Home అంతర్జాతీయ వార్తలు బ్రిటన్ ప్రధాని రేసులో 8 మంది

బ్రిటన్ ప్రధాని రేసులో 8 మంది

Theresa May announces she will resign on 7 June

 

మంత్రులు, మాజీలు రంగంలోకి
ప్రధాన ప్రత్యర్థులు జాన్సన్, గోవే

లండన్ : బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ బరిలోకి కనీసం ఎనమండుగురు సిద్ధం అయ్యారు. బ్రెగ్జిట్ అంశంపై తీర్మానం చట్టసభలలో నెగ్గకపోవడంతో ప్రస్తుత ప్రధాని థెరెసా మే కలత చెంది పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టోరీ నేతగా, ప్రధానిగా తాను జూన్ 7వ తేదీన వైదొలుగుతానని గత వారం భావోద్వేగం మధ్య రాజీనామా ప్రకటన చేశారు. దీనితో బ్రిటన్‌లోని అధికార కన్సర్వేటివ్ పార్టీ నాయకత్వపు పోటీ ఇప్పుడు జోరందుకుంది. అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ మూడు రోజుల అధికారిక పర్యటనకు బ్రిటన్‌కు వస్తున్నారు. దీని తరువాత మే తమ రాజీనామా సమర్పిస్తారు. జూన్ పదవ తేదీ నుంచి నాయకత్వ పోటీకి అధికారిక ప్రక్రియ ఆరంభం అవుతుంది. అయితే ఈ లోగానే ప్రధాని పదవికి పలువురు అభ్యర్థులు తమ సంసిద్థతను వ్యక్తం చేస్తూండటంతో బ్రిటన్‌లో ఇప్పుడు తదుపరి ప్రధాని ఎవ్వరనేది కీలకంగా మారింది. బ్రెగ్జిట్ కీలక అనుకూలవాదిగా ఉన్న విదేశాంగ మాజీ మంత్రి బోరిస్ జాన్సన్ ఆపద్థర్మ ప్రధాని థెరెసా మేకు వారసులు అవుతారని , ఆయన ఈ పోటీలో ముందున్నారని వెల్లడైంది.

అయితే కనీసం మరో ఏడుగురితో ఆయన పోటీ పడాల్సి వస్తోంది. జాన్సన్‌కు పోటీగా ఆదివారం బ్రిటన్ పర్యావరణ మంత్రి మైకెల్ గోవే రంగంలోకి దిగారు. దేశ ప్రధాని పదవికి పోటీ కోసం తాను పోటీకి దిగుతున్నట్లు , ఇప్పటివరకూ అంతా అనుకుంటున్న దానిని ఇప్పుడు నిర్థారిస్తున్నట్లు , తన అభ్యర్థిత్వం విషయంలో కన్సర్వేటివ్ పార్టీని ఏకం చేయగలనని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనమైన దేశానికి సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఆదివారం ఆయన లండన్‌లోని తమ నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడారు. 2016లో జరిగిన పార్టీ నాయకత్వ పోటీ సమయంలో గోవే తీరు వివాదాస్పదం అయింది. అప్పట్లో జాన్సన్ ప్రధాని పదవికి ప్రధాన పోటీదారుగా ముందుకు వచ్చారు. అయితే తొలుత ఆయనకు మద్దతు ప్రకటించిన గోవే తరువాత నిర్ణయం మార్చుకుని జాన్సన్‌కు నమ్మకద్రోహం చేసినట్లు విమర్శలు వెలువడ్డాయి.

గోవే రంగంలోకి దిగడంతో అప్పట్లో జాన్సన్ పోటీ నుంచి వైదొలిగారు. గోవేకు థెరెసాకు జరిగిన పోటీలో థెరెసా విజయం సాధించారు. ఇప్పుడు గోవే మరోసారి జాన్సన్‌కు సవాలు విసురుతున్నారు. అధికార పీఠం కోసం పోటీకి దిగేందుకు సిద్ధపడుతున్న వారిలో బ్రెగ్జిట్ వ్యవహారాల మాజీ మంత్రి డోమినిక్ రాబ్, కామన్స్ మాజీ నేత అండ్రియా లీడ్సమ్‌లు కూడా ఉన్నారు. ఆదివారం స్థానిక వార్తా పత్రికలలో వారు వేర్వేరుగా తమ పోటీ విషయాన్ని ప్రకటించారు. థెరెసా రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానం భర్తీకి పోటీ దిశలో ఇప్పటికే బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరిమి హంట్, అంతర్జాతీయ అభివృద్ధి వ్యవహారాల మంత్రి రోరీ స్టెవార్ట్ , ఆరోగ్య మంత్రి మాట్ హనుకూక్ ఇతరులు ఉన్నారు.

ఎన్నిక ప్రక్రియ ఇదే
ఎన్నికలలో పోటీకి ముందుకు వచ్చే అభ్యర్థులు ముందుగానే బ్రెగ్జిట్‌పై తమ వైఖరిని ఓటర్ల ముందుంచాలి. 313 మంది అధికారిక టోరీ ఎంపిలు తమ ముందుకు వచ్చిన పోటీదార్ల పేర్లను పరిశీలించి, పోటీలో నిలిచే అభ్యర్థులతో కూడిన తుది జాబితాను రూపొందిస్తారు. ఆ తరువాతి క్రమంలో చిట్టచివరికి ఇద్దరు ఈ కీలక పదవికి పోటీ అభ్యర్థులుగా ఉంటారు. 1,24,000 మంది పార్టీ సభ్యులు వీరిలో నుంచి ఒక్కరిని నాయకత్వ పదవికి ఎన్నుకుంటారు. ఈ క్రమంలో విజేతగా నిలిచే వారు దేశ ప్రధాని అవుతారు.

Theresa May announces she will resign on 7 June