Home కలం మాటలే మంచి కవితలు

మాటలే మంచి కవితలు

Female-siting-image

జానపదులు చాలావరకు నిరక్షరాస్యులు. సాహిత్య ప్రక్రియలు వాళ్లకు తెలియవు. కావ్య పఠనం గాని, శ్రవణం గాని వారేమీఎరుగరు. వారికి ఛందస్సు, అలంకారాలు ఏమాత్రం తెలియవు. కవిత్వమంటే ఇది అని కూడా తెలియదు. అయినా వాళ్లు నిత్యజీవితంలో అడుగడుగునా కవితామయంగా మాట్లాడుకోవడం మనం చూస్తుంటాం. వినేవాళ్లు పులకించి పోయేట్టు, విరగబడినవ్వేటట్టు, ఎప్పుడు మరిచిపోలేనంత చమత్కారంగా వాక్చాతుర్యం చూపడం అనేక సందర్భాల్లో మనము గమనిస్తూ ఉంటాం.

అక్కడ గోడ నిర్మాణం జరుగుతోంది. కూలీలు రాళ్లు తెస్తున్నారు. సుతారి గోడ పెడుతున్నాడు. తొందర తొందరగా పని కావాలన్నది సుతారి ఆలోచన. ఎందుకంటే సుతారి ఆ పనిని గుత్తకు తీసుకొని కూలీల పెట్టి పనిచేయించుకుంటున్నడు. పని ఎంత తొందరగా అయితే సుతారికంత లాభం. అందుకే ఆయన కూలీలతో….
“జల్ది జల్ది రాళ్లు తేండ్రమ్మా ఏమో ముచ్చట్లు పెట్టుకుంట నడవపడితిరి?” అన్నాడు పరాచికంగా నవ్వుతూ. ఆ మాట వినగానే రాళ్లు తెస్తున్న ఒక గడుసు పిల్ల.
“ఏంది తాత ఏమో తొందర చెయ్యపడితివి. ఇంతింత రాళ్లు లావట్టి ఎత్తుకోవాలె. అక్కడి నుంచి మోసుకరావాలె. వట్టిగానే అయితదనుకున్నావా? నీదేంది అందిత్తె పొందిత్తవు కూసొని” అన్నది దబాయిస్తూ.
దగ్గరున్నోళ్లందరూ పగలబడిన నవ్విండ్రు. ఆ పిల్ల మాటలకు సుతారి తాతతో సహా,
రమ, ఉమ అక్కా చెల్లెండ్ల పిల్లలు. ఇద్దరిదీ ఇంచుమించు ఒకే వయసు. ఇద్దరూ హైస్కూల్ చదువుతున్నారు. ఉమ రమ్మంటే ఒకసారి సెలవుల్లో రమ ఉమ వాళ్ల ఇంటికి వచ్చింది. ఇద్దరూ సరదాగా పొద్దంతా మాట్లాడుకున్నరు. బడి విషయాలు పాఠాల విషయాలు పంతుల్ల విషయాలు ఇంకా ఎన్నెన్నో చెప్పుకున్నారు. సాయంత్రమైంది. చీకటి పడింది. సమయం 7 దాటింది. చుట్టుపకల ఇండ్లల్ల సద్దుమణిగింది.
ఉమ వాళ్ళ అమ్మ ఇద్దరికి అన్నము వడ్డించి పిలిచింది. రమ ఆశ్చర్య పోయింది. “అయ్యో ఏడుగంటలకేనానె అన్నము తినుడు” అన్నది ఆశ్చర్యంగా.
“ఇక్కడ అంతేనే. మా చుట్టూ పక్కలోల్లు ఎప్పుడో తిన్నరే” అన్నది ఉమ.
“మా దగ్గర మేము తినే వరకు 9దాటుతదే” అన్నది రమ.
“మా దగ్గర గూట్లో ఎక్క (దీపం)
నోట్లె బుక్క’ అని ఉమ చమత్కరించింది.
ఆ మాటలకు రమ, రమతో ఉమ పడిపడి నవ్విండ్రు.
