Home తాజా వార్తలు కారు ఏకగ్రీవాల జోరు

కారు ఏకగ్రీవాల జోరు

Three more TRS nominees win MLC polls

 

మరో మూడు ఎంఎల్‌సి స్థానాలు ఏకగ్రీవం, ఆరుకు చేరిన సంఖ్య
మరో ఆరింట పోటీ, వాటిల్లోనూ టిఆర్‌ఎస్ గెలుపు ఖాయం
తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు, వరంగల్‌లో ఒక స్థానం గులాబీ పార్టీ ఖాతాల్లోకే కసిరెడ్డి, దామోదర్‌రెడ్డి, పోచంపల్లిని అభినందించిన టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని 12 ఎంఎల్‌సి స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. ఇందులో అధికార పార్టీకి ఎదురు లేకుండా పోయింది. ఇప్పటికై సగానికిపైగా స్థానాలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. రెండు, మూడు చోట్ల ప్రతిపక్షాల అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ… అధికార టిఆర్‌ఎస్‌కు దీటుగా నిలబడే శక్తి కనిపించడం లేదు. స్థానిక సంస్థల్లో అత్యధిక శాతం ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి చెందిన వారే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో పోటీ ఉన్నప్పటికీ… అది నామమాత్రం కానుంది. బరిలో ఉన్న స్వతంత్య్ర అభ్యర్ధులు కూడా ఇప్పటికే అధికార పక్షానికి మద్దతు ప్రకటిస్తూ బరిలో నుంచి తప్పుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ తన ఆధిపత్యాన్ని చాలా స్పష్టంగా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలోని ఒక స్థానంలో కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు కు పోటీగా బరిలో ఎవరు లేకపోవడంతో వారి ఎన్నిక లాంఛనంగా మారింది. అలాగే వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వరంగల్ స్థానానికి 13 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అందులో పదిమంది అభ్యర్ధుల నామినేషన్స్ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి నామినేషన్లను రద్దు చేశారు. ఇక మిగిలిన ముగ్గురు అభ్యర్ధులు కూడా గురువారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న టిఆర్‌ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవం దాదాపుగా ఖాయమైంది. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని రెండు స్థానాలు టిఆర్‌ఎస్ ఖాతాలోకి చేరనున్నాయి. ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీశైలం వెనక్కి తగ్గారు.

తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి రాత పూర్వకంగా తెలిపారు. దీంతో ఆ జిల్లా నుంచి బరిలో దిగిన గులాబీ పార్టీ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాత్రమే పోటీ లో మిగిలారు. ఫలితంగా ఈ రెండు స్థానాలకు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కరీంనగర్ జిల్లా మండలి ఎన్నికల మాత్రం రసవత్తరంగా మారింది. ఇక్కడ బరిలో పార్టీకి చెందిన అభ్యర్ధులు ఉండడంతో గడువు ముగిసిన వెంటనే అధికార పార్టీ క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చు ట్టింది. అధికార పార్టీకి చెందిన 51వ డివిజన్ కార్పొరేటర్ రవీందర్‌సింగ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో ఆయన ఆ మేరకు అధికార పార్టీ నుంచి ఓట్ల ను చీల్చుతారన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యం లో ఉమ్మది కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు ఇప్పటికే స్థా నిక ప్రజాప్రతినిధులందరినీ రహస్యంగా హైదరాబా ద్ నగర శివారులోని ఒక రిసార్ట్‌లో ఉంచారు.

మొత్తం ఈ జిల్లాలో 1,326 ఓట్లు ఉండగా ఇందులో 996 మంది అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఇక్కడ కూడా గెలుపు నల్లేరుపై నడకకానుంది. అయినప్పటికీ అధికార పార్టీ ముందస్తూ జాగ్రత్త కారణంగా వారిని రహస్య క్యాంపులకు తరలించాల్సి వచ్చిందన్న ప్రచారం వినిపిస్తోంది. ఈ జిల్లా నుంచి ఎల్. రమణ, సిట్టింగ్ ఎంఎల్‌సి భానుప్రసాద్‌లు బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇక మెదక్‌లో నిర్మల జగ్గారెడ్డి, ఖమ్మం లో రాయల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ఇక్కడి నుంచి అధికార పార్టీ నుంచి యాదవరెడ్డి, పి. మధుసూధన్‌రెడ్డిలు బరిలో ఉన్నారు. ఈ రెండు జిల్లాలో కూడా అత్యధిక శాతం స్థానిక ప్రజాప్రతినిధులంతా టిఆర్‌ఎస్ పార్టీ నుంచే కొనసాగుతున్నారు. ప్రతిపక్షాల నుంచి అభ్యర్ధులు బరిలో ఉండడం వల్లే ఈ స్థానాల్లో ఎన్నిక అనివార్యంగా మారింది.

Three more TRS nominees win MLC polls