Saturday, April 20, 2024

నిధుల్లో కోత వద్దు

- Advertisement -
- Advertisement -

Funds

 

నేటి 15వ ఆర్థిక సంఘం భేటీలో కోరనున్న రాష్ట్రం

భగీరథ, కాళేశ్వరంలకు నిధులు ఇవ్వాలని మళ్లీ కోరుతాం : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్: రాష్ట్రాలకు గ్రాంట్లు పెంచడం మంచిదేనని అయితే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత విధించరాదని తెలంగాణ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి విన్నవించనున్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం నిర్వహణకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులివ్వాలని మరోమారు కోరనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణకు తెలిపారు. దేశానికి అత్యధిక ఆదాయం సమకూర్చే ఐదారు రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో తగిన వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేయనుంది. ఢిల్లీలో 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె. సింగ్ అధ్యక్షతన మంగళవారం సమావేశం ఏర్పాటు చేసింది.

దీనికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. అయితే ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం తన ప్రాథమిక నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించింది. దీంట్లో ప్రధానంగా రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధించనున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రాలకు ఉన్న 42 శాతం నిధుల బదలాయింపును తగ్గిస్తూ సిఫారసులు చేసినట్లు సమాచారం. పథకాలకు నిధులను తగ్గించి రెవిన్యూ లోటు, విపత్తు నిధి మున్సిపల్, పంచాయితీలు ఇతర స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్‌లను పెంచాలని భావిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా రాష్ట్రాలకు ఇచ్చే నిధుల శాతాన్ని 42 నుంచి 50 శాతానికి పెంచాల్సిందేనని కోరునుంది. గ్రామీణ, సామాజిక రంగాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమ విధానాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేదానిని స్వాగతించనుంది. 15వ సంఘం పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు 2020 అక్టోబర్ 30 వరకు గడువు ఉంది. దీనిలో 2022 సంవత్సరం నుంచి 2026 వరకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య పన్ను పంపిణీలపై నివేదిక ఇస్తుంది. దీంతో పాటు రాష్ట్రాల మధ్య నిధులను ఏ విధంగా పంచాలనే అంశంపై కూడా నివేదిక ఇవ్వనుంది.

ఈ అంశాలను మంత్రి హరీశ్‌రావు మరోమారు ప్రస్తావించనున్నట్లు తెలిసింది.

* సంక్షేమ పథకాలను అమలు చేసుకునే బాధ్యతను పూర్తిగా రాష్ట్రాలకు ఇవ్వాలి.
* ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల మేరకు జిఎస్‌డిపిలో రుణపరిమితి 3 శాతంగా ఉంది. దీన్ని నాలుగు శాతానికి పెంచాలి.
* ఐదేళ్లకు సాగునీటి ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాల నిర్వహణకు గ్రాంట్‌గా ఇచ్చేలా సిఫారసు చేయాలి.
* కేంద్రం పన్నుల రాబడిలో 14 శాతంగా ఉన్న సర్‌ఛార్జీలు, సెస్‌ల్లో రాష్ట్రాలకు వాటా ఉండాలి.
* రోడ్ సెస్, క్లీన్ ఎనర్జీ సెస్‌లలో రాష్ట్రాలకు న్యాయబద్ధంగా వాటా ఇవ్వాలి.
* సమర్థంగా వ్యవహరిస్తున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉండాలి.

There should be no cut in Funds provided to states
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News