Home తాజా వార్తలు పాలమూరుకే వలసలు

పాలమూరుకే వలసలు

kcr1

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 20 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు అవిరళ కృషి 

రాష్ట్రంలో భూస్వాములు లేరు
రైతుబంధు వల్ల పేద రైతులకే మేలు

కర్నూలు, కర్నాటక నుంచి ఇక్కడికే వలస కూలీలు రావాలి
ఇక్కడ నుంచి ఎవరూ ఎక్కడికీ వెళ్ల వద్దు
భవిష్యత్తులో గ్రామాల్లో కూడా గోదాములు
వ్యవసాయాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా చేస్తాం
ప్రసవానికి కిట్లు, వివాహానికి రూ.1,00,116 వంటి పథకాలతో సంక్షేమరంగ చరిత్రలో నూతనాధ్యాయం సృష్టించాం
ఉస్మానియా, గాంధీల్లో నుంచి మృతదేహాలను ఇంటికి చేర్చే వాహనాలు ఏర్పాటు చేశాం
కొత్తగా 119 బిసి పాఠశాలలు మంజూరు చేస్తున్నాం
గద్వాల జిల్లా గట్టు ఎత్తపోతల శంకుస్థాపన సభలో సిఎం

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ : ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధించానో.. వచ్చి న తెలంగాణ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉం డేందుకు 1.20 కోట్ల  ఎకరాలకు సాగునీరు అందించే కృషిని యజ్ఞంలా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. పాలమూరు జిల్లాలో 20 లక్ష ల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేంత వరకు కృషి చేస్తామన్నారు. కర్నూల్, కర్ణాటక నుంచి పాలమూరుకు వలసలు రావాలి తప్పా, ఇక్కడి నుంచి వలసలు వెళ్లవద్దని రైతులకు సూచించారు. సిఎం కెసిఆర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. తొలుత రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రా మంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం చీఫ్ ఇంజినీర్లతో రిజర్వాయర్ పనుల తీరును సమీక్షించారు. రిజర్వాయర్ ఎత్తును, మంచినీటి నిల్వ సామర్థాన్ని పెంచాలని సూచించారు. వరద జలాలు ఉన్న సమయంలోనే ఎక్కువ నీటిని తోడేసుకునేలా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్‌ను మార్పు చేసి నిర్మించాలని సిఎం సూచించారు. అనంతరం పెంచికలపాడు వద్ద   నూతనంగా నిర్మాణం కానున్న గట్టు ఎత్తిపోతల పథకానికి పైలాన్ ను ఆవిష్కరించి భూమి పూజ చేశారు. ఆ తరువాత గద్వాలలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగించారు.  అనేక మంది యువకులు, విద్యార్థులు ప్రాణాలకు తెగించి చివరికి తాను కూడా ప్రాణం పోయేంత వరకు పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సిఎం అన్నారు. సాధించుకున్న తెలంగాణలో రైతులు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు సుభిక్షంగా ఉన్నప్పుడే బం గారు తెలంగాణ సాధించినట్లని చెప్పారు. గతంలో ఆర్‌డిఎస్‌ను సీమ ఫ్యాక్షనిస్టులు బాంబులు పెట్టి బద్దలు కొడతామంటే తాను ఆర్‌డిఎస్‌పై కుర్చీ వేసుకుని ఇక్కడ ఆర్‌డిఎస్‌ను కాపాడతానని పాద యాత్ర సందర్భంగా మాట ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ మాట ప్రకారమే మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, డాక్టర్ లకా్ష్మరెడ్డిలను ప్రత్యేకంగా పంపించి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామన్నారు. మంత్రులు రాత్రి పగలు ప్రాజెక్ట వద్దనే బస చేసి పనులను పూర్తి చేస్తున్నారని గుర్తు చేశారు. పాత పాలమూరు జిల్లా కవులు, కళాకారులు, మేధావులు వంటి ఎంతో మంది శాస్త్రవేత్తలకు ప్రసిద్ధి చెందిందన్నారు. గతంలో జరిగిన అభివృద్ధిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మేధావులు కళ్లారా చూస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు సమస్యను అధిగమించామని, ఈ జన్మలో కరెంటు పోనీయకుండా కాపాడుతామని తెలిపారు. గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక తెలంగాణకు అడ్డుతగలడమే కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారమవుతుందని చెప్పారని, కానీ ఇప్పుడు ఆయన రాష్ట్రంలో అంధకారంగా ఉందన్నారు. దేశంలో రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందన్నారు. వ్యవసాయమంటే అంత తేలిక కాదని ఎంతో కష్టపడితే తప్పా పంటలు పండించలేమన్నారు. తాను కూడా రైతేనని, రైతులు పడుతున్న కష్టాలు తనకు తెలుసని చెప్పారు. రైతు దోపిడి నుంచి బయటపడాలన్న లక్షంతోనే పంటలకు ఏడాదికి రూ.8 వేల రైతుబంధును అందిస్తున్నామని, కొంత మంది దద్దమ్మలు భూ స్వాములకు పెట్టుబడి ఇస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారని సీఎం కెసిఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో భూస్వాములు లేరని, సీలింగ్ చట్టం కింద 50 ఎకరాల కన్న ఎక్కువ భూములు ఉన్న వారు లేరని తెలిపారు. రైతు పేరుమీదనే పెట్టుబడి కల్పిస్తామన్నారు. కొందరు కౌలు రైతులకు కూడా రైతుబంధు సాయం ఇవ్వాలని డిమాండ్ చేయడంపై కెసిఆర్ ఘాటుగా స్పందించారు. బంజారా హిల్స్‌లో ఇళ్లు కట్టుకున్న వారు అద్దెకు ఇతరులకు ఇస్తే వారి పేరుమీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేయిస్తారా అంటూ నిలదీశారు. పాస్ బుక్కులో రైతు పేరు తప్పా ఇతరులకు ఎవ్వరిది ఉండదని, వారి సంక్షేమానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా రైతుబంధు పథకం ఆగదని తెలిపారు. ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో రైతు 3 నుంచి 4 లక్షల రూపాయలు అప్పుల్లో ఉన్నారని, పెట్టుబడి పథకం కింద బాగా పంటలు పండించి అదే రైతు జేబులో మూడు నాలుగు లక్షల రూపాయలు నగదు ఉండేలా చేయడమే బంగారు తెలంగాణ లక్షమన్నారు. రైతు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పా అని సిఎం ప్రతిపక్షాలను నిలదీశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఏ శిక్ష వేస్తారో మీరే తేల్చాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. కొంత మంది కాంగ్రెస్ సన్నాసులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సిఎం విమర్శించారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసులు వేసి స్టేలు తెస్తున్నారు. అంతేకాకుండా కెమెరాలో తీసి కోర్టులో చూపిస్తున్నారని ఇలాంటి దరిద్రులు పాలమూరు జిల్లాలో ఉండడం వల్లే పాలమూరుకు దరిద్రం పట్టుకుందని విమర్శించారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారని ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉంచుకునేందుకు గోదాములు నిర్మించామని చెప్పారు. భవిష్యత్‌లో గ్రామాల్లో కూడా గోదాములు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఏ జిల్లాలో ఏ పొలాల్లో ఏ పంట వేయాలో చెప్పి ఆ పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తామన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధిలో దేశంలో తెలంగాణ ఆదర్శవంతంగా ఉండేలా చూస్తామన్నారు. మహిళ ప్రసవానికి రూ. 15 వేల కిట్టు ఇస్తున్నామని, ఆడ పిల్లల వివాహాలకు రూ.లక్ష 116 అందిస్తున్నామని , ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో మృతి చెందిన వారిని వారి ఇంటికి చేర్చేందుకు వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 584 మండలాలు ఉండగా అన్ని మండలాల్లో బిసి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, కొత్తగా మరో 119 బిసి పాఠశాలలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిని వచ్చే విద్యా విద్యా సంవత్సరంలోగా ప్రారంభిస్తామన్నారు. