Saturday, April 20, 2024

మెరుగుపడుతోంది

- Advertisement -
- Advertisement -

etela rajender

 

హైదరాబాద్‌లో రెడ్‌జోన్లు లేవు సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు నమ్మొద్దు

కరోనా రోగుల్లో పదిమంది కోలుకుంటున్నారు, రేపోమాపో డిశ్ఛార్జి

ఇతర ప్రాంతాల నుంచే వైరస్ వస్తోంది
15 రోజుల్లో అందుబాటులోకి గచ్చిబౌలిలోని కరోనా కేంద్రం
వైద్యసిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు
కరోనా నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు
పొరుగు రాష్ట్రాల వాళ్లకు ఇబ్బంది కలగనివ్వం
మీడియా సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల

ఇటీవలే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఖైరతాబాద్ వ్యక్తి, చికిత్స పొందుతూ సమీప ఆసుపత్రిలో మృతి

65కు పాజిటివ్‌ల సంఖ్య, కొత్తగా ఆరు కేసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కేవలం ఇతర ప్రాంతాల నుంచి మాత్రమే రాష్ట్రానికి వస్తుందని, కేసులు వేగంగా పెరుగుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో శనివారం వరకు కరోనా బాధితుల సంఖ్య 65కి చేరగా, ఒక వ్యక్తి మృతి చెందాడని మంత్రి తెలిపారు. రెండు రోజుల్లో 20 కేసులు నమోదు కావడం ఆందోళనకరమని మంత్రి అన్నారు. ఇప్పటికే కరోనా నివారణ చర్యలను ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చేస్తుందన్నారు. కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడుతూ…ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు తాజాగా 10 మందికి నెగటివ్ రిపోర్టులు వచ్చాయని, ఆదివారం మరోసారి రిపోర్టులు పరిశీలించి వారిని డిశ్చార్జ్ చేస్తామన్నారు. మిగతా వారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని వెల్లడించారు.

వైద్యాధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా క రోనా కట్టడి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఇప్ప టి వరకు తెలంగాణ ప్రజలకు వైరస్ సోకలేదని, కేవలం ఇతర ప్రాంతాల ట్రావెల్ హిస్టరీ వ్యక్తుల నుంచి మాత్రమే వైరస్ వస్తుందని మంత్రి తెలిపారు. కరోనా విషయంలో సోషల్ మీడియా, మీడియ బాధ్యతతో వ్యవహరించాలని, తప్పుడు ప్రచారాలు చేయవద్దని మంత్రి కోరారు. కొవిడ్‌పై వందకు వంద శాతం సమాచారం ఇస్తున్నామని, కొందరు కావాలనే వదంతులు సృష్టిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో క్వారంటైన్ సంఖ్య క్రమంగా తగ్గుతుందని, ప్రతి క్షణం సిఎం అధికారులను అప్రమత్తం చేస్తున్నారని అన్నారు. గచ్చిబౌలిలోని కరోనా కేంద్రం 15,16 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని మంత్రి అన్నారు. ప్రార్థన మందిరాల్లో, మసీద్‌లలో గుంపులుగా జమ అయి వైరస్ వ్యాప్తికి కారకులుగా మారొద్దని మంత్రి సూచించారు.

రెండు రోజుల్లో 20 కేసులు..
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, కేవలం రెండు రోజుల్లో 20 కేసులు నమోదుకావడమే దీనికి నిదర్శనమని మంత్రి తెలిపారు. నాలుగు కుటుంబాల వారిలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందని మంత్రి పేర్కొన్నారు. నాంపల్లికి చెందిన వ్యక్తి ఇటీవల ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాడు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులకూ కరోనా సోకింది. అదే విధంగా పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి, కుత్బుల్లాపూర్‌కి చెందిన మరో వ్యక్తి ఇటీవల ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. ఈక్రమంలో వీరితో పాటు వీళ్ల కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకింది. పాతబస్తీలో ఒక కుటుంబంలో ఏకంగా ఆరుగురికి వైరస్ సోకగా, కుత్బుల్లాపూర్‌లో ఒకే కుటుంబంలో 4గురికి వైరస్ వ్యాప్తి చెందింది. అదే విధంగా దోమలగూడకి చెందిన డాక్టర్ నుంచి వారి భార్యకు, తల్లికి వైరస్ వ్యాప్తి చెందింది.

కరోనాతో ఒకరు మృతి..
రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌లలో ఒకరు మృతి చెందారు. ఖైరతాబాద్ కి చెందిన 74 ఏళ్ల వృద్దుడు ఇటీవల ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాడు. ఆరోగ్య సమస్యలు రావడంతో గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. అయితే న్యూమోనియా లక్షణాలు ఉండటంతో వైద్యులు అతనికి చికిత్స నిర్వహించారు. కానీ అతను మరణించాడు. వైద్యారోగ్యశాఖ నిబంధనల మేరకు చనిపోయిన వ్యక్తి వివరాలను ఆ హాస్పిటల్ యాజమాన్యం వైద్య ఉన్నతాధికారులకు వెల్లడించారు. డెడ్‌బాడీని పరీక్షించిన అధికారులు కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా చికిత్సను అందించేందుకు వైద్య సిబ్బంది వారి ప్రాణాలు తెగించి పోరాడుతున్నారని మంత్రి తెలిపారు. ఐసొలేషన్ వార్డుల్లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నిరంతరం వైద్య సేవలందిస్తున్నారని మంత్రి అన్నారు. డాక్టర్లు, శానిటేషన్, నర్సులు సిబ్బందిపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామన్నారు.

రాబోయే 3 నెలల్లో ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చిన చికిత్సను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎయిర్ పోర్ట్ స్క్రీనింగ్ లో పనిచేసే సిబ్బంది, – వారి కుటుంబాల్లో కొందరికి కొరొనా సోకిందని మంత్రి వెల్లడించారు. కరోనా నియంత్రణ సేవల కోసం చాలా మంది ఆర్థిక సహాయం చేస్తున్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాన్నారు . రోగుల దగ్గర పనిచేసే సిబ్బంది- ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బందికి షిఫ్ట్ వారీగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

అవసరమైతే వైద్య సిబ్బందికి 10 రోజులు విధులు, మరో పది రోజులు లీవ్ ఇస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల కార్మికులు, పేదలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. వారి ఆకలి తీర్చడం కోసం వసతి, భోజన కేంద్రాలు, భద్రతను కల్పిస్తామన్నారు. ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు, జిహెచ్‌ఎంసి అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఎక్కడైన ఇతర రాష్ట్రాల వారు ఇబ్బందులు పడుతుంటే, చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు.

 

There are no Redzones in Hyderabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News