Home లైఫ్ స్టైల్ ఆస్టియో ఆర్థరైటీస్‌కు మందుంది

ఆస్టియో ఆర్థరైటీస్‌కు మందుంది

Osteoarthritis

ఆస్టియో ఆర్థరైటీస్ కీళ్ళ చివరలో ఉన్న మృదులాస్థి(కార్టిలేజ్) క్షీణించడం వల్ల వస్తుంది. మృదులాస్థి(కార్టిలేజ్) రెండు ఎముకల మధ్య ఉండి ఒక కీలు మరొక కీలు తాకకుండా కుషన్ లాగా ఉపయోగపడుతుంది. మృదులాస్థిలో మార్పు రావడం వల్ల కీళ్ళలో వాపుతో పాటు నొప్పి ఎక్కువగా ఉండి కదలిక కష్టంగా మారుటనే ‘ఆస్టియో ఆర్థరైటీస్’ అంటాం. ఒకప్పుడు కీళ్ళనొప్పులు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే సమస్యగా భావించేవారు. కాని మారిన జీవనశైలి విధానం వల్ల సరియైన పోషకాహారం తీసుకోక, వ్యాయామం చేయటానికి వీలు కాక, ఎక్కువ సేపు కదలకుండానే విధులను నిర్వర్తించవలసి రావటంతో…. ఊబకాయం కూడా తోడై కీళ్ళ సమస్యలను అతి చిన్న వయసులోనే ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాధారణంగా ఎక్కువ శాతం మందిలో వచ్చే కీళ్ళనొప్పి ఈ రకానికి చెందినదే. బాగా బరువును మోసే కీళ్ళు ఈ వ్యాధికి ఎక్కువగా గురికావటం జరుగుతుంది. ముఖ్యంగా మోకాళ్లు ఈ వ్యాధికి గురైనప్పుడు నొప్పి, వాపు ఉండి కదలటం కష్టంగా మారుతుంది. స్థూలకాయం ఉన్నవారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి కూర్చోవటం, కదలటం ఇబ్బందిగా మారుతోంది.

కారణాలు :

 • మోకాళ్ళ జాయింట్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ (మృదులాస్థి), సైనోవియల్ ప్లూయిడ్ లో వచ్చే మార్పు వల్ల.
 • వయసు ప్రభావంతో ఎముకల అరుగుదల, దెబ్బలు తాకడం.
 • గౌట్, డయాబెటీస్ వ్యాధులు, అధిక బరువు ఉండుట.
 • హార్మోన్ల అసమతుల్యత, అనువంశికత కారణాల వల్ల.

లక్షణాలు :

 • మోకాళ్లు శరీర బరువును మోయడం వలన ఎక్కువగా వ్యాధికి గురికావడం జరుగుతుంది.
 • స్పైన్‌లో ఆస్టియోఫైట్స్ ఏర్పడుటంతో నడుం, మెడ నొప్పి వచ్చి కదలడం కష్టంగా ఉండును.
 • కూర్చొని పైకి లేవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది.
 • మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పిగా ఉండడం.
 • ఉదయం లేవగానే మోకాళ్ళు పట్టేసినట్లుగా ఉండి కదలలేకపోవడం
 • నడుస్తున్నప్పుడు చిన్న చిన్న శబ్దాలు రావటం.

నిర్ధారణ పరీక్షలు:

ఇఎస్‌ఆర్, ఆర్‌ఎఫ్యాక్టర్, సీరం యూరిక్ ఆసిడ్, విడి ఆర్ ఎల్, సిబిసి. ఎక్స్‌రేలు( ఆయా కీళ్లకు సంబంధించినవి).

జాగ్రత్తలు:

 • ముఖ్యంగా ఉప్పు,వంటలలో నూనెను తగ్గించాలి.
 • మాంసాహరం, ఆల్కహల్, స్మోకింగ్ ( అలవాటు ఉన్నవారు ) మానేయాలి.
 • అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి వ్యాయామం, యోగా నిత్యం చేయాలి.
 • ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కాల్షియం ఉన్న పాలు, గుడ్లు, పెరుగు ఆహార పదార్థాలను తీసుకోవాలి.
 • పాదరక్షలు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూసుకోవాలి.అలాగే, ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం నివారించుకోవాలి.
 • వ్యాయామం, నడక , సైక్లింగ్ మొదలైనవి చేయడం వల్ల నొప్పులు కొద్దిగా ఎక్కువ అనిపించినా కూడా ప్రతిరోజు కొద్దిసేపు వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి.
 • నొప్పి తీవ్రత తగ్గించుకోవటానికి అతిగా పెయిన్ కిల్లర్స్‌ను వాడకూడదు.
 • నీరు సరిపడినంతగా తాగాలి తాజా కూరగాయలు నిత్యం ఆహారంలో ఉండే విధంగా తీసుకోవాలి.

