Home తాజా వార్తలు మెట్రో రెండో దశలో మూడు కొత్త మార్గాలు

మెట్రో రెండో దశలో మూడు కొత్త మార్గాలు

metro

 రాయదుర్గం నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
లక్డీకాపూల్ నుంచి ఆర్జీఏ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ప్రణాళికలు
తిరుమల నుంచి తిరుపతి వరకు మాస్టర్‌ప్లాన్ సిద్ధం : మెట్రో ఎండి

హైదరాబాద్: మెట్రో రైలు రెండోదశ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు, సంబంధించిన అనుమతులు ప్రభుత్వ నుంచి రాగానే పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 8 ఏళ్ల కాలంలో 14వేల కోట్ల వ్యయంతో మొదటి కారిడార్ మియాపూర్ నుంచి ఎల్బీనగర్, రెండవ కారిడార్ ఎంజిబిఎస్ నుంచి జెబిఎస్, మూడో కారిడార్ నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఏర్పాటు చేసి నగర ప్రజలకు ట్రా ఫిక్ కష్టాలు లేకుండా చేసి విజయవంతంగా లాభాలు బాటలో దూసుకెళుతోంది. రెండోదశ పనులు కూడా ప్రారంభిస్తే రెండేళ్ల కాలంలో పూర్తి చేసి మహానగరంలో ప్రయాణమంటే సులువు అనే మాట వినిపిస్తున్నామని చెబుతున్నారు.

త్వరలో తాము చేపట్టేబోయే ప్రాజెక్టు పనులు గురించి తెలియజేస్తామని మెట్రో ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. మహానగరంలో మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో ను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దీనికి సంబంధించిన డిపిఆర్‌ను సిద్ధం చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. రెండోదశలో రాయదుర్గం నుంచి ఆర్జీఐ 31కిమీ, లక్డీకాపూల్ నుంచి ఆర్జీఏ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు నూతన మార్గాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు వివరించారు. పాతబస్తీలో 5కిమీ మేర మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రయాణికుల ద్వారా మెట్రో రోజుకు రూ. కోటి, మెట్రో మాల్స్ నుంచి నెలకు రూ. 10 కోట్ల ఆదాయం సమకూరుతున్నట్లు పేర్కొన్నారు.

తిరుమల నుంచి తిరుపతి వరకు..

చిత్తూరు జిల్లాలలోని తిరుపతి నుంచి తిరుమల కొండపైకి మెట్రో ప్రాజెక్టు విషయంలో మూడు రోజులు సర్వే చేసినట్లు చెప్పారు. తిరుమల మొత్తం రిజర్వ్ ఫారెస్టు కింద ప్రకటించారని, మెట్రో ప్రాజెక్టు విషయంలో త్వరలో ఓ నిర్ణయానికి వస్తామని ఆయన చప్పారు. తిరుపతి నుంచి తిరుమల వరకు మెట్రో ప్రాజెక్టుకు ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమల ప్రయాణం సులువుగా చేయవచ్చన్నారు.

Three new routes in second phase of hyderabad Metro