ప్రేమను నిరాకరించడంతో యువతికి నిత్యం వేధింపులు
అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
హైదరాబాద్: బలవంతంగా తీసుకున్న సెల్ఫీ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని వేధిస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్, తాటి అన్నారానికి చెందిన అశ్వక్ అలీషేక్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడి ఇంటికి సమీపంలో ఉంటున్న పల్లవి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఫేస్‌బుక్‌లో రోజు ఛాటింగ్ చేసుకునే వారు. ఒక రోజు నిందితుడు ప్రేమిస్తున్నానని యువతికి చెప్పాడు. దానికి యువతి నిరాకరించింది. ఓ రోజు యువతి చదువుకుంటున్న కాలేజీకి వెళ్లి బయట కలిశాడు. ఆ సమయంలో బలవంతంగా యువతితో సెల్ఫీ ఫొటోలు తీసుకున్నాడు. అప్పటి నుంచి వాటిని చూపించి యువతిని వేధించడం ప్రారంభించాడు.
తనతో కారులో రావాలని బలవంతం చేశాడు. లేకపోతే మీ కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపిస్తానని బెదిరించడంతో కారులో వెళ్లింది. అప్పడు యువతి చేతిలో బలవంతంగా బీర్ బాటిల్ పెట్టి బలవంతంగా మళ్లీ సెల్ఫీ ఫొటోలు తీశాడు. వాటిని అడ్డుపెట్టుకుని మరింత ఎక్కువగా బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. నిందితుడి వేధింపులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో యువతి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. రాకొచకొండ ఎసిపి హరినాథ్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ రాము కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.