Home తాజా వార్తలు గ్రేటర్‌లో మరో మూడు రోజులు వడగాలులు..!

గ్రేటర్‌లో మరో మూడు రోజులు వడగాలులు..!

heat-in-hyderabadహైదరాబాద్: భాగ్యనగరం అసలే కాంక్రీట్ జంగిల్.. ఆ పై వడగాలులు.. నగరవాసులు విలవిల్లాడుతున్నారు. మండే సూర్యుడు ప్రపంచ రూపం దాల్చడంతో పాటు వడగాలులు వీస్తున్నాయి. వేడిగాలులతో నగర ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి మరో మూడు రోజుల పాటు వడగాలుల ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి కర్ణాటక దక్షిణ ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా ఏర్పడిందని, దీని వల్ల నగరంలో తీవ్రంగా వడగాలులు వీస్తాయంటున్నారు.

మొత్తం మీద సూర్యప్రతాపానికి సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. ఈ వాతావరణ ప్రభావంతో వృద్ధులు, బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎంఓ డా. శేషాద్రి నాయుడు. ఇంటి నుండి బయటకు వచ్చేవారు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదమంటున్నారు. చిన్నపాటి జాగ్రత్తలతో ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చిని సూచిస్తున్నారు.

వాతావరణ ప్రభావం…

వేసవి కాలంలో సాధారణంగా వాతావరణ ప్రభావం కారణంగా హై టెంపరేచర్ 39 డిగ్రీల వరకు ఉండవచ్చు. కానీ శనివారం 42 డిగ్రీల వరకు నమోదైంది. వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే దాదాపుగా 44 డిగ్రీల మేరకు ఎండ తీవ్రత ఉన్నట్టుగా తెలుస్తుంది. వడగాలులు కూడా 7 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అదే లో టెంపరేచర్‌ను పరిశీలిస్తే.. 26 డిగ్రీల వరకు ఉండవచ్చు..కానీ 27 డిగ్రీల వరకు నమోదు అయింది. వాస్తవానికి నిన్నటి కంటే ఈ రోజు ఒక డిగ్రీ తక్కువగానే నమోదైంది. ఈ రోజు ఉక్కపోత తీవ్రంగా ఉండడంతో నగరవాసులు విలవిల్లాడిపోయారు. అయితే 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ పేర్కొంది. వడగాల్పులు వీచే సూచనలున్న పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు.

సమ్మర్‌లో వ్యాధులు..

వేసవి కాలంలలో వడదెబ్బతో పాటు హైపర్‌థైర్మియా, హీట్‌ఎగ్జాషన్, హీట్‌స్ట్రోక్ తదితర రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎండలో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమంటున్నారు వైద్యనిపుణులు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలను పాటించడం ఆరోగ్యదాయకమంటున్నారు. శరీరంలోని వేడి చెమట ద్వారా బయటకు వెళ్లుతుందని, కొన్ని సందర్భాల్లో స్వేదగ్రంధులు మూసుకుపోతాయి. దాంతో చర్మం పొడిబారి పోవడం జరుగుతుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వేసవి జాగ్రత్తలు..

వేసవి కాలంలో తాజా ఆహారంతో పాటు ఐదు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాలి.
60 శాతం కార్పోహైడ్రేట్లు, 25 శాతం ప్రోటీన్లు, 15 శాతం కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
పండ్లరసాలు, మజ్జిగ, మంచినీరు, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
తప్పనిసరిగా గొడుకు లేదా టోపీ వినియోగించడం చాలా ముఖ్యం. వెంట వాటర్‌బాటిల్ తీసుకువెళ్లాలి.
ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్‌ను శరీరానికి రాసుకోవాలి. కళ్లకు కూలింగ్ అద్దాలు ధరించాలి.
కాటన్ దుస్తులను ధరించాలి. మహిళలు తల నుంచి ముఖం మీదుగా కాటన్ రుమాలు లేదా స్కార్ప్‌ను కట్టుకోవాలి. లేదంటే చీరకొంగు కప్పుకోవడం తప్పనిసరి.
డయాబెటిక్, హైపర్‌టెన్షన్ వ్యాధిగ్రస్తులు తాము తీసుకుంటున్న డోస్‌ను వైద్యుల సూచన మేరకు మార్చుకుంటూ ఉండాలి.
వేసవి కాలంలో ప్రభలే చర్మవ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇన్‌ఫెక్షన్, అలర్జీ వంటి చర్మవ్యాధులు వస్తాయి.
శరీరతత్వాన్ని బట్టి చర్మం మూడు రకాలుగా ఉంటుంది. సాధారణం, జిడ్డు జిడ్డుగా తయారవడం, పొడిబారిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వేసవిలో డ్రై స్కిన్ ఉన్నవారు వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Three More Days Heat in Greater Hyderabad