Home కలం ‘మాటలమడుగు’ కవిత్వపు కలువ

‘మాటలమడుగు’ కవిత్వపు కలువ

Mercy-Magaret

‘అదేంటో / కడుపులోకి/ పదునైన బాధ దిగిన ప్రతిసారి / అక్షరాలు గుండెను చీల్చుకొని బయటికొచ్చి /పసిపిల్లల్లా నవ్వుతాయి / వాటిని దోసిట్లోకి తీసుకొని / నేను ఏడ్చేటప్పుడు / కన్నీళ్ళ లాల పోసుకొని / కాగితపు ఊయల్లో నిద్దురో తాయి’ కవోష్ణ కన్నీళ్ళ లాలపోసుకున్న అక్షరాల తో నిండిన ఈ కవిత వున్న సంపుటి ఆఖరి పేజీ వరకు, నా కళ్ళు ప్రవహించినంత మేర, నాకు ‘మాటల మడుగు’ అలలపైన వికసించి తేలియాడే ఒక కొత్త కలువ. ఈ తరం స్వరపు పరిమళాల్ని వెదజల్లుతూ తన్ను తాను పునర్లిఖించుకోడానికి కొత్త కవిత్వంతో కాగితంపైకి అడుగు పెట్టినట్టు అనిపించింది.
ప్రశ్నల్ని పిడికిలిలో బంధించుకొని, కొత్త పరిమళాల్ని గుండెనిండా నింపుకొని, మరో గొప్ప ఆవిష్కారానికి స్వాగతం పలుకుతూ ఆకులా.. పిట్టలా.. పాటలా.. అందమైనఅడవిలా..’ మాటల మడుగు ‘కవిత్వం దోసిట్లో వాలింది. కళ్ళతో చూడలేనివి కన్నీళ్ళే చూడగలవు’-అని అంటున్న మెర్సీ మార్గరెట్ ‘మాటల మడుగు’ కవిత్వాన్ని కళ్ళతో కాదు కన్నీళ్ళతో చదువాలి.
అనుభవాల సాంద్రత, తాత్విక చింతన, తన నావరించి ఉన్న ప్రపంచంతో సంప్రదింపు ఉన్న కవుల్లో మార్గరెట్ ఒకరు. కవితా హృదయం వున్న కవయిత్రి.కవిత్వపు జిలుగులు తెలిసిన కవయిత్రి కూడా మెర్సీ గారు.కాబట్టే స్త్రీ చైతన్య స్ఫూర్తిని చిత్రించటంలో మెర్సీ తన మెర్క్యురిక్ శిల్ప కాంతిని మాటల మడుగులో ప్రసరింప చేశారు.
కొట్టివేతలతో పనిలేకుండా కొత్త వాక్యాలు రాయడానికీ ఈ దేశ చరిత్ర మరీ అంత స్వచ్ఛమై నది కాదు – అంటాడు తెరేష్ బాబు. ‘కొట్టి వేతల నుంచి కొత్తగా పుట్టుకు రావాలి’ అని అంటుంది మెర్సీ. బంగారాన్ని కాల్చి పుటంపెడితే మరింత మెరుగుతో మెరుపుతో వెలుగుతుంది. కవి కూడా తడిమే ప్రతి చూపులో వినే ప్రతి మాటలో నూత్న వెలుగులో తన్ను తాను కాల్చుకోవాలి. ఆ పని ఈ కవయిత్రి చేసింది. తన్ను తాను చిక్కటి సిరాతో కొట్టేసుకుంది. పాత మాటల్ని వదిలేసి తన పాళీకి కొత్త మాటల్ని నేర్పింది. తన కవిత్వాన్నికొత్త కాంతితో వికసింపచేసింది.
భాషలో ఫలానిదే చెప్పాలని ఎట్లా నియమం లేదో కవిత్వంలోనూ అంతే. మెర్సీ ఏది చెప్పినా కవిత్వాంగానే చెప్పింది. కవితలోని వస్తువు పాతది కాదు. కొత్తదే.
పురుషాహంకారం మీద మాట్లాడనివ్వండి అని అంటున్న మార్గరెట్ ఉద్దేశ్యం ఆమెకు ఎన్ని భాషలు తెలిసినా, వచ్చినా తన భాషలో తనను మాట్లాడనివ్వమని. గర్జన సింహభాష ఎలాగో అలాగే ఆమెకు తన భాష ఒకటి వుంటుందని అతడు తెలుసుకోవాలి. ఆ భాష మీద ఆధిపత్య, అధీనత, అణిచివేతలు వుండరాదని, ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి ఊల్ స్టోన్ క్రాఫ్ట్ స్త్రీ పురుషుల మధ్య ఆశించిన సహేతుకమైన ప్రేమని, వాత్స ల్యాన్ని , స్నేహాన్ని స్థాపన చేసే నది లాంటి భాష ఒకటి కావాలని దానిని కనుగొనడం కోసమే తన అన్వేషణ అని ఈ కవయిత్రి చెబుతుంది. మాటే మంత్రం అంటుంటారు. మాటలు కొందరివి ఔషధ మూలికల్లా పనిచేసి ఆందోళన రోగాల్ని పోగొడతాయి. కొందరి మాటల్ని సుగంధాల సుమబాలల వాసనల్ని ఎంతసేపయినా పీల్చాల ని అనిపించినట్టు ఎంతకాలమైనా వినలానిపి స్తుంది. ఇక్కడ మాట అంటే భాషే. పురుషుల భాష మాయమవ్వని కాలిన గాయం చేస్తుందని, ఆ సలిపే గాయాల కారణంగా ఆమె పోగొట్టుకు న్నది తన ఉనికినే కాదు అరచేతుల గీతల్ని కూడా అని కవయిత్రి అంటుంది. అరచేతుల గీతలు అనడంలో భవిష్యత్తు అనేమో ? మానని గాయాల సాక్షిగా లైంగిక విషయాలలోనే కాదు, జెండర్లో వివక్షవాళ్ళ భాష మీద కూడా వివక్ష.
