Home కుమ్రం భీం ఆసిఫాబాద్ నీటి గోస

నీటి గోస

The village mothers are giggling for water

తెండుతున్న గిరిజన గ్రామాలు
వాగుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్న ప్రజలు

ప్రతి ఏడాదిలాగే వేసవి కష్టాలు
పల్లెల గొంతెండుతోంది. ఎండలు ముదరడంతో నీటి కటకట మొదలై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మే నెలలో ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో పల్లె ప్రజలు నీటి కోసం నానాకష్టాలు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం సిరకొండ, ఆసి ఫాబాద్ గ్రామాల్లో ప్రజలు పొలాల బాట పడుతున్నారు.

మన తెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్/సిరికొండ: పల్లె తల్లులు గుక్కెడు నీళ్ళకోసం తల్లడిల్లుతున్నారు. భుగర్భ జలాలు అడుగుంటుతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. సిరికొండ మండలం సొన్‌పెల్లి నిజంగూడ గ్రామంలో భుగర్భ జలాలు అడుగంటడంతో ప్రజలు కన్నీరు పెడుతున్నారు. ఈ గ్రామాల్లో వేసవికాలం వచ్చిందంటే నీళ్ళ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. సోన్‌పెల్లిలో చేతిపంపులు, బోర్లు, మోటార్లు సగానికి సగం ఇంకిపోయాయి. ప్రభుత్వం వేసిన బోర్లు, బావులల్లో నీరు లేక పోవడంతో రైతుల వ్యవసాయ బావులకు మోటార్లు బిగించి నీరు సరఫరా చేసుకుంటున్నారు. వేసవిలో అడుగంటిన భూగర్భజలాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతిఏటా నిజంగూడ తదితర గ్రామాల్లో ఇదే తంతు కొనసాగుతుంది. ఉన్న ఒక్క ట్యాంక్ నీరు అందించే రైతులు బోర్లు వేయడంతో ఆధికారులు వేసిన బొర్లు, ఎండిపోతున్నాయి. యాసంగిలో రైతులు పంటలు వేయగా వాటిని రక్షించుకునేందుకు రైతులు పాట్లు పడుతుండగా మరోవైపు గ్రామ ప్రజలు నీటికోసం అల్లాడుతున్నారు. గతేడాది సమ్మర్‌లో 5 బోర్లు కొత్తవి వేసిన చుక్కనీరు. లేక పోవడంతో ప్రజల కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

ఆసిఫాబాద్ నియోజకవర్గంలో : ఏజెన్సీ గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలలో తాగునీరు లేక ఇబ్బందులు పడాల్సివస్తుంది. వివిధ గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు పనిచేయ క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లా కేం ద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సాలెగూడ గ్రామంలో తాగునీటి కోసం గ్రామస్తులు అరిగోస పడుతున్నారు. గ్రామంలో 500 వరకు జనాభా ఉన్న కేవలం 4 చేతిపంపులు మాత్రమే ఉన్నాయి. అందు లో మూడు చేతిపంపులు చెడిపోయాయి. ఉన్న ఒకే ఒక్క చేతి పంపుపై గ్రామస్తులంతా ఆధారపడి తాగునీటి కోసం మహిళలంతా ఉదయాన్నే బిందెలతో వరుస కడుతున్నారు. ఒకేఒక్క చేతిపంపు ఉండడం, వాటర్ ట్యాంక్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేయకపోవడంతో వాటి కష్టాలు అన్నీ ఇన్నీకావు. ఒకేచేతిపంపు వద్ద గ్రామస్తులంతా గుమికూడడంతో కొన్ని సార్లు గొడవులు సైతం జరుగుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. మండల కేంద్రానికి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామంలో తాగునీటి ఎద్దడి విపరీతంగా ఉందని, సమస్యను పరిష్కరించాలని ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్‌కు మొరపెట్టుకుంటే గ్రామానికి ట్యాంక్ ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినా కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది గ్రామస్తులు సమీపంలోని పెద్దవాగులో ఎడ్లబం డ్ల ద్వారా వాటిపైన ట్యాంకులను ఏర్పాటు చేసుకుని నీరు తెచ్చుకుంటున్నారు. తాగునీటి కోసమే తమ ఇతర పనులకు వెళ్లలేకపోతున్నామని, సమయాన్నంతా దీని కోసమే కేటాయిస్తున్నామని వారు వాపోతున్నారు.

గిరిజన గ్రామాల్లో తాగునీటికి తంటాలు
నియోజకవర్గంలోని కొన్ని గిరిజన గ్రామాలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. జల్ ,జంగిల్ ,జమీన్ కోసం పోరాడి అశువులు బాసిన కుమ్రం భీం పురిటిగడ్డ జోడేఘాట్‌లోని పోరు గ్రామాలు కూడా తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. అలాగే మండలంలోని మా రుమూల గ్రామాలైనా మోవాడ్, వాముదం, షాకన్‌గొంది, అలిగూడ, చిలకలగూడ, ఓటెఘడ్, బనాన్‌పూర్, అడదస్నాపూర్ గ్రామాలతో పాటు నియోజకవర్గంలోని జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణి, లింగాపూర్‌లోని గిరిజన గ్రామాలు తాగునీటి కోసం వాగులు, చెలిమిల పైన ఆధారపడాల్సి వస్తుంది.

పూర్తికాని మిషన్‌భగీరథ…
ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు అందిస్తామని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మిషన్‌భగీరథ ఇంకా గడువులోగా పూర్తయ్యే పరిస్థితులు కనపడడం లేదు.
భగీరథ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. జూన్ 2018 నాటికి ఇంటింటికి తాగునీరు అందించాల్సి ఉన్నా కొన్ని గామాలలో వాటర్‌ట్యాంకుల నిర్మాణాలు చేపట్టినప్పటికి ఇతర పనులు నత్తనడకన సాగుతుండడంతో ఈ ఏడాది ప్రజలకు తాగునీరు అందడం కలగానే మిగిలిపోయినట్లయింది.