Home హైదరాబాద్ ఓపీలకు బారులు

ఓపీలకు బారులు

The two types of weather are causing people to suffer

మనతెలంగాణ/సిటీబ్యూరో: గతవారం రోజులుగా ఒకే రోజు రెండు రకాల వాతావరణం నగర ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఒకవైపు వర్షం, మరో వైపు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. మధ్యాహ్న వేళల్లో ఎండ తీవ్రత,సాయంత్రానికి వర్షం కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సాధారణమే అయిన ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం వాతావరణంలో మార్పులే అని వైద్యులు అంటున్నారు. ప్రతి ఏటా వైద్యారోగ్యశాఖ అధికారులు సీజనల్ వ్యాధులపై వర్షాకాలం ప్రారంభంలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ తరువాత పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రతి ఏటా జూలై, ఆగస్టు మాసాల్లో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సారి కూడా అదే తరహాలో నగరంలోని ఆసుపత్రుల్లో ఓపీలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
20నుంచి30శాతం అధికం: ఇప్పటికే కురిసిన వర్షాలకు ప్రజలు రోగాలతో మంచాన పడ్డారు. జ్వరం, దగ్గు, జలుబు తదితర వ్యాధులతో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఫీవర్ ఆసుపత్రి, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్,కోఠి జిల్లా ఆసుపత్రులతోపాటు అన్ని ఏరియా ఆసుపత్రుల్లోని ఓపీల్లో ముందు వచ్చే రోగుల సంఖ్య కంటే 20నుంచి 30శాతం అధికంగా వస్తున్నారు. రోగులకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు అవసరమైతే ఇన్ పేషేంట్‌లో అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్నారు.
నిర్లక్షంతోనే: ప్రతి సీజన్‌లోనూ రకరకాల వ్యాధులతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. వర్షాలతో కొత్త నీరు రావడం, కొన్ని చోట్ల నిలువ ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, పారిశుధ్యం తదితర కారణాలతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అలాగే ఆహారం, మంచినీరు, దోమలు, ఈగల వల్ల కూడా అనేక వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆహారం పరిశుభ్రత లోపిస్తే అతిసార, జాండీస్, టైఫాయిడ్, మంచినీరు, పరిశుభ్రత లోపిస్తే అతిసార, కలరా, దోమకాటుతో మలేరియా, డెంగీ, ఈగలతో టైఫాయిడ్, ఇతర అంటువ్యాధులు, అనూహ్యంగా స్వైన్ ఫ్లూ వంటి భయంకర వ్యాధులు రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అప్రమత్తం: ప్రాణాంతక సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో కలుషిత మంచినీటిని తాగితే కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముంది. అందువల్ల ప్రజలు కాచి చల్లార్చిన నీటిని సేవించడం, ఈగలు వాలిన, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకుండా ఉండటం మంచిదని వైద్యులు అంటున్నారు. ఎప్పటికప్పుడు తయ్యారు చేసిన వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు. చెత్త వ్యర్థ పదార్థాలను రోడ్లపై కాకుండా చెత్త కుండీల్లోనే వేయాలి. మల మూత్ర విసర్జన ఎక్కడ పడితే అక్కడ చేయకుండా మూత్రశాలను ఉపయోగించడంతో పాటు పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.
పరిశుభ్రత తప్పనిసరి: సీజన్‌లో తరుచూ వచ్చే వ్యాధి మలేరియా. దీని లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోకపోతే చాలా ప్రమాదం. ఇది ఎనాఫిలిస్ దోమవల్ల వస్తుంది. ఈ దోమలు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఎక్కువగా వ్యాప్తిచెందుతాయి. రోజు విడిచి రోజు జ్వరం రావడం తలనొప్పి, ఒంటి నొప్పులు, వణుకుతో కూడిన జ్వరం, చెమటలు పట్టడం రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మలేరియా క్రీములున్న దోమ ఆరోగ్యవంతుడిని కుట్టిన తరువాత 10నుంచి 14రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతాయి. ప్రాణాంతక వ్యాధుల్లో డెంగీ చాలా డేంజర్. గతేడాది నగరంలో ఈ వ్యాధి బారిన పడి ఎందరో మృత్యువాత పడ్డారు. పారిశుద్దంపై అవగహనలేమి కారణంతోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. అందువల్లే డెంగీ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.