*కొండా దంపతులకు అభినందన
*వంచనగిరి పెద్ద చెరువుకు దేవాదుల నీరు
*ఎత్తిపోతల పథకం ద్వారా 15 వేల ఎకరాలకు సాగునీరు
*భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
మన తెలంగాణ/గీసుకొండ : వంచనగిరి గ్రామస్తులకు అండగా ఉంటూ, గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న కొండా దంపతులు అభినందనీయులని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కన్నతల్లిని, పుట్టి పెరిగిన ఊరును గౌరవించే వారే గొప్పవారని కొండా దంపతులను చూస్తే తెలుస్తుందన్నారు. శనివారం గీసుకొండ మండలం వంచనగిరిలో సిఎం కెసిఆర్ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద మంజూరు చేసిన రూ.9.50 కోట్ల నిధులతో చేపట్టే పనులకు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ గ్రామంలోని ఊరచెరువుకు దేవాదుల నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని ఖిలావరంగల్ కోట నుంచి చెరువులోకి నీటిని అందిస్తామన్నారు. కోనాయమాకుల ఎత్తిపోతల పథకం కింద వచ్చే వర్షాకాలం నాటికి 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. వంచనగిరికి 500 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కావాలని ఎంఎల్‌సి కొండా మురళీధర్‌రావు కోరగా ఆ విషయాన్ని సిఎం కెసిఆర్‌కు విన్నవిద్దామన్నారు. కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ సభలో మాట్లాడుతుంటే నాకళ్లల్లో నీళ్లు తిరిగాయని, తండ్రికే కాదు కూతూరుకు కూడా గ్రామంపై ప్రేమ ఉండడం సంతోషం అనిపించిందన్నారు. డిప్యూటి సిఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ వంచనగిరి గ్రామస్తులు ఎంతో అదృష్టవంతులని, కొండా దంపతులు కోరగానే సిఎం భారీగా నిధులు మంజూరి చేశామన్నారు. పరకాల ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న వంచనగిరి ముద్దుబిడ్డ కొండా మురళీధర్‌రావు సంకల్పం మంచిదని, అడిగిన వెంటనే భారీగా నిధులను మంజూరు చేసిన సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపి పసునూరి దయాకర్, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట ఎంఎల్‌ఎలు కొండా సురేఖ, ఆరూరి రమేష్, ప్రభుత్వ విప్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పి చైర్‌పర్సన్ గద్దల పద్మ, నగర మేయర్ నన్నపునేని నరేందర్, రాష్ట్ర చీఫ్ పెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, రాష్ట్ర ఉమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ కొంపెల్లి ధర్మరాజులు, వంచనగిరి పిఎసిఎస్ చైర్మన్ కొండా సుస్మితాపటేల్, ఎంపిపి ముంత కళావతి, సర్పంచ్ కొమ్ముల వజ్రమ్మ, ఎంపిటిసి బొమ్మగాని అంబిక, టిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా గ్రామస్తులు మంత్రులకు ఘనస్వాగతం పలికారు. కాగా ఎంఎల్‌సి కొండా మురళీధర్‌రావు తమ గ్రామంలో డబుల్ రోడ్డు కావాలని కోరగా మంజూరు చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హామీ ఇచ్చారు.