Home తాజా వార్తలు కాలనీలు కకావికలు

కాలనీలు కకావికలు

Thousands of colonies waterlogged

 

పాతబస్తీలో దయనీయ పరిస్థితులు

గుర్రం చెరువుకు గండితో ఇళ్లను ముంచెత్తిన వరద
జలమయమైన వేలాది కాలనీలు
నిత్యావసరాలు, ఇంట్లోని ముఖ్యమైన వస్తువులతో సహాయక శిబిరాలకు వేలాది మంది
పలుచోట్ల బయటపడుతున్న మృత దేహాలు
బురదలో కూరుకుపోయి అక్కరకు రాకుండా పోయిన వేలాది వాహనాలు, చిలుకానగర్‌లో నీటిని తోడుతూ విద్యుత్ షాక్‌తో స్కూల్ యజమాని మృతి
సవాలుగా మారిన సహాయక చర్యలు
వరంగల్, విజయవాడ, బెంగళూర్ హైవేల క్లోజ్
మూసారాంబాగ్, మలక్‌పేట రైల్వే బ్రిడ్జిలపై రవాణా నిషేధం

మన తెలంగాణ/హైదరాబాద్ : తగ్గుముఖం పట్టాయన్న వర్షాలు మళ్లీ మొదలయ్యే సరికి భాగ్యనగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. నగరంపై వరుణుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. లోతట్టు ప్రాంత వాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుముంటున్నారు. ఇప్పటికే 32 సెంమీ అత్యధిక వర్షపా తంతో భాగ్యనగరంలో దాదాపు 1500 కాలనీలు జలదిగ్భంధం లో చిక్కుకుని కాలనీ వాసులు పలు ఇక్కట్ల పాలవ్వగా..ఇంకా 800 కాలనీలు జలదిగ్బంధంలో కాలం గడుపుతున్న సమయ ంలో మళ్లీ వరుణుడు విశ్వరూపం చూపాడు. శనివారం సాయ ంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మళ్లీ కుండపోత వర్షం కురిసింది. వరద ఉద్ధృతి నుంచి తేరుకుంటున్న క్రమంలో మళ్లీ భారీ వర్షం కురవడంతో మరిన్ని కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బం ధంలో చిక్కుకున్నాయి కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ వంటి నిత్యావసరాలు సైతం వరదనీటిలో తేలియా డుతూ కనిపించాయి. శనివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.

అపార్టుమెంట్ సెల్లార్‌లు వరదనీటితో నిండిపోయాయి. రోడ్లు వాగులు, కాలువలను తలపిస్తున్నాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. హైదరాబాద్ పాతబస్తీ డబీర్‌పురాలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బాబానగర్ చెరువు కట్ట తెగిపోవడం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పాతబస్తీలోని పలు కాలనీలలోకి పెద్ద ఎత్తున ప్రవా హం పోటెత్తుతోంది. నాలా మరమ్మతు పనులు చేస్తుండటం మరింత సమస్యగా మారింది. వరదనీరు దిగువకు వెళ్లే మార్గం లేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయి.

రహదారిపై నుంచి వెళుతున్న నీటితో డబీర్‌పురా వద్ద వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. పాతబస్తీలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. అల్ జుబేల్ కాలనీ, జీఎం కాలనీ, రాయల్ కాలనీల్లో భారీగా నీరు చేరింది. ఫలక్‌నుమా వంతెను నుంచి డబీర్‌పురా వెళ్లే మార్గంలో ఉన్న కానీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా జలమయమ య్యాయి. దాదాపు 80 శాతం మంది బాధితులను పునరావాస శిబిరాలకు తరలించారు. మిగతా 20 శాతం మంది ఇళ్లలోని ఒకటి, రెండో అంతస్తుల్లో ఉంటున్నారు. వారికి కావాఇ్సన ఆహారం, ఇతరర నిత్యావసర వస్తువులు పడవుల ద్వారా వెళ్లి ఇస్తున్నారు.

సరూర్‌నగర్ మినీట్యాంక్‌బండ్ వద్ద కాలనీల్లోకి నీరు చేరింది. కోదండరామ్‌నగర్, కీసలబస్తీ, కమలానగర్‌లో ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్లాపూర్ బ్రహ్మపురి కాలనీ, భవానీనగర్, వనస్థలిపురం, హరిహరిపురం కాలనీలలోని పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. కాప్రా చెరువు దిగువన ఉన్న 14 కాలనీల్లోకి ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఉప్పల్ నల్లచెరువు వద్ద డీసీఎం వ్యాన్ గుంతలో ఇరుక్కుపోయింది. ఉప్పల్ చిలుకానగర్‌లో విద్యుదాఘాతంతో ప్రైవేట్ స్కూల్ యజమాని మృతి చెందాడు. స్కూల్ బిల్డింగ్ సెల్లార్ నీటిని మోటార్‌తో తొలగించే క్రమంలో శ్రీనివాస్ విద్యుదాఘాతానికి గురయ్యారు. దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, ఈఎన్‌టి కాలనీ, కమలానగర్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శనివారం రాత్రి 10 గంటల ఉంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నదీమ్‌నగర్, నిజం కాలనీ, బాల్‌రెడ్డినగర్ కానీ, విరాసత్‌నగర్ కాలనీల ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. హైదరాబాద్ హార్స్ రైడింగ్ స్కూల్ వారు గుర్రాల ద్వారా ఇంటింటికి పాలు, కూరగాయలు అందించే ప్రయత్నం చేస్తున్నారు.

