో కలిసి పనిచేసిన, అతని మేనల్లుడు తన్నీరు హరీష్ రావును నియమించారు. కెసిఆర్ మార్గదర్శకంలో ప్రాజెక్ట్ పనులను హరీష్ వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను పాటిస్తూ ప్రాజెక్ట్ వద్దే సమీక్షలు నిర్వహిస్తూ, అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటూ పనులను పరిశీలిస్తూ పనులను వేగవంతం చేశారు. ఒక దశలో కెసిఆర్, హరీష్ రావుల పేర్లు కాళేశ్వర్ రావు లుగా గవర్నర్ నరసింహన్ అభివర్ణించారంటే ఈ ప్రాజెక్ట్ పట్ల వారి నిబద్ధత అకుంటిత దీక్ష అర్ధం చేసుకోవచ్చు. పొరుగు రాష్ట్రాలతో ఎలాంటి తగాదాలు లేకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర పడ్నవీస్‌తో ముందుగానే “జల ఒప్పందం” చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఇది చరిత్రాత్మకం పొరుగు రాష్ట్రాలతో సఖ్యత కలిగి ఉండటం శుభ పరిణామం. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో అనేక కొర్రీలు ప్రతిపక్షాలు నిరంతరం కోర్టులలో కేసులు, భూ నిర్వాసితులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు.

ప్రాజెక్ట్‌కు కావాల్సిన అన్ని అనుమతులు సాధిస్తూ, ప్రతిపక్షాల కుట్రలను ఛేదిస్తూ, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతంగా ముందుకు నడిపిస్తూ నేడు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రాజెక్ట్ చాలా పెద్దది దీని వల్ల జరిగే మేలు పెద్దది యావత్ తెలంగాణ రైతాంగం ఈ ప్రాజెక్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మోటార్లు ఈ ప్రాజెక్ట్‌కు వాడారు. మూడు బ్యారేజ్‌ల నిర్మాణం, మూడు పంపుహౌస్ ల నిర్మాణం, కిలోమీటర్ల కొద్ది సొరంగాలు, కాల్వలు చేపట్టి ఒక ఇరిగేషన్ వండర్‌గా దీన్ని నిలిపారు. 7152 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థతో దేశంలోనే అసాధారణమైన ఎత్తిపోతల ప్రాజెక్టును అతి కొద్ది సమయంలో నిర్మించి తెలంగాణ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు గులాబీ బాస్. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 40 లక్షల ఎకరాల ఆయకట్టుకి కాళేశ్వరం ప్రాజెక్ట్ జీవం పోస్తుంది అంటే దాదాపు తెలంగాణ రైతాంగం అంతా చిరునవ్వులు చిందించనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ లో జరిగిన కాంక్రీట్ పనులు రికార్డ్ సృష్టించాయి. ముఖ్యమంత్రి సంకల్పం, అద్భుత పర్యవేక్షణ, మంత్రిగా హరీష్ కృషి వెరసి దేశంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది.నాడు కరువు పాటలు పాడిన చోట, కన్నీళ్ళతో బ్రతుకులెల్లదీసిన చోట కాళేశ్వర నీళ్ళతో రైతు కన్నీళ్ళు పోయి ఆనందం రాబోతోంది.

నల్లని రేగడి నాగలి కర్రు మురిసి నవ్వనుంది కల్వకుంట్ల “కాళేశ్వర్ రావు” సంకల్పం తెలంగాణ రైతుల కోసం తాను కన్న కల నిజం కానుంది. ఈ క్షణం కోసం యావత్ తెలంగాణ సమాజం ఎన్నో ఏండ్ల పోరాటం చేసింది, పడావు పడ్డ భూములను చూసి రైతు గుండె మోడువారిపోయింది, ఉరి కొయ్యలకు వేలాడిండు రైతు, కానీ ఈ క్షణం కోసం తెలంగాణ ఎన్నో కలలు కన్నది. మబ్బు మొహం చూసిన రైతు పంటలు బాగా పండి డబ్బు మొహం చూడాలని తెలంగాణ కలలు కంది. కల్వకుంట్లవారే కాళేశ్వరుడై ఆ కలను నిజం చేయబోతున్నారు. ఇది నూతన అధ్యాయం మరో చరిత్ర. రైతు రాజ్యం రానుంది, తెలంగాణ కరువు తీరనుంది. రైతు బ్రతుకు మారనుంది.

The Story About Cultivation In Telangana