Home ఎడిటోరియల్ పరువు ప్రాణమే!

పరువు ప్రాణమే!

Defamation Case

 

అపనిందతో జీవించటమనేది పరువుగల మనిషికి మరణం కంటే నీచమైనది అంటుంది భగవద్గీత. లోకంలో ఇరువురి మధ్య సాగే వివాదాలలో ఒకరు మరొకరిమీద అపనిందలు వేస్తూనే వుంటారు. నింద మోపబడిన వ్యక్తి సమాజంలో అపకీర్తి పాలవుతాడు. మనోవ్యాకులతకు లోనవుతాడు. అది తట్టుకోలేక ఆ వ్యక్తి కోర్టు తలుపులు తట్టి దావా వేస్తాడు. దీనినే ‘పరువునష్టం దావా’ అంటాము. ‘పరువు’ అంటే ఒక వ్యక్తికి అతని జీవన విధానం అనుసరించి సమాజం ఇచ్చే గౌరవంతో పాటు వంశపారంపర్యంగా వచ్చే ప్రతిష్ఠ కూడా అయిఉండవచ్చు. పరువు అంటే క్షణభంగురమగు నీటి బుడగ కాదు. చిరుగాలికి ఆరిపోయే దీపమూ కాదు. తన బ్రతుకును పరువు తో అనుసంధానం చేసి గడిపేదే మేలైన జీవితం. సమాజంలో కొంతమంది ఆస్తిపాస్తులను జమ చేసుకోవటం కంటే తమ పరువు మర్యాదలను కాపాడుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ గౌరవంగా జీవిస్తుంటారు.

అటువంటి వారికి ఎవరైనా అకారణంగా పరువు నష్టం కలిగిస్తే వారు సహించలేరు. ప్రకటించే తీరును బట్టి పరువు నష్టాన్ని రెండు రకాలుగా చూస్తారు. 1. లిబల్: పర్మినెంట్ స్వభావంగలవి – అనగా సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు, బొమ్మలు, కార్టూన్స్, మెసేజులు, ఫోటోలు, శిల్పాలు, సినిమాలోని సన్నివేశాలు మొదలైన వాటి ద్వారా పరువు తీసే దుశ్చర్యలు దీని కింద పరిగణిస్తారు. 2. స్లాండర్: బూతులు తిట్టటం, అపవాదులు, అవమానపరిచే హావభావాలు, సంకేతాలు, సంజ్ఞలు మొదలైనవి. వీటిని ఆయా నిర్దిష్టమైన సందర్భంలో మాత్రమే వినగలము. చూడగలము. మనదేశంలో పైన తెలిపిన రెండింటిని సివిల్ దుశ్చర్యగాను, క్రిమినల్ నేరంగానూ కూడా పరిగణినిస్తున్నాం. ఎవరైనా ఒక వ్యక్తి తన మాటల వలన గానీ లేక రచనల ద్వారా గానీ లేక సంకేతముల ద్వారా గానీ, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా అతని పరువు ప్రతిష్ఠలను దెబ్బ తీయాలనే సంకల్పంతో వ్యవహరించితే అది పరువు నష్టంగా పరిగణింపబడుతున్నది. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 499 పరువు తీయాలనే సంకల్పం (మాల్-ఇంటెన్షన్) ప్రకటించిన వ్యక్తికి లేకపోయినప్పటికీ ఈ చర్య వలన ఒక వ్యక్తి పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం వుంటే చాలు- పరువు నష్టం కిందే చూస్తారు.

