Home జాతీయ వార్తలు కశ్మీర్‌లో ఉగ్రకాండ

కశ్మీర్‌లో ఉగ్రకాండ

 ముగ్గురు పోలీసుల కిడ్నాప్, హత్య
 ఇళ్లలోంచి తీసుకెళ్లి కాల్చి చంపిన మిలిటెంట్లు
 రాజీనామాలు చేయకుంటే మీకూ ఇదే గతి
 ఎస్‌పిఒలకు హిజ్బుల్ ముజాహిద్దీన్ హెచ్చరిక

ind

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చి పోయారు. షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు వారిని దారుణంగా హత్య చేశారు. అధికాలరు కథనం ప్రకారం.. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు షోపియాన్‌లో స్పెషల్ పోటీసు ఆఫీసర్లు( ఎస్‌పిఓ)లుగా పని చేస్తున్న నిఃవ అహ్మద్, ఫిరదౌస్ అహ్మద్, కుల్వంత్ సింగ్‌లతో పాటుగా నిస్సార్ సోదరుడు ఫయాజ్ అహ్మద్ భట్‌ను ర్వారం ఉదయం కిడ్నాప్ చేశారు. అయితే గ్రామస్థుల సాయంతో ఫయాజ్ అహ్మద్ తప్పించుకోగా, మిగతా ముగ్గుర్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ముగ్గురు పోలీసులను బాటాగుండ్, కప్రా న్ గ్రామాలలోని వారి ఇళ్లలోంచి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. బాటాగుండ్ గ్రామానికి చెందిన స్థానికులు ఉగ్రవాదులను వెంటపడి తరిమారని, కిడ్నాప్ చేయవద్దని వారిని బతిమాలుకున్నారని పోలీసు అధికారులు చెపా రు. అయితే ఉగ్రవాదులు గాలిలోకి కాల్పులు జరిపి గ్రామస్థులను బెదిరించినట్లు వారు తెలిపారు.ఉగ్రవాదులు స్థానికంగా ఉన్న నదిని దాటిన తర్వాత కిడ్నాప్ చేసిన ఎస్‌పిఓలను కాల్చి చంపారు. నదికి ఆవలివైపున ఉన్న పొదల్లో వారి మృతదేహాలను కనుగొన్నారు. ఈ ముగ్గురు ఎస్‌పిఓలను ఉగ్రవాదులు కొద్ది రోజుల క్రితం బెదిరించినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల్లోగా తమ పదవులకు రాజీనామా చేయాలని, లేదంటే చంపేస్తామని ఉగ్రవాదులు బెదిరించినట్లు చెప్తున్నారు. కాగా ఎస్‌పిఒ లుగా పని చేస్తున్న కశ్మీరీలు తమ పదవులకు రాజీనామా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ ఒక వీడియోలో స్థానికులను బెదిరించింది. ఈ సంఘటనలతో రాష్ట్ర పోలీసులు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. ఆరుగురు ఎస్‌పిఒలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వారిలో నలుగురు ఎస్‌పిఓలు, ఒక పోలీసు కానిస్టేబుల్ ఉన్నారు. కాగా ఉగ్రవాదుల చర్యను పిరికిపందల చర్యగా కాశ్మీర్ రేంజి ఐజి స్వయంప్రకాశ్ పాని అభివర్ణించారు. మృత జవాన్లకు నివాళి అర్పించిన ఆయన త్వరలోనే దోషులను పట్టుకుని చట్టం ముందు నిలబెడతామన్నారు. కాగా 30 ఏళ్ల కశ్మీర్ ఉగ్రవాద చరిత్రలో మిలిటెంట్లు పోలీసులను వారి ఇళ్లలోంచి కిడ్నాప్ చేసి హతమార్చడం ఇదే మొదటిసారి.
ఇంకెంతమంది ప్రాణాలుపోవాలి: మెహబూబా
షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు ముగ్గురు స్పెషల్ పోలీసు అధికారులను కిడాప్ చేసి దారుణంగా హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మెహబూబాముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ‘ ఉగ్రవాదుల తూటాలకు మరో ముగ్గురు పోలీసులు బలయ్యారు. ఇది తీవ్ర దిగ్భాంతికి గురి చేసే సంఘటన. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. బాధిత కుటుంబాలకు ఓదార్పే కరువవుతుండడం దురదృష్టకరం. రాష్ట్రంలో పోలీసులు, వారి కుటుంబ సభ్యుల కిడ్నాప్‌లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. బలప్రయోగంతో ఏదయినా సాధించవచ్చన్న కేంద్రం విధానం పని చేయడం లేదు. చర్చలు ఒక్కటే దీనికి పరిష్కారం. అయితే ఇది కేవలం కలగానే మిగిలిపోతోంది’ అని మెహబూబా ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
ఎవరూ రాజీనామా చేయలేదు: కేంద్రం
ఇదిలా ఉండగా షోపియాన్‌లో ఉగ్రవాదులు ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి హతమార్చడంతో రాష్ట్రంలో కొంతమంది పోలీసులు రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను కేంద హోంశాఖ తోసిపుచ్చింది. రాష్ట్రంలో పోలీసులెవరూ రాజీనామా చేయలేదని, ఈ వార్తలన్నీ కూడా దుష్టశక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారం మాత్రమేనని హోం శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట్ర పోలీసులు చేపడుతున్న ముందస్తు చర్యల కారణంగా మిలిటెంట్లు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని, ఫలితంగానే వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని హోం శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.‘ జమ్మూ కశ్మీర్‌లో కొంతమంది పోలీసులు రాజీనామా చేసినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ ప్రకటన తెలిపింది.