Home Default బలహీన పడిన ‘నివర్’… తుపానుకు ముగ్గురు బలి

బలహీన పడిన ‘నివర్’… తుపానుకు ముగ్గురు బలి

Three killed as cyclone Nivar wreaks havoc in TN

 

తేరుకుంటున్న తమిళనాడు, పుదుచ్చేరి
కర్ణాటక వైపు ‘నివర్’ గమనం
ఆదుకుంటామని అమిత్‌షా హామీ

చెన్నై: నివర్ తుపాను బలహీన పడింది. నివర్ ఫలితంగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ముగ్గురు మృతి చెందారు. మరో ఆరు గంటల్లో అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారి వాయువ్య దిశగా కర్ణాటక వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ప్రకటించింది. పుదుచ్చేరి సమీపంలో గత రాత్రి తీరం దాటింది. కర్ణాటక లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని, రానున్న ఆరు గంటల్లో మరింత బలహీన పడనుందని ఐఎండి వెల్లడించింది. గురువారం పుదుచ్చేరికి ఉత్తర వాయువ్య దిశలో 85 కి.మీ దూరంలో చెన్నైకి పశ్చిమ నైరుతి దిశలో తమిళనాడు ఉత్తర కోస్తా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను బలహీన పడడంతో అంతవరకు పుదుచ్చేరిలో విధించిన 144 సెక్షన్‌ను ఎత్తివేశారు.

పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గత రాత్రంతా భారీగా వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. 2015 డిసెంబర్‌లో చెన్నైలో వరదలు ముంచెత్తినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపించ లేదని, కాగ్ నివేదిక కనిపించలేదు సరికదా, కోర్టు ఉత్తర్వు కూడా అమలు కాలేదని, ప్రభుత్వం తన వైఫల్యానికి ఫలితంగా బాధితులకు రూ.5000 వంతున నష్టపరిహారం అందించాలని డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ డిమాండ్ చేశారు. తుపాను ఇప్పుడు భూభాగంలో కేంద్రీకృతమై ఉన్నందున బలంగా ఈదురు గాలులు వీచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (చెన్నై) ఎస్. బాలచంద్రన్ చెప్పారు.

తమిళనాడు ప్రభుత్వం గురువారం శెలవు ప్రకటించింది. అత్యవసర సర్వీస్‌లు మాత్రమే నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు చెన్నై విమానాశ్రయంలో సర్వీస్‌లు మధ్యాహ్నం నుంచి మెట్రో, బస్‌సర్వీస్‌లు మళ్లీ ప్రారంభమయ్యాయి. తుపాన్ దృష్టా చెన్నై, దక్షిణ జిల్లాల్లో 1486 పునరావాస శిబిరాలకు బుధవారం సాయంత్రం 1.25 లక్షల మందిని ముందు జాగ్రత్తగా తరలించారు. శుక్రవారం వరకు చెన్నైలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతంలో మత్సకారులు చేపల వేటకు వెళ్ల వద్దని హెచ్చరించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి గురువారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వచ్చే 12 గంటల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు. చెన్నై ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకొంటున్నారు. చెన్నై లోని అనేక కాలనీలు ఇంకా నీట మునిగి ఉన్నాయి.

అమిత్‌షా హామీ
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్రహోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామిలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.

Three killed as cyclone Nivar wreaks havoc in TN