ప్రధానాంశాలు: పరువు నష్టాన్ని నిర్ణయించటానికి ముఖ్యంగా మూడు అంశాలుండాలి. 1. ఆ చర్య ఫిర్యాదుదారుని పరువు తీసేదిగా వుండాలి. ఫిర్యాదుదారుడు పరువు పోయిందని తనకు తనే భావిస్తే సరిపోదు. ఆ చర్య వలన పది మందిలో ఫిర్యాదుదారుడు చులకన అయ్యే అవకాశం వుందా? అనేది ప్రధానం. 2. ఆ చర్య స్పష్టంగా ఫిర్యాదుదారుని ఉద్దేశించి వుండాలి. అటువంటి సందర్భంలో మాత్రమే ఫిర్యాదుదారుడు పరిహారం పొందగలడు. ఆ చర్య ప్రభావం ఫిర్యాదుదారునిపై స్పష్టంగా పడాలి. కొన్ని సార్లు పత్రికలలో పేర్లు స్పష్టంగా రాయకపోయినా, ఫలానా వ్యక్తి అని గుర్తించే విధంగా ఆచూకీ తెలుపుతూ వార్త ప్రచురిస్తారు. ‘అధికార పార్టీకి చెందిన ఒక మహిళా నాయకురాలి భర్త, రైతుని బెదిరించి పది ఎకరాలు ఆక్రమించాడు’ అనే వార్త పత్రికలో వచ్చిందనుకోండి.

నిజానికి ఆయన ఎవరినీ బెదిరించకుండా, రైతుకు సరైన ప్రతిఫలం సొమ్ము ఇచ్చి సేల్ డీడ్ చేయించుకొనుంటే – ఈ నేపథ్యంలో ఆ వార్తలో తన పేరు రాయకపోయినా, సందర్భానుసారంగా ఆ తప్పుడు వార్త తనను ఉద్దేశించినదేనని నాయకురాలి భర్త నిరూపించుకొని పరిహారం పొందవచ్చు. ఒక రాజకీయ నాయకునిపై అభ్యంతరకరమైన వార్తలు పత్రికలో వచ్చినప్పుడు ఆ నాయకుడే తన పరువు నష్టం పై ఫిర్యాదు చేయాలి. అలాకాకుండా ఆ వార్త చదివి బాధపడిన అభిమాని నాయకుని తరపున డిఫమేషను కేసు వేయలేడు. కానీ, ఆ అభిమాని భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 268 ఆధారంగా పత్రికపై న్యూసెన్స్ కేసు పెట్టవచ్చు. చనిపోయి న వ్యక్తులపై వారి పరువుకు భంగం కలిగేలా ఎవరైనా ప్రకటనలు/వ్యాఖ్యలు చేసినప్పుడు, చనిపోయిన వ్యక్తి తరపు వారసులుగానీ, బంధువులుగానీ, జరిగిన పరువు నష్టానికి వ్యాఖ్యాతలపై క్రిమినల్ కేసు వేసే అవకాశం వుంది.

సివిల్ దావా వేసి పరిహా రం పొందలేరు. 3. చర్య/వ్యాఖ్యలు బహిరంగంగా ప్రకటింపబడాలి. ఆ ప్రకటన చూసి ఎవరో ఒక్కరైనా ఏమిటయ్యా, ఇటువంటి పని చేసావట. ఎంత నామర్దా? అనిస్పందించాలి. అప్పుడు మాత్రమే పరువు పోయిందనేది ఖాయం అవుతుంది. తన పైన వేసిన అపవాదును ఏఒక్కరైనా నమ్మి స్పందించినప్పుడు తన ప్రతిష్ఠకు నష్టం కలుగుతుంది.ఇతరుల స్పందన ఉంటేనే కోర్టులో దావా వేయగలము. చర్య జరిగిన నాటినుండి ఒక సంవత్సరంలోపుగా సివిల్ దావాగానీ లేదా మూడు సంవత్సరాలలోపు క్రిమినల్ కేసుగా ఫైల్ చేయవచ్చు.ఫిర్యాదుదారుని నివవాసం ఏ కోర్టు పరిధిలో వుంటుందో ఆ కోర్టులోనే కేసు ఫైల్ చేయవచ్చు.

