Home సినిమా ‘బాహుబలి-2’ మూడు జాతీయ పురస్కారాలు

‘బాహుబలి-2’ మూడు జాతీయ పురస్కారాలు

bb2

ఉత్తమ నటి శ్రీదేవి ఉత్తమ నటుడు రిద్ధీ సేన్ ఉత్తమ దర్శకుడు జయరాజ్,
వినోద్ ఖన్నా కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉత్తమ తెలుగు సినిమా ‘ఘాజీ’
65వ జాతీయ పురస్కారాలను ప్రకటించిన జ్యూరీ

65వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘బాహుబలి-2’ చిత్రానికి అవార్డుల పంట పండింది . ఈ చిత్రం మూడు విభాగాల్లో అవార్డులను అందుకొని సత్తా చాటింది. ఇక ఉత్తమ జాతీయ తెలుగు సినిమాగా ‘ఘాజీ’ అవార్డుకు ఎంపికైంది. ఢిల్లీలోని శాస్త్రిభవన్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో జ్యూరీ అధ్యక్షుడైన ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ వివిధ విభాగాల్లో ఈ అవార్డులను ప్రకటించారు. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన బాహుబలి-2 చిత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా అవార్డుకు ఎంపికైంది. అదేవిధంగా ఈ సినిమా యాక్షన్ డైరెక్టర్‌కు బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా అవార్డు దక్కింది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ కేటగిరీలో కూడా ఈ చిత్రం జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. రానా హీరోగా యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ‘ఘాజీ’ ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైంది. ‘మామ్’ సినిమాలో అద్భుతమైన నటనకుగాను శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు రాగా, బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాను దాదాసాహెబ్‌ఫాల్కే పురస్కారానికి ఎంపికచేశారు. ఇక జ్యూరీలోని పది మంది సభ్యులు జాతీయ అవార్డుల విజేతలను ఎంపికచేశారు. ఈ జ్యూరీలో నటి గౌతమి, కన్నడ దర్శకులు పి.శేషాద్రి, స్క్రీన్ రైటర్ ఇంతియాజ్ హుస్సేన్, గీత రచయిత మెహబూబ్, అనిరుద్ధారాయ్ చౌదరి, రంజిత్ దాస్, రాజేశ్ మపుస్కర్, త్రిపురారి శర్మ, రూమీ జాఫ్రీ తదితరులు ఉన్నారు. మే 3న విజేతలకు జాతీయ అవార్డులను ప్రదానం చేస్తారు.

శ్రీదేవికి ఘన నివాళి… 

అందాల తార శ్రీదేవి మనల్ని వదిలిన రెండు నెలల తర్వాత మళ్లీ జ్ఞాపకాల్లోకి వచ్చారు. 65వ జాతీయ అవార్డుల్లో శ్రీదేవికి ఉత్తమ నటి పురస్కారం దక్కడం అభిమానుల గుండెలను మరోసారి బరువెక్కేలా చేసింది. తన జీవితం మొత్తం నటనకు అంకితం చేసి తను చనిపోయే క్షణం వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్న శ్రీదేవికి ఈ పురస్కారంతో సరైన గుర్తింపు దక్కింది. అయితే ఆ అవార్డును అందుకోవడానికి ఆమె లేకపోవడం అభిమానుల హృదయాలను ద్రవించేలా చేసింది. ఇక తన కూతురికి జరిగిన అన్యాయానికి పోరాడే సవతి తల్లి పాత్రలో ‘మామ్’ సినిమాలో శ్రీదేవి నటన విమర్శకులను సైతం మెప్పించింది. ఈ గొప్ప నటికి జాతీయ అవార్డును ప్రకటించి అవార్డుల  జ్యూరీ ఆమెకు ఘన నివాళిని అందించింది. రవి ఉద్యావర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మామ్’లో శ్రీదేవితో పాటు నవాజుద్దీన్ సిద్దిక్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇక శ్రీదేవికి ప్రకటించిన జాతీయ అవార్డును ఆమె భర్త బోనీకపూర్ అందుకోబోతున్నాడు. కాకతాళీయం ఏమిటంటే 80వ దశకంలో బోనీకపూర్ నిర్మించిన ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘మిస్టర్ ఇండియా’తోనే శ్రీదేవి సూపర్‌స్టార్‌గా మారింది. దానికి దర్శకుడు శేఖర్‌కపూర్. ఇప్పుడు అతనే అవార్డుల జ్యూరీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను ఎంపిక చేసిన అవార్డును బోనీ తీసుకోబోతున్నాడు.

అవార్డుల్లో పెద్ద పొరపాటు… 

జాతీయ అవార్డులు వంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాల విషయంలో జ్యూరీ పెద్ద పొరపాటు చేసింది. ‘బాహుబలి-2’ విషయంలో పొరపాటు చేసిన జ్యూరీ పలు సందేహాలను లేవనెత్తింది. ‘బాహుబలి-2’కు యాక్షన్ సీన్స్ కంపోజ్ చేసినందుకుగాను బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా అబ్బాస్ అలీ మొఘల్‌కు అవార్డును ప్రకటించింది జ్యూరీ. దీంతో ఈ సినిమా యాక్షన్ డైరెక్టర్ విషయంలో పెద్ద తప్పే జరిగింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “అబ్బాస్ అలీ మొఘల్ ఎవరు? ఆయన అసలు బాహుబలి, బాహుబలి-2కు పనిచేయలేదు”అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. వాస్తవానికి బాహుబలి చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్‌గా పీటర్ హెయిన్ పనిచేశాడు.

జాతీయ అవార్డుల వివరాలు

జాతీయ ఉత్తమ చిత్రం : విలేజ్ రాక్‌స్టార్స్ (అస్సామీ)
ఉత్తమ నటి : శ్రీదేవి (మామ్)
ఉత్తమ నటుడు : రిద్ధీ సేన్ (నగర్ కీర్తన్-బెంగాలీ)
ఉత్తమ దర్శకుడు : జయరాజ్ (భయానకం-మలయాళం)
ఉత్తమ సహాయ నటుడు : ఫహాద్ ఫాజిల్ (తొండిముత్తలం ద్రిక్‌సాక్షియుం-మలయాళం)
ఉత్తమ సహాయ నటి : దివ్యా దత్తా (ఇరాదా)
ఉత్తమ తెలుగు చిత్రం : ఘాజీ
ఉత్తమ హిందీ చిత్రం : న్యూటన్
ఉత్తమ కన్నడ చిత్రం : హెబ్బుట్టు రామక్క
ఉత్తమ తమిళ చిత్రం : టు లెట్
ఉత్తమ అస్సామీ చిత్రం : ఇషు
ఉత్తమ బెంగాలీ చిత్రం : మయూరాక్షి
ఉత్తమ మరాఠీ చిత్రం : కచ్చా లింబు
ఉత్తమ మలయాళ చిత్రం: తొండిముత్తుళుం ద్రిక్‌సాక్షియుం
ఉత్తమ యాక్షన్ చిత్రం: బాహుబలి-2
ఉత్తమ సంగీత దర్శకుడు : ఏ.ఆర్.రెహమాన్ (మామ్), (కాట్రు వెలియిదామ్)
ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేశ్ ఆచార్య (టాయ్‌లెట్ ః ఏక్ ప్రేమ్‌కథా)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: నిఖిల్ ఎస్.ప్రవీణ్ (భయానకం)
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : వినోద్ ఖన్నా