Home తాజా వార్తలు ఆటకెళ్లి… అనంతలోకాలకు …

ఆటకెళ్లి… అనంతలోకాలకు …

boys killed

 

నిజామాబాద్ : ఆట కోసం బయటకు వెళ్లిన ముగ్గురు బాలురు లోతైన నీటి గుంతలో పడి చనిపోయారు. ఈ ఘటన రెంజల్ మండల పరిధిలోని పేపర్‌మిల్లు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… పేపర్‌మిల్లు గ్రామానికి చెందిన వాగ్మరే గౌతం, పూజా దంపతులకు ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు సిద్దార్థ్ (8), రెండో కుమారుడు దీపక్ ’(7), అదేగ్రామానికి చెంది నజలాల్‌కు నలుగురు కుమారులు ఉండగా, వారిలో చిన్నవాడైన హుజుఫొద్దీన్ (7) నేరేడు పండ్ల కోసం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అయితే నేరేడు పండ్లు తెంచుకుంటున్న సమయంలో బైక్ టైరు సమీప వ్యవసాయ పొలంలో మొరం కోసం తీసిన గుంతలోకి జారిపడింది.

ఈ క్రమంలో వారు టైరును బయటకు తీసే క్రమంలో లోతైన ఆ నీటి గుంతలో పడి చనిపోయారు. సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తమ పిల్లలు కనిపించలేదు. చీకటైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామ శివారులో వెతికారు. సిద్దార్థ్ , దీపక్, హుజుఫొద్దీన్‌లు నీటి గుంతలో శవాలై కనిపించడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనాస్థలిని సిఐ షాకీర్ అలీ,ఎస్‌ఐ శంకర్‌లు పరిశీలించారు. సోమవారం ఉదయం సిద్దార్థ్ , దీపక్, హుజుఫొద్దీన్ మృతదేహాలను గుంత నుంచి వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు సిఐ షాకీర్ అలీ తెలిపారు.

Three boys killed in Nizamabad