మెర్సీ కొత్త కవిత్వాన్ని అర్థం చేసుకోవ డంలో ఉండే ఇబ్బందిని ప్రముఖ కవి విమర్శ కులు చిన వీరభద్రుడు గారు ఈ కవిత్వ సంపుటికి రాసిన అభిప్రాయంలో వ్యక్తపరిచారు.
అప్రాణులకు ప్రాణ ప్రతిష్ట, నిరూప భావాల కు రూపకల్పన కవులు తమ ఊహలతో చేస్తుంటారు. అలా చేయడంవల్ల అవి పాఠకున్ని మరింత ఆలోచనల లోతుకు తీసుకెళతాయి.
మాట అనేది రూపం లేనిది. దానికి ప్రాణం లేదు. అయితే ఈ మాటల్ని మెర్సీ ఒక మడుగు అంటే కొలను లేక తటాకం చేసింది.అంతే కాదు మాటలకు మొలకల వేళ్ళు వుండేవి అవి పచ్చగా మొలకెత్తేందుకు సారవంతమైన నేలలు వెతికేవి అని ఒక మూర్త్య భావన నిస్తుంది ఈ కవయిత్రి. అంటే మొలకతో వున్న గింజ అనేక గింజల్ని పండించినట్లు ఒక మాట అనేక మాటల్ని పుట్టించే దని చెప్పడం. ఒకప్పుడు నోటి నిండా వుండే ఆ మాటలు ఇప్పుడు కరువ య్యాయని, మాటలను తోడుకొనే నాలుక చివర నుండి గొంతుక వరకు కొన్ని చేతుల కాపలా మొదలయ్యిందని. ఆ చేతులు ఏవంటే మనిషిలోని మోసం, స్వార్థం వగైరాలే. ఘనీభవించి గడ్డకట్టి మంచు శిలలై, మౌనంగా తపస్సు చేస్తున్న ఆ మాటల్ని ప్రాణమూర్తుల్ని చేయాలని అలా చేయడానికి పహారా చేస్తున్న ఆ చేతుల్ని నరికి మంటచేసి మాటల్ని కరగించడానికి సాయంగా ఎవరైనా రండి అంటోంది ఈ కవయిత్రి.
ఒకప్పుడు ఈ మాటలు శిలల్లా ఇంకో మాట అనే ఉలి స్పర్శతో అందమైన శిల్పాల్లా మారేవి. ఒకప్పడు మాటలు మువ్వల్లా మ్రోగి విలువలతో వుండేవి. ఒకప్పుడు మాటలకు రుచుండేది. మాటలకు వెలుగునిచ్చే నిప్పురవ్వ చైతన్య ముండేది. ఆ మాటల్లో ఒకప్పుడు ఆప్యాయత వుండేది. మనిషిలో స్వార్థం, అసూయ, ద్వేషాలు, మాత్సర్యాలు పెరిగిపోయాకా మనిషితత్వం మంటకలిశాకా కడుపు నింపే ధాన్యపు గింజ ల్లాంటి మాటలు గాలికి తేలిపోయే తాలులా తేలిపోతున్నాయని, మాటలన్ని గవ్వల్లా దొర్లిపో తున్నాయని మట్టి పెళ్ళల్లా విరిగి పోతున్నాయన్న ఒక గొప్ప భావనని అద్భుతమైన పద్యంగా మలిచి రూపంలేని మాటకు ఒక రూపమిచ్చి ప్రాణం లేని మాటకు ప్రాణం పోసి మన ముందు నిలబెట్టింది మెర్సీ. ఆత్మానుభవ వ్యక్తీకరణ చాలా ఖండికల్లో ‘మాటల మడుగు’లో చూడొచ్చు. అయితే ప్రతిది ఆత్మానుభవ వ్యక్తీకరణ కవిదో కవయిత్రిదో అయి వుండాల్సిన నియమేమి లేదు. అందరి ఆత్మాను భవం కూడా కావొచ్చు.
‘కాదంబరి’ కవిత ఇందుకు మేలైన ఉదాహరణ. కలను కథనో కవిత్వమో చేయడం మెర్సీ మహేంద్రజాలమే. నా కల సూరున్ని కడుపున దాచుకున్న గర్భిణి, తన రెక్కలో తూర్పు ను పొదుతున్న పంచరంగుల చిలక అని అనడమే కాదు రోజుకో వారానికో ఓ కవిత మాతోటను పూస్తే మీకు తప్పక పంపుతానని ప్రామిస్ కూడా చేస్తోంది ఈమె. ఊహల్ని పదాలతో నిర్మించడం కొందరు కవులకే చేతనవును. అట్లాంటి కవుల్లో మెర్సీ నిరభ్యంతరంగా చేర్చొచ్చు. మెర్సీ మార్గరెట్‌ను అభినందిద్దాం.