కేసు ఎలా వేయాలి సివిల్ దావా: పరిహారం కోసం కోర్టులో సివిల్ దావా వేసేముందు ప్రతివాదికి నోటీసు ఇవ్వటం పరిపాటి. దావాలో వాది పరిహారాన్ని డబ్బు రూపంలో అధిక మొత్తంలో అడుగుతాడు. దావాలో అడుగుతున్న మొత్తన్నిబట్టి వాది కోర్టు ఫీజు కట్టాల్సి వుంటుంది. సమగ్రంగా విచారించిన మీదట పరిహారం ఎంత అనేది కోర్టు వారు నిర్ణయిస్తారు. దావా నడిచేటప్పుడు ఏసమయంలోనైన ప్రతివాది సంజాయిషీ ఇచ్చుకొంటే, తమకున్న విచక్షణ అధికారంతో కోర్టువారు ప్రతివాదిని మన్నిం చి, దావాను కొట్టివేయవచ్చు.

క్రిమినల్ కేసు: ప్రతివాదికి ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రిమినల్ కేసుగా ఫైల్ చేయాలంటే బాధితుడు పోలీసు స్టేషనుకు వెళ్ళి ఫిర్యాదు వ్రాసి ఇవ్వాలి. డిఫమేషను కేసు కాంపౌండబుల్ నేరం అవుతుంది కాబట్టి, ఫిర్యాదు ఆధారంగా ఎఫ్.ఐ.ఆర్. రాసే ముందు పోలీసువారు కోర్టు అనుమతి తీసుకొంటారు. ఒకవేళ పోలీసులు ఫిర్యాదును తీసుకోకుండా తిరస్కరించినా, ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయకపోయినా, పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాలి. అధికారులు కూడా జాప్యం చేస్తుంటే నేరుగా కోర్టులో ప్రైవేటు కేసు ఫైల్ చేయవచ్చు. కోర్టు ఫీజు ఏమీ వుండదు. అక్కడ కోడ్ అఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం విచారణ జరిపిన మీదట నిందుతునికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష వేసే అవకాశం వుంది. ఫిర్యాదుదారుడు దోషరహితుడై వుండాలి. కోర్టు లో వివాదం పరిష్కారానికి ఎంత కాలం పడుతుందనేది ఇదమిత్థంగా చెప్పలేము. సాధారణంగా రెండు సంవత్సరాలకు పైమాటే.

ప్రతివాదికి కవచాలు – మినహాయింపులు: ఫిర్యాదుదారుడు కోర్టును ఆశ్రయించినప్పుడు, ప్రతివాదికి కూడా చట్టపరమైన రక్షణ కవచాలుంటాయి. ప్రకటించిన ఆరోపణ వాస్తవమైనదై వుండాలి. పత్రికకు అందిన వార్తలను ప్రచురించేముందు సంపాదకుడు జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. ఆరోపణలకు సరైన ఆధారలుండాలి. ఆ వార్తలో ప్రజాసంక్షేమం ఇమిడి వుండాలే గానీ దుర్భుద్ది ఉండరాదు. జన బాహుళ్యానికి సంబందించిన సమస్య మీద సద్భావనతో చేసిన కామెంట్లు పరువు నష్టం కిందకు రావు. కోర్టులు వెలువరించిన తీర్పును ప్రచురించవచ్చు. ఆ వార్త నిండుతుడి పరువు దిగజార్చేదిగా ఉన్నప్పటికీ అది పరువునష్టం కిందకు రాదు. ఒక రచయిత ఏదైనా టాపిక్ మీద నిర్ణయం ప్రజలకు వదిలేసినప్పుడు, ఆ విషయం మీద సద్భావనతో చేసే ‘వ్యాఖ్యలను’ పరువు నష్టం గా లెక్కించలేము.