మంగళ్‌హాట్ అర్‌కెపేటలో గోడకూలి ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కొత్త పేట నుంచి కోఠికి వెళ్లే రహదారిపై అధిక నీరు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఐస్ సాధాన్ డివిజన్ సింగరేణి కాలనీ రాత్రి కురిసిన భారీ వర్షానికి నిండా మునిగిపోయి చెరువులను తలపిస్తోంది. కొన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొన్నారు. తమ సమస్యను పట్టించుకుని త్వరలోనే పరిష్కరించాలని కోరుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మెయిన్ చెరువు కట్ట తెగిపోయింది. ఫలితంగా పటేల్ నగర్, ప్రేమ్‌నగర్, బాపునగర్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరి శనివారం సాయంత్రం నుంచి ఆయా కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతమైన నల్లకుంట డివిజన్‌లోని రత్నన గర్, నరసింహ బస్తి, గోల్నాక డివిజన్‌లోని లంక బస్తీ కృష్ణానగ ర్‌లు పూర్తిగా నీట మునిగాయి. వరద తీవ్రత తగ్గకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పాతబస్తీ బహదూ ర్‌పురాలో ఓ వ్యక్తి మూసీ ప్రవాహంలో కొట్టుకుపోయిన దృశ్యా లు భయానక పరిస్థితిని సూచిస్తున్నాయి. బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గగన్‌పహాడ్ వద్ద బురదలో మరో మృతదేహం లభ్యమైంది. మృతుడు అదే ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలుడు అయాన్‌గా గుర్తించారు. ఈ నెల 14న భారీ వర్షాల కారణంగా అప్ప చెరువు తెగటం వల్ల రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చింది. వరద ధాటికి కొంత మంది వ్యక్తులు, వాహనాలు కొట్టుకుపోగా.. బురదలో ఒక్కొక్క టిగా మృతదేహాలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు ఆరు మృతదే హాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పురాణాపూల్ నుంచి మూసారాంబాగ్ వరకు మూసీని ఆక్రమించి వేసిన నిర్మాణాలన్నీ నీట మునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వరద ఉద్ధృతికి సిలిండర్ వంటి బరువైన వస్తువులు సైతం కొట్టుకుపోతున్నాయి. కోఠి నుంచి చాదర్‌ఘాట్‌వైపు వెళ్లే వంతనపై మూసీ పొంగి ప్రవహిం చడంతో రహదారి కొట్టుకుపోయి గుంతలు ఏర్పడటంతో పాటు వాహన రాకపోకలకు అవకాశం లేకుండా కంకర తేలింది.

హిమా యత్ సాగర్ గేట్లు మరోసారి తెరవడంతో మూసీ నదిలో మరోసా సురి వరద ప్రవాహం పెరిగింది. లంగర్ హౌస్, బాపూఘాట్, జియాగూడ, పురానాపూల్ వద్ద మూసీ ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. జియాగూడ వద్ద ఉన్న ఫోర్‌వే రోడ్డుపైకి పూర్తిగా నీరు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గోల్కొండలో ఏర్పాటు చేసిన గోల్ఫ్‌స్టేడియం భారీ వర్షానికి నీట మునిగి జలాశయాన్ని తలపిస్తోంది.

రహదారుల మూసివేత.. రాకపోకల నిలిపివేత..

భాగ్యనగరంలోని పలు రహదారులను బారికేడ్లతో ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. మలక్‌పేట రైలు వంతెన, మూసారాంబాగ్ వంతెన రోడ్లు మూసివేయగా చాదర్‌ఘాట్, పురానాపూల్ 100 ఫీట్‌లో రాకపోకలు నిలిపివేశారు. గడ్డి అన్నారం నుంచి శివగంగ రోడ్డు మూసేశారు. టోలిచౌకి రోడ్డు, ఫలక్‌నుమా బ్రిడ్జి రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. మొఘల్ కాలేజి నుంచి బండ్ల గూడ మీదుగా ఆరాంఘర్ వెళ్లే దారి మూసివేశారు. మహబూబ్‌నగర్ క్రాస్ రోడ్డు నుంచి ఐఎస్ సదన్‌కు వెళ్లే రోడ్డును మూసివేశారు.