Home ఎడిటోరియల్ నాడు లింగ్డో, నేడు విజయ్!

నాడు లింగ్డో, నేడు విజయ్!

fijaiతమిళనాడులో విజయ్ గొప్ప హీరో. రజనీకాంత్ తర్వాతి స్థానం అతనిదే. అభిమానులు ఇలయ తళపతి (యువ దళపతి) అని పిలుస్తారు. 60 చిత్రాల్లో విజయవంతగా నటించిన విజయ్ ను తమిళ ప్రజలు ఏ కులం వాడు, ఏ మతం వాడు అని ఎప్పుడూ వేరు చేసి చూడలేదు. ఇప్పుడు ‘మెర్సెల్‘ అనే 61వ చిత్రం అతనికి పెద్ద పరీక్షగా మారింది. కొందరికి అతను సడెన్‌గా మరోలా కనిపిస్తున్నాడు. ఎవరూ పూర్తి పేరుతో పిలవని విజయ్‌ను వాళ్లు ‘జోసెఫ్ విజయ్‘ అని అతని మతాన్ని గుర్తు చేస్తున్నారు. మెర్సల్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) ను విమర్శించే డైలాగులను హీరో విజయ్ పలకడమే అతని క్రైస్తవ మూలాలు కొందరికి సడన్‌గా గుర్తుకు రావడానికి కారణం. జోసెఫ్ విజయ్ అని పిలవడంలో ఒక బెదిరింపు, నువ్వు వేరే మతం వాడివి అనే చులకన చేయడం కనిపిస్తోంది. సినిమా మాధ్యమం ప్రజల ఎమోషన్స్, వాళ్లు పడుతున్న ఇబ్బందులు, సమాజంలో వేళ్లూనుకున్న అవినీతి, అధికార మదంతో ప్రభుత్వంలో ఉన్న వారు వ్యవహరించే పద్ధతులనే కొంచెం భిన్నంగా, సూటిగా చూపిస్తుంది. ఇది ఇవ్వాళ కొత్తేమీ కాదు. దాన్ని సినిమా గానే ఆస్వాదించి చప్పట్లు కొడతారు ప్రేక్షకులు. అంత మాత్రాన అందులో చూపించినట్టు తుపాకులు పట్టుకుని వీధుల్లో తిరగడం, అవినీతికి పాల్పడే వారిని ఉరి తీయడం చేయరు. సినిమా విస్తృతి అంతే. మరో సినిమా ఇంకో స్టోరీతో వస్తుంది. బాగుంటే దాన్నీ ఆదరిస్తారు. ఇలా చక్రం తిరుగుతూనే ఉంటుంది. తమిళులు మంచి సినీ ప్రియులు. నటన బాగుంటే చాలు వారిని అందలం ఎక్కిస్తారు.
శ్రీలంకలోని క్యాండీ మళయాళీ కుటుంబంలో జన్మించిన ఎంజీ రామచంద్రన్ సినీ హీరోగా తమిళుల ఆరాధ్య దైవమయ్యాడు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంజీఆర్‌కు గుళ్లు కట్టి దేవుడిగా పూజిస్తున్నారు. ఎక్కడో మైసూరు నుంచి వచ్చిన జయలలిత(కోమలవల్లి)ను గుండెల్లో పెట్టుకుని ఆరు సార్లు ముఖ్యమంత్రిని చేశారు. మహారాష్ట్రలో పుట్టి బెంగుళూరులో పెరిగిన రజనీకాంత్‌ను సూపర్ స్టార్ గా ఆరాధిస్తున్నారు. కానీ జయలలిత లేని తమిళనాడు ఇప్పుడు మరోలా మారింది. తమిళనాడే కాదు. అవినీతిని ప్రశ్నించినందుకు, తన రాతల్లో ధిక్కారం ప్రదర్శించినందుకు బెంగళూరులో గౌరీ లంకేశ్ అనే జర్నలిస్టు పట్ట పగలే హత్యకు గురయ్యారు. ప్రపంచ వింతల్లో ఒకటైన ప్రేమ చిహ్నం తాజ్ మహల్ అకస్మాత్తుగా ముస్లిం రాజు నిర్మించిన కట్టడమై పోయింది. మొఘల్ వంశపు ఐదో చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ణాపకంగా తాజ్ ను నిర్మించాడని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ సోషల్ మీడియాలో అసహనాన్ని రాజేస్తున్న వారు పెట్టిన పోస్టులు చూసి విస్తు పోవాల్సి వస్తోంది. షాజహాన్ కున్న ఏడుగురు భార్యల్లో ముంతాజ్ నాలుగో భార్య అని. అతనికి వీరందరి ద్వారా 16 మంది సంతానమని ప్రచారం చేస్తున్నారు. భర్తకు భార్య పట్ల హద్దులు లేని ప్రేమ ఉండటం, ఆమె జ్ణాపకంగా ఒక అత్యద్భుత నిర్మాణం చేపట్టడంలో తప్పేముందో ఈ అసహన శక్తులకు ఎప్పటికీ అర్థం కాదు. అప్పట్లో బహు భార్యత్యం హిందూ చక్రవర్తుల్లో కూడా ఉండేది. పొరుగు రాజ్యాలతో శాంతి నెలకొల్పుకోవడానికి వారి కుటుంబం నుంచి ఒక యువతిని వివాహమాడటం ఒక సంప్రదాయంగా ఉండేది.