తరువాత ఇద్దరు భోజనం చేసిండ్రు. రమ వచ్చి కూచున్నది. ఉమ ఏదో సదురుతున్నది. అటు చూసే సరికి చిన్నాన్న బల్లపై నిదురుపోవడం కనిపించింది రమకు. ఉమ రాగానె
“చిన్నాన్న అప్పుడె నిదురపోతున్నట్టున్నదే” అన్నది రమ.
“అంతేనే వెన్నంటు కోంగనే మాకు కన్నంటు కుంటదే ఇక్కడ” అన్నది నవ్వుకుంట.
మళ్లీ ఇద్దరు పగుల బడి నవ్వుకున్నరు.
ఒకావిడ కూరగాయల గంప తలపై పెట్టుకొని అమ్మడానికి బయలుదేరింది. దారిలో తెలిసినామె ఎదురుపడి.
“టమాటాలు ఎట్ల ధర వదినె” అన్నది.
“నువ్వే మొదాలు మందలించినవు
ఇగ ఎట్ల అమ్ముడుపోతాయో చూడాలె వదినె” అన్నది గంప దించుతు నవ్వుకుంట.
“అడిగిన ధరకియ్యి వదినె
కడిగినట్టు పోకుంటె చూడు’ అన్నది ఆమె నవ్వుతూ కూరగాయలమ్మే ఆమె కూడా నవ్వక తప్పలేదు. అట్లా ఉంటుంది వాళ్ళ మాటల తీరు.
కవిత్వంలో ఒక విషయాన్ని ప్రతీకాత్మకంగా చెప్పడం గొప్ప విషయం. అది కవి ప్రతిభకు నిదర్శనం.
జానపదుల మాటల్లో ఈ ప్రతిభ అనేక సందర్భాల్లో వెల్లివిరుస్తుంది. అసలు విషయం తెలియపరచకుండానే తమ మనస్సులోని భావం వెలిబుచ్చడం వాళ్ల సాహితీ ప్రియత్వాన్ని కనబరుచుతుంది. అలాంటి సన్నివేశాలు ఇప్పుడు మనం చూద్దాం.
దారిలో ఇద్దరు ఎదురయ్యారు. ఇద్దరూ పేదలే. అందులో ఒక వ్యక్తి తన కొడుకును అష్టకష్టాలు పడి చదివించాడు. ఆ బాబు చాలా కాలం నుండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అబ్బాయికి ఈ మధ్యనే గ్రూప్స్‌లో జాబు వచ్చింది. ఆ సందర్భంగా కలిసినాయన అబ్బాయి తండ్రితో ఏమంటున్నాడంటే
“బాబు ఇంకేంది గడ్డకుపడ్డవుగదనే” ఈ చిన్న మాట అబ్బాయి కుటుంబ ఆర్థిక పరిస్థితినంతా ఎంత బాగా వివరిస్తుందో మనకు తెలిసిపోతుంది.
అలాగే నిరాదరణకు గురైన ఒక పేద స్త్రీ “నల్లంగ ఉన్నోళ్లను ఎవరు కానుతరు బాంచెను” అంటూ ఒక్క వాక్యంలో తన గోడునంతా తెలియజేస్తుంది. నల్లంగా అంటే పేదరికం, దరిద్రం అని అర్థం వినే వాళ్ళకు ఆమె పరిస్థితి ఇట్లే తెలిసిపోతుంది.
పల్లెల్లో జీవించే వాళ్లంతా కష్ట జీవులే. నూటికి తొంబైమంది నిరుపేదలే. వాళ్లకు జీవితం కత్తిమీద సాము. రెక్కాడితెగాని డొక్కాడదు. బాధ్యతాయుతంగా నిరాడంబరంగా పొదుపుగా జీవించడమే వాళ్ళకు తెలుసు. గొప్పలకు పోయినా, సోమరిగా వ్యవహరించినా వాళ్ళు బ్రతుకలేరు. అందుకే వాళ్లు పెద్ద పోకిల్లకు పోయేవాళ్లను, డంబాలు పలికేవాళ్లను, పనిచేయని వాళ్లను అడుగడునా ఎండకడతారు. అలాంటి మగవాళ్లను ఆడవాళ్లు ఎంత అసహ్యించుకుంటారో ఈ క్రింది మాటల్లో చూడండి.
