Friday, March 29, 2024

పంజ్‌షేర్ లోయలో హక్కుల ఉల్లంఘన జరగలేదు

- Advertisement -
- Advertisement -
There were no rights violations in the Panjshir Valley
క్షేత్రస్థాయిలో దర్యాప్తుకు అనుమతిస్తామని తాలిబన్లు ప్రకటన

కాబూల్ : పంజ్‌షేర్ ప్రావిన్స్‌లో ఎలాంటి యుద్ధ నేరాలకు తాలిబన్ ఫైటర్లు పాల్పడలేదని, లోయలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు మానవ హక్కుల సంస్థలకు అనుమతి ఇస్తామని తాలిబన్ల ప్రతినిధి , సమాచార , సాంస్కృతిక శాఖ డిప్యూటీ మినిస్టర్ జబిహుల్లా ముజాహిద్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 15 న అఫ్గాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత ఇటీవల పంజ్‌షేర్ లోయను కూడా ఆక్రమించినట్టు ప్రకటించారు.

ఈ క్రమంలో లోయలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు తామిచ్చే అవకాశాన్ని కల్పిత సమాచార వ్యాప్తికి వినియోగించకూడదని జబిహుల్లా షరతు విధించారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు పంజ్‌షేర్ లోని పలు ప్రాంతాల్లో ఇంకా రెసిస్టెన్స్ ఫోర్సెస్, తాలిబన్లకు మధ్య భీకర పోరు సాగుతున్నట్టు సమాచారం. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. తాజాగా అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను తాలిబన్లు హతమార్చినట్టు వార్తలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News