Home జాతీయ వార్తలు ముగిసిన మూడో దశ

ముగిసిన మూడో దశ

గడువు పూర్తయిన సమయానికి 64.66% పోలింగ్, పెరిగే అవకాశం

బెంగాల్‌లో హింస, ఒకరి మృతి
ఇవిఎంల మొరాయింపు యథాతథం
బెంగాల్‌లో అత్యధికంగా 79.36%, అనంత్‌నాగ్‌లో 12.86%

Third Phase Polling

 

బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ ఒకపక్క 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నా ఓటుహక్కును వినియోగించుకోకుండా ఉండలేకపోయారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా బిజెపి వర్గాలు కోరాయి. కానీ ఆ మాటలు పక్కనబెట్టి అహ్మదాబాద్‌లోని షాపూర్ హిందీ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేశారు. తాను 1952 నుంచి ఎప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించకుండా ఉండలేదని ఈ సందర్భంగా అద్వానీ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మంగళవారం 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 117 లోక్‌సభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో పోలింగ్ గడువు ముగిసే సమయానికి 64. 66 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎనికల సంఘం తెలిపింది. అయితే గడువు ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లు ఓటు వేయడానికి అనుమతిస్తున్నందున పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది. పలు రాష్ట్రాల్లో ఇవిఎంలలో సాంకేతిక లోపాలకు సంబంధించిన ఫిర్యాదులు రావడంతో పాటుగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో జరిగిన హింసాకాండలో ఒక వ్యక్తి మృతి చెం దాడు. వీటితో పాటుగా చెదురు మదురు సంఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఇసి తెలిపింది. ఏడు దశల్లో నిర్వహించే లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడో దశలోనే అత్యధిక స్థానాలకు పోలింగ్ జరిగింది.

గుజరాత్, కేరళ రాష్ట్రాల్లోని అన్ని స్థానాలతో పాటుగా కర్నాటకలోని సగం  స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. గుజరాత్‌లో28, కేరళలో 20 లోక్‌సభ స్థానాలు కాక కర్నాటక, మహారాష్ట్రలో 14 స్థానాల చొప్పున, ఉత్తరప్రదేశ్‌లో పది, ఒడిశాలో ఆరు, బెంగాల్‌లో అయిదు, బిహార్‌లో 5, అసోం లో నాలుగు, చత్తీస్‌గఢ్‌లో 7, జమ్మూ, కశ్మీర్, కేంద్ర పాలిత ప్రాంతాలయిన దాద్రానాగర్ హవేలి,డామన్ డయ్యులలో ఒక్కో స్థానానికి మంగళవారం పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తిని నరికి చంపారు. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో కూడా చోటు చేసుకున్న ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. కేరళ, అసోం, యుపి రాష్ట్రాల్లోని కొన్ని చోట్లు ఇవిఎంలు పని చేయడం లేదంటూ ఫిర్యాదులు రావడంతో అధికారులు వాటిని సరి చేశారు. గుజరాత్‌లో ఓటేసిన ప్రధాని నరేంద్ర మోడీ అంతకు ముందు 98 ఏళ్ల తల్లిని కలిసి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.

కాగా మంగళవారం పోలింగ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(వయనాడ్), బిజెపి చీఫ్ అమిత్‌షా(గాంధీనగర్)తో పాటుగా ఎస్‌పి వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్. ఆ పార్టీ నేత ఆజం ఖాన్, బిజెపి నేత జయప్రదతదితర ప్రముఖుల భవితవ్యం ఇవిఎంలలో నిక్షిప్తమైంది. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్న అనంత్‌నాగ్ నియోజక వర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరగనుండగా మంగళవారం తొలి దశ పోలింగ్ నిర్వహించారు. శాతిభద్రతల పరిస్థితి కారణంగా రెండో విడతలో వాయిదా పడిన త్రిపుర తూర్పు నియోజకవర్గానికి కూడా ఈ రోజు పోలింగ్ జరిగింది. కాగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియగా, మిగతా చోట్ల సాయంత్రం 6 గంటలకు ముగిసింది. చివరి వార్తలందే సమయానికి పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 79.36 శాతం ఓటరుల తమ ఓటు హక్కు వినియోగించుకోగా, త్రిపురలో 78.52, అసోంలో 78.29, దాద్రా, నాగర్ హవేలిలో 71.43, గోవాలో 71.09, కేరళలో 70.21, కర్నాటక 64.14, మహారాష్ట్ర 56.57, గుజరాత్ 60.21, ఉత్తర ప్రదేశ్ 57.74, బీహార్ 59.97, చత్తీస్‌గఢ్ 65.91 శాతం. డామన్, డయ్యు 65.34 శాతం పోలింగ్ నమోదుఅయింది. అనంత్‌నాగ్ నియోజక వర్గంలో అతి తక్కువగా 12.86 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయింది. మంగళవారం మూడో దశ పోలింగ్‌తో ఆరు రాష్ట్రాలో,్ల 542 లోక్‌సభ స్థానాలకు గాను 302 స్థానాలకు పోలింగ్ ముగిసినట్లయింది.