“తిండంటే బండి కడుతడు”
“మాటలతోనె కోటలు కడుతడు”
“అంటె ఆగడు, పంటె లేవడు”
అదే విధంగా తాగుడు, తినుడు, అప్పులు చేయడం కూడా వాళ్లు సహించరు. అలాంటి వాళ్లను చూసి
“పుడితె పుట్లు దూస్తడు”
“ఇచ్చేటోడుంటే సచ్చేదాక తింటడు”
“పీక్క తినుడు లోపుక తాగుడు”
అంటూ అవహేళన చేస్తరు,
మగవాళ్లనే కాదు, ఆడవాళ్లను కూడా ఇక్కడి సమాజం సహించదు. బాధ్యత తెలియని సోమరులు దుబారా పరులైన స్త్రీలపై ఎలాంటి మాటల ఈటెలు ఎక్కుపెడుతారో చూడండి.
“గుమ్మికి ఎసరు పెడుతరు”
“కబళమంటె నోరు తెరుత్తది
కళ్ళెమంటె నోరు మూత్తది”
“తెత్తె తింటది సత్తె ముండమోత్తది”
ఈ పదునైన మాటలు తాకితే ఎంతటి వాళ్లైనా మారవలసిందే. వాళ్ల తీరు మార్చుకొని చక్కబడవలసిందే.
జీవితమంటే పోరాటం అడుగడుగునా ఆరాటపడవలసిందే. అప్పుడే జీవితానికో అందం ఉన్న దానితో తృప్తి పడితె ప్రగతి ఆగిపోతుంది.
ప్రగతి లేని జీవితాన్ని వాళ్లు కోరుకోరు . ఏదో ఇంత పని చేసిన ఉన్నదానితో బ్రతకడం వాళ్లకు నచ్చదు. అలా ఉండే వాళ్లను
“ ఉడుకేసుకొని తిని తడుకేసుకొని పన్నట్టు”
అని ఏవగించుకుంటరు.
దేశభక్తి కవితలో మహాకవి గురజాడ
“తిండి కలిగితె కండగలదోయి
కండగలవాడేను మనిషోయ్‌” అన్నాడు. అదే భావాన్ని పల్లీ యులు ‘తిండి’ ప్రాధాన్యతను ఎంత బలంగా చెప్పారో ఈ మాటలు చూడండి.
“కుడిశినమ్మకు పొడిచినా చావులేదు”
“దవడాడితే దయ్యమదే వదలుతది”
తెలంగాణా ప్రజలకు విలువలు చాలా ప్రధానం. నియత్ (నిజాయితీ)ను వాళ్లు అయిదో ప్రాణంగా భావిస్తారు. ఈ క్రింద మాటల్లో ఆ భావం ఎంత అందంగా చెప్పబడిందో చూడండి.
“మూటపోతె దొరుకుతది గాని
మాట పోతె దొరుకుతదా?”
“అన్న ం పెట్టినోనికి సున్నంపెడుతరా”
“కువార మెంతో కుట్టాదంత”
“బుద్ధుల బట్టి బువ్వుంటది” ఇద్దరు కలుసుకున్నప్పుడో పనిదగ్గర పదిమంది కూడినప్పుడో లేదా పనిలేక ఎక్కడైనా పదిమంది జమ అయినపుడో. శుభకార్యానికి ఒక చోట చేరినపుడో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినే వాళ్ళ మనస్సు పులకిస్తుంది. మంచి కవిత్వం చదివినంత ఆనందం కలుగుతుంది.

                                                                                                                            జి.కాళిదాసు 8686706463