దేశంలో ‘అసహనం‘ పెరుగుదల పతాక స్థాయికి చేరుకుంటోంది. భావవ్యక్తీకరణకు ఎంతో స్వేచ్ఛ నిచ్చిన దేశంలో ఒక నియంతృత్వపు కట్టడి ఎవరినీ వదలకుండా అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది. ఎవరినీ ఏమీ అనొద్దు. ముఖ్యంగా పాలకులను వారు తీసుకునే నిర్ణయాలను తప్పు పట్టొద్దు. కనీసం విమర్శించొద్దు. దాని గురించి చర్చించే సాహసం కూడా చేయొద్దు. అది మీడియా కావచ్చు. సినిమా కావచ్చు. అంతా బాగుందనాలి. ఈ అసహనపు దాడులు ఇవ్వాళ కొత్తగా మొదలైనవేమీ కావు. 2002 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జె.ఎం.లింగ్డోపై చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తున్నాయి. గుజరాత్‌లో బిజెపి గెలవకుండా చేసేందుకు అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత కూడా లింగ్డో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారని మోడీ విరుచుకు పడ్డారు. ఆయన ఇటలీ నుంచి వచ్చారని, రాజీవ్ గాంధీ(బతికి ఉన్నప్పుడు) తో కలిసి ఇద్దరూ చర్చిలో కలుసుకునే వారని కొందరు విలేకరులు తనతో అన్నట్టు మోదీ ఒక బహిరంగ సభలో దుమ్మెత్తి పోశారు. మోదీ ఎప్పుడూ లింగ్డో పేరును జేమ్స్ మైఖేల్ లింగ్డో అనే పలికే వారు. ఆయన మతాన్ని గుర్తుకు తెచ్చేలా.
మేఘాలయలో ఖాసీ గిరిజన తెగకు చెందిన లింగ్డో జన్మతా క్రైస్తవుడు. ఆయన మధ్యలో మతం మారిన వ్యక్తి కూడా కాదు. అసలు మేఘాలయలో 83 శాతం క్రైస్తవులే. హిందువుల జనాభా కేవలం 12 శాతం. ఖాసీ గిరిజన తెగలో 85 శాతం క్రిస్టియన్లు. జిల్లా జడ్జి కుమారుడైన లింగ్డో అతి చిన్నవయసులో 22 ఏళ్లకే ఐఎఎస్ కు ఎంపికయ్యారు. ఐఎఎస్ అధికారిగా నిజాయితీగా, ముక్కు సూటిగా వ్యవహరించినందుకు అనేక సార్లు బదిలీ అయ్యారు. పబ్లిక్ సర్వెంట్ గా ఆయన అత్యున్నత విలువలతో పని చేసినందుకు 2003 లో ఏషియా నోబెల్ ప్రైజ్ గా పిలిచే రామన్ మెగ్సెసే అవార్డు దక్కింది.
ఇంతకూ అప్పట్లో గుజరాత్ గొడవ ఏమిటంటే 2002 ఫిబ్రవరిలో అయోధ్య నుంచి వస్తున్న కరసేవకుల రైలుకు ముస్లిం మతోన్మాదులు గోద్రాలో నిప్పు పెట్టారు. ఆ దుర్ఘటనలో 58 మంది హిందువులు మరణించారు. ఆతర్వాత గుజరాత్ లో మత కలహాలు చెలరేగి రెండు మతాల మధ్య తీరని అఖాతం ఏర్పడింది. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. అదే సమయంలో సాధారణ ఎన్నికలకు 9 నెలల ముందే జులైలో ముఖ్యమంత్రి నరేంద్రమోడీ శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో మత ఘర్షణలు జరుగుతున్నందున వెంటనే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దానితో మోదీ నేరుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లింగ్డోపై కాలుదువ్వారు.
సుప్రీం కోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని సమర్థించింది. చివరకు డిసెంబరులో ఎన్నికలు జరగగా మళ్లీ బిజెపి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇవ్వాళ తమిళనాడు బిజెపి నేతలు విజయ్‌ను జోసెఫ్ విజయ్ అని పిలవటానికి అప్పట్లో మోడీ జెఎం లింగ్డోను జేమ్స్ మైఖేల్ లింగ్డో అని అనడానికి దగ్గరి పోలికలు లేవూ…ఈ అసహన భావనలు ఇప్పటికిప్పుడు పుట్టినవేమీ కావు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న విశృంఖల మత పిచ్చికి కొనసాగింపే. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇతర మతాల వారిని ‘మీరు వేరే‘ అని చెప్పడం, జాతి ప్రధానస్రవంతిలో ఎప్పటికీ భాగం కారని వివక్ష చూపడబం మన కంటిని మనం పొడుచుకోవడమే. లేని వైరుధ్యాలను మనకు మనం సృష్టించుకోవడమే అవుతుంది.
* బి.టి.గోవిందరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్