Home కరీంనగర్ ముగ్గురు దోపిడీ దొంగలు అరెస్ట్

ముగ్గురు దోపిడీ దొంగలు అరెస్ట్

Robbery

 

బంగారు పుస్తెల తాడు, కత్తి, ఆటో స్వాధీనం

గోదావరిఖని : జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ గతంలో జైలుకి వెళ్లి వచ్చినా కూడా ఎలాంటి మార్పు లేకుండా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న రాయదండికి చెందిన గుమ్మాల వసంత కుమార్, తోకల సిద్దార్థ, పాత రామగుండంకు చెందిన సురేష్‌లను శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఈమేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం కమిషనరేట్ అడిషనల్ డిసిపి (అడ్మిన్) అశోక్‌కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. జైలుకి వెళ్లి వచ్చినా ప్రవర్తనలో మార్పు రాకుండా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకోవాలని సిపి సత్యనారాయణ ఆదేశాల మేరకు రామగుండం సిసిఎస్ పోలీసులు అనుమానితులను విచారిస్తూ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 9గంటల సమయంలో సిఐ బుద్ధ్ద స్వామి, అంతర్గాం ఎస్‌ఐ రామక్రిష్ణ, సిసిఎస్ సిఐ వెంకటేశ్వర్లు, శ్రీనివాస రావులు తమ సిబ్బందితో కలిసి బి పవర్‌హౌజ్ క్రాస్ రోడ్డు వద్ద ఆకస్మిక వాహనాల తనిఖీని నిర్వహించారని తెలిపారు. ఈ తనిఖీలలో ఆటోని ఆపి వాహన పత్రాలు అడగగా వారి సమాధానం, ప్రవర్తనపై అనుమానం వచ్చిన సిబ్బంది ఆటోని తనిఖీ చేయగా ఒక గుడ్డలో చుట్టి ఉన్న కత్తి లభించిందన్నారు. ఆటోలో ఉన్న ముగ్గురిని విచారించగా వారు గతంలో అంతర్గాం, ఎన్టీపిసి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డట్టు ఒప్పుకున్నారని అడిషనల్ డిసిపి తెలిపారు. పగటి పూట ఆటో (టిఎస్ 22 టి 1101)లో తిరుగుతూ పంట పొలాలలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని వారిని చంపుతామని బెదిరించి దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతున్నారని, సొత్తును అమ్మి వచ్చిన డబ్బుతో జల్సా జీవితం గడుపుతున్నారని అడిషనల్ డిసిపి వివరించారు.

ఇదే విధానంలో అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంపేట గ్రామ శివారులో 2017 నవంబర్ 3న పత్తిచేనులో పనిచేస్తున్న కొసవి విమలను కత్తితో బెదిరించి మూడు తులాల పుస్తెల తాడు (విలువ రూ.1,05,000లు)ను దొంగలించుకు పోయారని వివరించారు. వీరిపై సిసిసి నస్పూర్‌లో ఒక కేసు, అంతర్గాం పిఎస్ పరిధిలో ఒక కేసు, ఎన్టీపిసి పిఎస్ పరిధిలో రెండు కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరి వద్ద నుండి గతంలో దొంగలించిన మూడు తులాల బంగారు పుస్తెల తాడు, ఒక బ్యాటరీ, కత్తి, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన సిసిఎస్ సిఐలు ఎ.వెంకటేశ్వర్లు, శ్రీనివాస రావు, ఎస్‌ఐలు మంగిలాల్, నాగరాజు, హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి రెడ్డి, కానిస్టేబుళ్లు దేవేందర్, సుధాకర్, శ్రీనివాస్, అలెక్స్, రవి, రమేష్‌లను అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్‌కుమార్ అభినందించారు.

Three Robbery Thieves Arrested by Police