ఒక ఉద్యోగి తనకప్పగించిన విధులను సరిగా నిర్వర్తించకపొతే, ఆ నిర్లక్ష్య ప్రవర్తనను పై అధికారులకు తెలియజేయటం పరువు నష్టం కాదు. తప్పు చేసిన స్టూడెంటును లెక్చరర్ ఇతర విద్యార్ధుల ముందు తిట్టినా అది పరువు నష్టం కాదు. ఎందుకంటే లెక్చరర్‌కు ఆ విద్యార్ధిని తీర్చిదిద్దాలనే సద్భావనే వుంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్ వంటి చట్ట సభలలో సభ్యులు, దుర్బుద్ధి వ్యూహాలతో, ఒకరిమీద మరొకరు దుమ్మెత్తి పోసుకొని విమర్శించుకొన్నా, అసత్య ఆరోపణలతో ప్రసంగాలు, ప్రకటనలు చేసినా – ఆ నాలుగు గోడల మధ్య జరిగిన సంఘటనలపై పరువు నష్టం చట్టాలు వర్తించవు. చట్ట సభలకు విశేష అధికారాలుంటాయి.
చట్టాలు: డిఫమేషన్ (పరువు నష్టం) అనే న్యాయపరమైన ప్రక్రియపై గతంలో అనేక అభ్యంతరాలు, చర్చోపచర్చలు జరిగాయి.

‘వాక్ స్వాతంత్య్రం – భావవ్యక్తీకరణ’ అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా పౌరులకు ప్రసాదించిన ప్రాధమిక హక్కు. అలాగే ‘పరువుగా జీవించే’ హక్కును కూడా ఆర్టికల్ 21 ద్వారా ఇచ్చింది. ఎవరైనా భావవ్యక్తీకరణ హక్కును దుర్వినియోగం చేసినప్పుడు ఇతరుల పరువు గంగలో కలిసే ప్రమాదముంది. కాబట్టి ‘వాక్ స్వాతంత్య్రం -భావవ్యక్తీకరణ’, హక్కుపై ‘పరిమితమైన ఆంక్షలు’ వున్నాయని గమనించాలి. బాధితుడు తగిన సాక్ష్యాధారాలతో భారతీయ శిక్షాస్మృతిలోని 52, 124ఎ, 499, 500, 501, 502, 505, 506 సెక్షనులతో పాటుగా సందర్భాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని కూడా ప్రస్తావించవచ్చు. భారతీయ శిక్షాస్మృతిలోని 499, 500 సెక్షన్లు రెండువైపులా పదునున్న కత్తి వంటివి. కేసు వేసే ముందు ఫిర్యాదుదారుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒకసారి పగిలితే అద్దం అతకదు. అలగే పరువు పోయిన వ్యక్తి, న్యాయపరంగా ఎన్ని కసరత్తులు చేసినా, తిరిగి ఇదివరకటి హుందా జీవితాన్ని గడపలేడు. ఆ అపకీర్తి అతనికి మాత్రమే పరిమితం కాకుండా, అతని కుటుంబానికి, తరతరాలకూ అది మాయని మచ్చగా వెంటాడుతూనే వుంటుం ది. న్యూ ఐ.టి. మీడియాలైన బ్లాగు, వెబ్‌సైట్‌లతో పాటుగా, ఈ మధ్య విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన వాట్స్‌ఆప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి డిజిటలైజ్డ్ మీడియాలలో వచ్చిన అసత్య కథనాలపై సైబర్ డిఫమేషన్ కేసులు వేయవచ్చు. కాబట్టి దూషణే ప్రవృత్తిగాగల వారు, మొతాదుకు మించి స్పందించే పత్రికలు, బురదజల్లటమే ఎజెండాగా ఉన్న చానెల్స్, సోషల్ మీడియాలో అసత్యాలను గుప్పించి స్పర్ధలను రగిల్చేవారు, స్వీయ నియంత్రణతో తగు సంయమనం పాటిస్తూ ‘ప్రజాసంక్షేమం’ అనే పరమ ధర్మానికి కట్టుబడి వుండాలని ఆశిద్దాము.

Three aspects to in a Defamation Case