చికిత్స:
ఇంతగా వేధించే ఆస్టియో ఆర్థరైటీస్ కీళ్ళ నొప్పులకు హోమియో వైద్యంలో చక్కని చికిత్స గలదు. వ్యాధి లక్షణాలను, వ్యక్తి మానసిక , శారీరక లక్షణాలను పరిగణలోనికి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేసినకీళ్ళ నొప్పుల సమస్యను నయం చేయవచ్చును. వ్యాధి తొలిదశలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి లక్షణాలకు అనుగుణంగా మందులు వాడితే ఆస్టియో ఆర్థరైటీస్ నుండి విముక్తి పొందవచ్చును.
మందుల రకాలు
ఏపిస్ : కాళ్ళు, చేతులు నీరు పట్టి నొక్కితే గుంటలు పడుతాయి. కీళ్ల వాపును కలిగి ఉండి నొప్పి పెడుతాయి. వీరికి చల్లని వాతావరణం, చన్నీటి స్నానం హాయిగా ఉంటాయి. ఇలాంటి వారికి ఈ ఔషధం వాడవచ్చు.
గ్వయాకం : మోకాళ్ళ నొప్పి రోజురోజుకూ పెరుగుతుంటాయి. ముఖ్యంగా ఎముకలల్లో కుట్టినట్లుగా నొప్పులు ఉంటాయి. ఆకస్మికంగా కీళ్ళ నొప్పులు వచ్చే వారికి ఈ మందు దివ్యౌషధం. రోగి శరీరం నుంచి చెడు వాసన రావడం, కీళ్లు బిగుసుకుని వేడిగా అనిపించి కదలడం కష్టంగా ఉన్నప్పుడు దీన్ని వాడాలి.
లెడంపాల్ : రక్తంలో యూరిక్ ఆసిడ్ స్థాయి పెరగడం వలన నొప్పి మొదట పాదాలలో ప్రారంభమై పిక్కలలోకి వ్యాపిస్తుంది. తరువాత తొడలలోకి పాకుతుంది. వీరికి కాలి బొటన వేలు, పాదాలలో నొప్పి ఎక్కువగా ఉండి వాపుతో కూడి ఉంటుంది. వీరికి వేడి కాపును భరించలేరు. చల్లని నీళ్ళు కాళ్ళకు తాకిన నొప్పి నుండి ఉపశమనం పొందే వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
బ్రయోనియా : మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పిగా ఉండడం. నడుస్తున్నప్పుడు చిన్న చిన్న శబ్దాలు రావటం. వీరికి కదలికల వల్ల బాధలు ఎక్కువౌతాయి. విశ్రాంతి వల్ల తగ్గుట గమనించదగ్గ లక్షణం. వీరికి దాహం ఎక్కువగా ఉండును. అయినప్పటికి మలబద్దకంతో బాధ పడుతుంటారు. మలం గట్టిగా వస్తుంది. మానసికస్థాయిలో వీరు ఇంటిపైనే ఎక్కువగా బెంగపెట్టుకొని ఉంటారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడితే మంచిది.
ఆర్నికా : కింద పడటం వలన నడుం ప్రాంతంలో కముకు దెబ్బలు తగలటం, బెణకటం వలన మోకాళ్ళ నొప్పుల సమస్యను ఎదుర్కొనే వారికి ఈ మందు వాడుకోదగినది. అలాగే శారీరక శ్రమ అనంతరం కీళ్ళ నొప్పి వేధిస్తుంటే ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.
రస్టాక్స్ : కీళ్ళ నొప్పి ఉదయం నిద్ర లేచిన మొదటి కదలికలో అధికంగా ఉండి తరువాత కదలికలో నొప్పి తీవ్రత తగ్గుతూ ఉండుట గమనించ దగిన ముఖ్య లక్షణం. వీరికి రాత్రి పూట బాధలు ఎక్కువగా ఉంటాయి. చల్లటి, తేమతో కూడిన వాతావరణం వీరికి సరిపడదు. అనుకోకుండా బెణుకుట వలన వచ్చే కీళ్ళ నొప్పికి ఈ మందు బాగా పని చేస్తుంది. ఈ మందులే కాకుండా రూటా, కాల్కేరియాకార్బ్, సల్పర్, కాలికార్బ్, హైపరికం, మాగ్‌ఫాస్, సింఫైటినం, కాల్కేరియాఫ్లోర్, లైకోపోడియం వంటి మందులను లక్షణ సముదాయాన్ని పరిగణలోకి తీసుకొని వైద్యం చేస్తే కీళ్ళ నొప్పుల నుండి విముక్తి పొందవచ్చును.