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని త్వరలోనే ఈ పనులన్ని పూర్తి కానున్నట్లు తెలిపారు. తెలంగాణను హరితహారంతో పచ్చదనం వెల్లివిరిసేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఆర్‌డిఎస్‌లో 87,800 ఎకరాలకు దసరా నాటికి తుమ్మిళ్ల నుంచి సాగునీరు అందిస్తామని తెలిపారు. గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా పెంచికలపాడు వద్ద నిర్మిస్తున్న0.7 ఉన్న టిఎంసిల నిలువ సామర్థాన్ని 4టిఎంసిల సామర్థానికి పెం చేలా డిజైన్ రూపొందించాలన్నారు. జూరాల ప్రాజెక్టుపై ఇప్పటికే వత్తిడి ఉన్నదని, అందులో నుంచి నెట్టెంపాడు, భీమా,కోయిల్‌సాగర్, రామన్‌పాడు, మిషన్ భగీరథ వం ట లిఫ్టులకు 70 టిఎంసిల నీరు తీసుకుంటున్నామన్నా రు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి వంద టిఎంసీల నీరు తీసుకుంటే జూరాల డెడ్ స్టోరేజీకి పడిపోతున్నందుకే పాలమూరు రంగారెడ్డి పథకాన్ని కొల్లాపూర్ దగ్గకు మార్చినట్లు చెప్పారు. కృష్ణ,తుంగభద్ర నీటికి ఎత్తిపోకుంటున పాలమూరు సస్యశ్యామలంచేసుకోవచ్చన్నారు.
టిడిపితో కాంగ్రెస్ పొత్తు.. మంత్రి హరీష్‌రావు
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న టిడిపితో కాంగ్రెస్ రహస్యంగా పొత్తు పెట్టుకుందని రాష్ట్ర భారీనీటి పారుద ల శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించేందుకు కాలువల చుట్టూ తిరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు పైరవీల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు తెలంగాణలోని ప్రాజెక్టులకు అడ్డుకోవాలంటూ కేంద్రానికి లేఖ లు రాస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న టిడిపితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనుందన్నారు.గత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలమూ రు జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పి మోసం చేయ గా వైఎస్‌ఆర్ ప్రభుత్వం సర్వేల పేరుతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు చెప్పి తెలంగాణకు మోసం చేసిందన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తెలంగాణను మోసం చేశారని విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగా అందులో మహబూబ్‌నగర్‌జిల్లాలోనే 6.50లక్షల ఎకరాలకు నీరు అందించినట్లు తెలిపారు. పాలమూరు జిల్లాలోని 21లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి లక్షమని ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భువనగిరి, యాదాద్రి,సూర్యపేట జిల్లాలను గోదావరి నీటితో సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. డిండి ప్రాజెక్టుతో మునుగోడు, దేవరకొండ సస్యశ్యామలం చేస్తామన్నారు. సర్వేల పేరుమీద జీఒలు తెచ్చి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. గట్టు మండలంపై కూడా సర్వే పేరుతో జీఓ పేపర్ చూపించి కాంగ్రెస్ నాయకురాలు డి.కె. అరుణ జిల్లా ప్రజలను మోసం చేసిందని మంత్రి ఆరోపించారు. గట్టు ఎత్తిపోతల పథకం కాగితాన్ని చూపించాలని లేనట్లయితే జిల్లా ప్రజలకు డికె. అరుణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభకు గద్వాల టిఆర్‌ఎస్ ఇంచార్జీ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధ్యక్షత వహించగా, ఎంపి డాక్టర్ కే.కేశవరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, గువ్వల బాల్‌రాజు, రాజేందర్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాములు, కిష్టారెడ్డి, అబ్రహం, అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.