Home ఖమ్మం ఖరీఫ్ కరిగిపోతోంది… విత్తనం విత్తే సమయం దాటిపోతోంది…

ఖరీఫ్ కరిగిపోతోంది… విత్తనం విత్తే సమయం దాటిపోతోంది…

Seed Passes

 

బోనకల్ : ఆరుద్రలో ఆడ్డెడు చల్లితే పుట్టెడు పండుతాయని రైతు లోకంలో నానుడి ఉంది. అంటే ఆరుద్ర కార్తెలో అడ్డెడు విత్తనాలు ( రెండు మానికలు ) పొలంలో చల్లితే పుట్టెడు ( 8 బస్తాలు ) పండుతాయని గతంలో రైతులు విస్తారంగా పండించే పెసలు, కందులు, మినుముల గురించి ఈ సామెత వాడుకలో ఉండేది. కాగా నేడు ఆ పంటలు దాదాపుగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఖరీఫ్‌లో పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్నారు. కాగా పత్తిని జూన్‌లో సాగు చేస్తే వానలు తగ్గిపోయే సమయానికి పత్తి తీసేందుకు అనుకూలంగా ఉంటుంది.

కాని ఈ యేడు జూన్ అంతా పూర్తిగా ముగిసినప్పటికి ఇంకా వానల జాడలేదు. అంతేకాకుండా శనివారంతో ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతోంది. అయినా వానలు ముఖం చాటేయటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. గత నెల రోజుల నుండి రైతులు తమ పొలాలను చెత్తాచెదారం వేరివేసి, లోతైన దుక్కులు వేసి ఎప్పుడు వాన కురిస్తే అప్పుడు విత్తనాలు విత్తటానికి అంతాసిద్దంగా ఉన్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే ఈ సమయానికి పత్తి మొలకెత్తి అంతరపాట్లు చేయటానికి అనుకూలంగా ఉండేది. ముదురుగా వేసిన చేలు వాతావరణం అనుకూలంగా ఉంటే మంచి పూతకాతతో అధిక దిగుబడులు వస్తాయని రైతుల అనుభపూర్వకంగా చెబుతున్నారు.

వానలు వస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతున్న సమాచారంతో అన్నదాతలు తెల్లమబ్బుల వైపు ప్రతి రోజు ఆశగా చూస్తున్నారు. .జూన్ మొదటి వారంలో వస్తాయనుకొన్న ఋతుపవనాలు జాడలేక పోవటంతో జూన్ నెల చివరి వరకు వాన జాడ లేకుండా పోయింది. గత రెండు రోజులుగా ఋతుపవనాలు వస్తున్నాయని వాతావరణ శాఖ సమాచారంతో రైతులు వర్షం కోసం పొలంబాట పట్టేందుకు సిద్దంగా ఉన్నారు. కాగా రెండు రోజులుగా వాతావరణం చల్లగా ఉన్నప్పటికి చినుకు మాత్రం రాలటంలేదు. ఆరుద్రలో అయినా చినుకు పడుతుందా… అని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. పత్తి విత్తేందుకు ఇప్పటికే నెల రోజులు ఆలశ్యం కావటంతో ఈ యేడు దిగుబడులు ఏవిధంగా ఉంటేయోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా వరుణు కరిణించి విత్తనాలు విత్తేందుకు సరియైన వర్షాలు పడితే తప్పా విత్తనాలు పొలంలో వేసే పరిస్తితి లేదని రైతుల భావిస్తున్నారు.

The Time to sow the Seed Passes